🔱ఓం నమః శివాయ🔱:
*తిరుప్పావై 22వ పాశురం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*22.పాశురం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన*
*బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే*
*శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్*
*కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే*
*శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;*
*తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్*
*అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్*
*ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్!!*
*భావం :-*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
సుందరము విశాలము అగు మహాపృధివి మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనెడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమైవచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము.
చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింప చేయుము.
సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించునట్లు ఉండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా ! మేము అనుభవించియే తీరవలెననెడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును.
ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము.
మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము.
సూర్యచంద్రులు ఉదయించునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది.
*అవతారిక :-*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుమని వెనుక పాశురమున ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురమున వివరించుచున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉండును.
సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంతాభిమానము. వెనుకటి దానిలో శత్రువులు రాజ్యములను వదలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చితిమి - అని చెప్పిరి.
తిరిగి రాజ్యము ఇచ్చినను స్వీకరింపుము. అని శత్రువులు నీ వాకిటనే ఉన్నట్లు ఉంటిమి. అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పిరి.
భగవానుని ఆశ్రయించునపుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి భగవానునికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అట్లే ఈ పాశురమున తమ అనన్యార్హత్వమును విజ్ఞాపన చేయుచున్నారు.
పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది.
ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.
*కల్యాణిరాగము - రూపక తాళము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ
ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!
అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని
పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!
1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ
సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల
అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము
మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి
ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
*అనన్య గతిత్వం*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
మనిషి వస్తువులపై ఏర్పరుచుకున్న అభిమానం ఎప్పటికీ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు.
ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట.
వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు.
ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు.
అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. *"ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కావున ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్"* ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు.
ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.
మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు.
ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు.
*“అంగణ్ మా ఞాలత్తరశర్”* ఈ అందమైన భుమి మీద *“అబిమాన పంగమాయ్ వందు”* అభిమానాలను వదులుకొని వచ్చి *“నిన్ పళ్ళికట్టిల్ కీరే”* నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా.
మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి.
ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.
*“శంగమ్ ఇరుప్పార్ పోల్”* అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము.
*“వందు తలై ప్పెయ్-దోమ్”* ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు.
మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.
ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, *“కింగిణివాయ్ చ్చేయ్ద”* చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని *“తామరై ప్పూప్పోలే”* పద్మాల్లా *“శెంగణ్ శిఱుచ్చిఱిదే”* అందముగా, మెల్లి మెల్లిగా *“యెమ్మేల్”* మాపై *“విరయావో”* ప్రసరించేట్టు చెయ్యి.
*“తింగళుమ్”* చంద్రుడి చల్లటిచూపులాగా *“ఆదిత్తియనుమ్”* సూర్యుడి కాంతి వలె *“ఎరుందాఱ్పోల్”* ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించే వారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి *“ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం”* అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.
తప్పు తప్పు *“అంగణ్ ఇరండుం”* ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, *“కొండు ఎంగళ్మేల్”* వాటిని మాపై పడేట్లు చెయ్యి.
*“నోక్కుదియేల్ ఎంగళ్మేల్”* ఆచూపులు మాపై పడితే *“శాపం ఇరింద్”* మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి.
*“చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన”* నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.
🕉️🌞🌏🌙🌟🚩
*తిరుప్పావై 22 వ పాశురము తెలుగు పద్యానువాదము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*
సీ.నీ వీక్షణమ్మును నిలుపుము మా పైన
దయగల చూపున్న తండ్రి వీవు
చిన్న గజ్జెల వలె యున్నట్టి తామర
యెర్రగా మెరిసెడు వెలుగు వచ్చె
అందమౌ యీ లోక మందున్న రాజులు
మానాభిమానాలు మానినారు
సుందరమౌ గద్దె క్రింద బృందమ్ముగా
నిలిచి మా డెందము చలువ చేసి!!
తే.గీ. కన్ను కొసలలో చూపు మాకున్న చాలు
పాద ధూళియు మాపైన పడిన యంత
పాప మంటదు పరమాత్మ బాపు యిడుము
తాపముల చల్ల బరచును దయయు యున్న
చూపు మాపైన ప్రసరింపు సుందరాంగ
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నొసగు
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి