6, అక్టోబర్ 2022, గురువారం

పరిపూర్ణ కృప!!

 *పరిపూర్ణ కృప!!*


ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దసరా వేడుకలు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి..నిలువెత్తు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం మొదలు..సుమారు 150 పై చిలుక మంది భవానీ కంకణ దీక్ష తీసుకోవడం..ఆశ్వీయుజ పాడ్యమి నుంచి నిన్నటి విజయదశమి వరకూ అమ్మవారి కి పూజలు.. హారతులు...ప్రతిరోజూ ఇంతమంది దీక్షాధారులచే భజనలు..శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర పరిసరాలు ఎరుపు వర్ణ శోభితమై..అత్యంత కోలాహలం గా ఉత్సవం జరిగింది...


విజయదశమి రోజు రాత్రికి దీక్షాధారులచే పండరిభజన..భజన అనంతరం అగ్నిగుండం త్రొక్కడం ఆనవాయితీ..భవానీ కంకణ దీక్ష స్వీకరించిన స్వాములే కాకుండా..అగ్నిగుండం త్రొక్కడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తారు.. పైగా దీక్ష ముగింపు వేడుక కనుక..ఒక చిన్నపాటి తిరునాళ్ళ వాతావరణం ఏర్పడుతుంది.. అందరు భక్తులకు అన్నదానము ఏర్పాట్లు యధావిధిగా దాతల సహకారం తో జరుపుతాము..ఇవన్నీ మామూలుగా జరిగే కార్యక్రమాలు..


కానీ..


నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.. ఒక్కసారిగా వర్షం ప్రారంభం అయింది..ఇన్ని ఏర్పాట్లు..ఇంత ఉత్సవమూ..పండరిభజన..అగ్నిగుండం త్రొక్కడం..అన్నీ ఆగిపోతాయేమో ననే అభిప్రాయం ఏర్పడింది..


"ప్రకృతి కి మనం విరుద్ధంగా పోగలమా?.." 


" ఈసారి ఇలా సరి పెట్టుకోవాలి..ఎంత ప్రాప్తమో అంతే..విజయవాడ దుర్గ గుడి అధికారులు కూడా భారీ వర్షం కారణంగా అమ్మవారి తెప్పోత్సవం కూడా రద్దు చేసారు..మనమెంత?.." 


ఇలాటి వ్యాఖ్యలు వినబడుతున్నాయి..మా దంపతులము ఈ మాటలు వింటూ మౌనంగా ఉన్నాము..ఇంత ఉత్సవమూ ఇంత ఘనంగా జరగడానికి సూత్రధారిగా ఉన్న మా అర్చక స్వామి అశ్వనీ కుమార్ దుఃఖాన్ని ఆపుకోలేక..మా సిబ్బంది ముందు కన్నీళ్ల పర్యంతం అయ్యారు..


ఇక మాకు దిక్కు..ఆ అవధూత దత్తాత్రేయుడు..పూజలు అందుకున్న అమ్మవారు..వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ప్రార్ధించుకున్నాము..ఈ సమయం లో శరణాగతి చెందడం మినహా మరే దారీ లేదు..నిర్ణయం ఆ తల్లీ బిడ్డలకు..(శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే సమయం లో తన ఆవాసంగా పార్వతీదేవి మఠాన్ని ఎంచుకొని..ఆ పార్వతీదేవి తనను తల్లిగా ఆదరిస్తోందని చెప్పుకునే వారు..) వదిలేసాము..


వచ్చిన భక్తులందరూ రాత్రి భోజనాలు చేశారు..సరిగ్గా ఆ సమయానికి వర్షం ఆగిపోయింది..మరో గంటకు స్వాములు పండరి భజన మొదలు పెట్టారు..అగ్నిగుండం ప్రజ్వరిల్లింది..భజన ఏ ఆటంకం లేకుండా పూర్తి అయింది..అందరు స్వాములు అగ్నిగుండాన్ని త్రొక్కారు.. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులూ అగ్ని గుండ ప్రవేశం చేశారు..ఇదంతా పూర్తయ్యే సరికి ఈ తెల్లవారుఝాము 5 గంటలు అయింది..


అంతవరకూ వర్షం లేదు..అగ్నిగుండాన్ని తెల్లటి వస్త్రం తో కప్పివేసి మట్టి తో పూడ్చి వేశారు..వర్షం లేదు..అందరు భక్తులూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లోకి వచ్చారు..అప్పుడు మళ్లీ వర్షం మొదలైంది..మబ్బులతో వాతావరణం చీకట్లు కమ్ముకొని ఉంది..(ఈ మాటలు రాసే సమయానికి ఇంకా వర్షం వీడలేదు..) 


ఇక మాకు భయం లేదు..కొండంత దత్తాత్రేయుడు అండగా వున్నాడు..అమ్మవారి దయ పరిపూర్ణంగా ఉంది..అంతకంటే ఏం కావాలి?...


సర్వం..

శ్రీ దత్త కృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 99089 73699 & 94402 66380.).

కామెంట్‌లు లేవు: