1, జులై 2021, గురువారం

అరిషడ్వర్గాలు

 అరిషడ్వర్గాలు అంటే (అంతహ్ శత్రువులు)

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ను అరిషడ్వర్గాలు అని పేరు. అరి అంటే శత్రువు. ఆరుగురు శత్రువులని అర్థం. ఇవి ఎవరికి శత్రువులు? వీరెక్కడ ఉంటారు? ఎవర్ని అంటి పెట్టుకుని ఉంటే వారికే శత్రువులు. వారి మనస్సు లోనే నివాసముంటారు.

         ఒక మంచి పని చేయాలన్నా, ఒకదాన్ని బాగు చేయాలన్నా పదిమంది కావాలి. కానీ చెడగొట్టడానికి ఒక్కడు చాలు. ఈ ఆరు అంతహ్ శత్రువులు లో ఏ ఒక్కరు ఉన్న అది కలిగించే వినాశనం అంతా ఇంతా కాదు. మనస్సు స్వతహాగా వికారం లేనిది. ఈ అరిషడ్వర్గాలు మనస్సు ను పెనవేసుకుని దానిపైన వాటి ప్రభావం చూపెడతాయి. అందువలన మనస్సు ఇంద్రియాలకు వాటికనుకూలముగా ప్రేరణ ఇస్తుంది.

కామం :- తనకు ఇష్టమైన రూపం తనకు సొంతం కావాలని అనుకోవడం, తనకు నచ్చిన స్పర్శ నిత్యం అనుభవానికి రావాలని అనుకోవడం.

క్రోధం :- తాను కావాలని అనుకున్నది దక్కని పక్షంలో ఆ కామమే క్రోధం గా పర్యవసిస్తుంది. తనకు నచ్చిన రూపం మరొకరికి దక్కడం తను ఇష్టపడిన స్పర్శ తనకు దూరం కావడం వంటి పరిస్తితులలో మనిషి అనుభవించే ఒకానొక ఉద్రిక్తభరితమైన స్థితి పేరే క్రోధం.


లోభం :- కోరకూడని కోర్కె కోరడం, అంటే బంగారు లేడిని చూచి అది తనకు కావాలని సీతాదేవి కోరడం లోభం. బంగారు లేడి ఉంటుందా? లేదా? అనే వివేకం కోల్పోవడం, ఫలితంగా భర్తకు దూరమై పర పురుషుని ఇంట కష్టపడవలసి వచ్చింది.

మోహం :- దూరమైన దానిపట్ల స్మరణ అధికమై, మోజు పెరిగిపోయి, తన నిజ స్థితి ఏమిటో గ్రహించలేని దశకు మనిషి చేరుకుంటాడు. దాన్నే మోహం అంటారు. లేడి కోసం వెళ్లిన రాముడు భార్య వియోగము ను పొందాడు.

మదం :- తనంత శక్తి సంపన్నుడు లేడనేది మదం.

మాత్సర్యం :- తనకు దక్కని వస్తువేదైనా(సీతతో సహా) ఇతరులకు దక్కకూడదనేదే మాత్సర్యం.

          పై రెండు లక్షణాలు తోనే రావణుడు చెడిపోయేడు. ఇలా అనేకానేక మందిని పరిశీలించితే పైన పేర్కొన్న అరిషడ్వర్గాలు లో ఏదో ఒక లక్షణం కలిగిన వారే కావడం తోఏదో ఒకరకంగా కష్టాలు పాలైన వారే. ఒక లక్షణం కలిగిన వారే కావడం తో ఏదో ఒక రకంగా కష్టాలు పాలైనవారే ఈ అరిషడ్వర్గాలు ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉంటాయి.

      ఈ అరిషడ్వర్గాలు కు మూలమైన కోర్కెలు (కామం) ను జయించగలిగితే అంతా ఆనందమే. మామూలు ఆనందం కాదు. సచ్చిదానందం.

కామెంట్‌లు లేవు: