1, జులై 2021, గురువారం

అంతమంది దేవుళ్ళు ఎందుకు?

 ప్రముఖ తమిళ కవిచక్రవర్తి కణ్ణదాసన్ ని ఓ విదేశీయుడు అడిగారిలా....


"మీకు (అంటే హిందువులకు) అంతమంది దేవుళ్ళు ఎందుకు? పైగా రాముడు, కృష్ణుడు, శివుడు, పార్వతి, సరస్వతి, లక్ష్మి, కాళి, కుమారస్వామి, బ్రహ్మ, వినాయకుడు ఇలా దేవుళ్ళకు అనేక పేర్లు పెట్టుకున్నారు. మీరూ మాలాగా ఒకే ఒక్క దేవుణ్ణి పెట్టుకో వలసింది కదా" అని!


కణ్ణదాసన్ ఆయన చెప్పినదంతా విని ఇలా అడగసాగారు...


"మీ తల్లిదండ్రులకు మేరేమవుతారు?"


దానికి విదేశీయుడి జవాబు "నేను వారికి కొడుకుని"


"మీ భార్యకు...?" అని కణ్ణదాసన్ ప్రశ్న.


"భర్తను"


"మీ పిల్లలకు...?"


"తండ్రిని" 


"మీ అన్నయ్యకు...?"


"తమ్ముడిని"


"తమ్ముడికి...?"


"అన్నయ్యను"


"మీ భార్య తమ్ముడికి?"


"బావను"


"అన్నయ్య పిల్లలకు...?"


"బాబాయిని"


అప్పటికీ ఆగక కణ్ణదాసన్ ప్రశ్నల పరంపర.


కొనసాగుతూనే ఉంది....


పెద్దనాన్న, మేనమామ, అల్లుడు, ఇలా అనేక బంధాలను అతనితో చెప్పించారు.


కొన్ని నిముషాల తర్వాత కణ్ణదాసన్ ఆగి


మళ్ళీ మాటలు కొనసాగించారు....


"చివరికి మట్టిలో కలిసిపోయే మీ దేహానికే ఇన్ని రకాల బంధాలూ, వాటికి రకరకాల పేర్లూ... అవసరమయ్యాయి. అటువంటిది ఇక్కడా అక్కడా అని కాకుండా సర్వాంతర్యామి అయి ప్రపంచాన్ని కంటికి రెప్పలా చూసుకునే పరమాత్మను అనేక నామాలు ఉండటంలో ఆశ్చర్యమేముంది...అయినా అవీ తక్కువే.... అతను దేనికీ లొంగడు. అన్నింటిలోనూ ఉండేవాడు. నీలోనూ ఉంటాడు. నాలోనూ ఉంటాడు. నిన్ను పిలిచినా అతనే. నన్ను పిలిచినా అతనే" అని అనగానే ఆ విదేశీయుడు మరొక్క మాట మాటాడితే ఒట్టు.

-------------------------------------------

మూలం - తమిళం

అనుసృజన - యామిజాల జగదీశ్

కామెంట్‌లు లేవు: