6, జనవరి 2025, సోమవారం

*శ్రీమద్ భాగవతం* *(12వ రోజు)*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(12వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *కాల పరిమాణం*

      *జయవిజయలు కథ.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నాలుగు జాముల కాలం మానవులకు ఒక పగలు. అలాగే నాలుగు జాముల కాలం ఒక రాత్రి. మొత్తం ఎనిమిది జాముల కాలం ఒక అహోరాత్రం.*


*పదిహేను అహోరాత్రాలు ఒక పక్షం. ఈ పక్షాలు రెండు, ఒకటి శుక్లపక్షం, రెండు కృష్ణపక్షం. ఈ రెండు పక్షాలూ కలిపితే ఒక మాసం. రెండు మాసాలు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక ఆయనం. ఈ ఆయనాలు రెండు. ఒకటి ఉత్తరాయనం. రెండు దక్షిణాయనం. ఈ ఆయనాలు రెండూ కలిస్తే మానవులకు ఒక సంవత్సరం. నూరు సంవత్సరాలు పరమాయువు.*


*మానవుల మాసం పితృదేవతలకు ఒక రోజు. అలాగే మానవుల సంవత్సరం దేవతలకు ఒక దినం.*


*యుగాలు నాలుగు. అవి కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు. యుగానికీ యుగానికీ మధ్య కాలాన్ని ‘సంధ్యాంశ’గా పేర్కొంటున్నారు. ఈ సంధ్యాంశతో కలుపుకుని కృతయుగ పరిమాణం పదహారు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు. సంధ్యాంశతో కూడిన త్రేతాయుగ పరిమాణం పదిహేను వేల ఆరు వేల దివ్య సంవత్సరాలు. అలాగే ద్వాపరయుగం పద్నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలు. కలియుగం పదమూడు వేల రెండు వందల సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలూ వేయిసార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పగలు. అలాగే వేయిసార్లు తిరిగితే ఒక రాత్రి. బ్రహ్మ మెలకువలో ఉంటే సృష్టి జరుగుతుంది. నిద్రపోతే విలయం సంభవిస్తుంది.*


*పద్నాలుగు మంది మనువుల కాలం బ్రహ్మకు ఒక రోజు. ఒకొక్క మనువు ఆయుః ప్రమాణం డెబ్బయి ఒక్క మహాయుగాలు. మనువుల మధ్య ఉండే భాగాల్నే మన్వంతరాలు అంటారు. ఈ మన్వంతరాలలోనే మనువంశపురాజులూ, సురలూ, మునులూ భగవదంశాన పుట్టి పాలన చేస్తారు. బ్రహ్మమానంలో నూరేళ్ళు బ్రహ్మకు ఆయువు. అతని ఆయువులోని సగభాగాన్ని ‘పరార్థం’ అంటారు.విదురుడికి మైత్రేయుడు కాలపరిమాణం గురించి చెబుతున్న సమయానికి బ్రహ్మకు మొదటి పరార్థం గడిచింది. రెండవది నడుస్తున్నది. మొదటి పరార్ధం మొదటి భాగంలోనే బ్రహ్మ జన్మించాడు. కాబట్టి దీనిని ‘బ్రహ్మకల్పం’ అన్నారు. క్షీరసాగర మధ్యంలో శయనించిన శ్రీమన్నారాయణుని నాభి నుంచి పద్మం ఉద్భవించిన కాలం ‘పద్మకల్పం’. ఈ రెండు కల్పాలూ మొదటి పరార్థంలో గతించాయి. రెండవ పరార్థం మొదటి భాగంలో శ్రీమన్నారాయణుడు వరాహావతారం దాల్చాడు. ఆ కారణంగానే ‘వరాహకల్పం’ అని పేరొచ్చింది. ఇప్పుడు నడుస్తున్నది వరాహకల్పం.*


*జయవిజయలు:॥~*


*అనంతకోటి అవతారాలలో భగవంతుని పది అవతారాలే ప్రధానమయినవి. తాత్పర్యం అంటే జగత్కంటకులయిన రాక్షసులను సంహరించి, భూభారాన్ని తగ్గించేందుకే భగవంతుడు ఒకొక్క అవతారాన్నీ దాల్చాడు. రాక్షసులలో కొందరు మహాబలశాలులై, వరప్రభావంతో కూడా మరణాన్ని శాసిస్తూ లోకాలన్నిటినీ వేధిస్తూ వచ్చారు.*


*రాక్షసుల్లో హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు, రావణ-కుంభకర్ణులు ముఖ్యులు.*


*అసాధారణ బల పరాక్రమాలు కలిగిన ఈ రాక్షసులు, దేవాంశతో శాపవశాన భూమి మీదకు రాగలిగారు. ఈ శాపానికి కారణమైనదే జయవిజయులు కథ.*


*వైకుంఠంలో విష్ణుమూర్తి వద్ద ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు-విజయుడు. ఇద్దరూ విష్ణుభక్తులే!*


*‘ఒకనాడు సనక సనందనాదులు విష్ణు సందర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. సనకసనందనాదులు మహామునులు, బ్రహ్మ మానసపుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తూ వారికి ఈశ్వరమయం గానే కాన వస్తుంది. సమస్తలోకాలనూ యోగబలంతో సంచరించగలిగే వారికి ఎక్కడా ఎలాంటి అడ్డూ ఆపూ లేదు, ఉండదు. వారెప్పుడూ అయిదేళ్ళ ప్రాయంలోనే ఉంటారు. నగ్నంగా ఉంటారు. బాలురవలే కనిపిస్తారు.*


*మానస వైకుంఠంలో ప్రవేశించిన సనకసనందనాదులు ఆరు ద్వారాలు దాటారు. ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయవిజయులు కాపలాగా ఉన్నది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల కేళీమందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయవిజయుల అనుమతి ఉండి తీరాల్సిందే! అయితే సనకసనందనాదులకు ఒకరి అనుమతితో పని లేదు. బ్రహ్మ స్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతున్నారు. గమనించారది జయవిజయలు. అడ్డగించారు వారిని. అడ్డగించడమే కాదు, మదాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: