మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ..*
*(ఎనిమిదవ రోజు)*
వ్యాసాశ్రమం లో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడి క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది..తెల్లగా..సన్నగా ..తేజస్సు ఉట్టిపడుతున్న ముఖం తో ఉన్న ఆ బాల యోగి అందరినీ ఇట్టే ఆకర్షించాడు.. నియమిత ఆహారం..యోగ సాధన..నిరంతర భజనలు..భగవన్నామ సంకీర్తనమూ..సాధు సత్పురుషుల ఉపదేశాలూ..ఎటు చూసినా ఒకరకమైన భక్తి భావం తొణికిసలాడే ఆ ఆశ్రమం..శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశం గా తోచడం లో ఆశ్చర్యం లేదు..
శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది..దానికి తోడు ఆయనకే స్వంతమైన ధారణ శక్తి తో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది..శ్రోతలు మంత్ర ముగ్ధుల్లా వినేవారు..తనకు సందేహం వస్తే..గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు..చెరగని చిరునవ్వు తో ఉండటం..ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం..గురువుల వద్ద వినయం తో ప్రవర్తించడం..తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం..మొదలైన గుణాల వలన అనతికాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు..
సరిగ్గా ఆ సమయం లోనే..కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువు గా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు..ఆశ్రమానికి కూడా ఈ యువకయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయ సాగారు..ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ..ఆనాటి నుంచి, శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు..ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది..మూలకారణం ఏమిటో అని ఆరా తీశారు..ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు..
శ్రీ స్వామివారు ఎంతో పరిణితి తో ఆలోచన చేశారు..తన జీవిత లక్ష్యం మోక్ష సాధన..అంతేకానీ ఆశ్రమ నిర్వహణ కాదు..మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి..కీర్తి తో వచ్చే బంధాలు ("ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అండీ..అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం..) కొన్ని..పదవుల తో (ఆశ్రమ నిర్వహణ, గురు పీఠం ఇత్యాదులు) వచ్చే బంధాలు కొన్ని..ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం సుతరామూ ఆయనకు ఇష్టం లేకుండా పోయింది..క్రమంగా ఆశ్రమ వాసుల లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది..ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది..ఇక ఇక్కడ వుంటే..తనమీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతెల్లంగా తెలిసిపోయింది..
శ్రీ స్వామివారు ఆలోచన చేశారు..ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్లి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకుని, గురువుల అనుమతి తీసుకొని బైటకు వచ్చారు..అలా చిత్తూరు జిల్లాలో "పాపానాయుడుపేట" అనే గ్రామానికి చేరారు..ఆగ్రామంలో "బాలబ్రహ్మం" అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి.."ఈతడు సామాన్యమానవుడు కాదే..ఇలా తిరుగుతున్నాడేమిటి?.." అని తనలో తానే తర్కించుకుని, శ్రీ స్వామివారిని చేరదీసి..వాకబు చేశారు..బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిసాడో..శ్రీ స్వామివారికి అంతర్వాణి "ఇతడే నీ గురువు.." అని ప్రబోధించింది..శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసారు..
"లే నాయనా!..దారితప్పి, దిక్కుతోచక అల్లాడుతున్నావా?..ఇక నీకు భయం లేదు..నిత్యమూ, సత్యమూ అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం..ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నీవు శోధించుకోవాలి..పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్ధమయింది..ఆత్మ ను గ్రహిస్తే..పరమాత్మ వశం అవుతాడు.." అని చెప్పి, తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి..గురూపదేశం చేశారు..భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేసారు..
బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం, శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్తైర్యాన్ని నింపింది..కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి..తిరిగి ఎర్రబల్లె చేరారు..ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి..మోక్ష సాధన..మోక్ష సాధన..ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన!..ఇదే తపన!..
భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే..భగవంతుడు చూస్తూ ఊరుకోడు.. తన దగ్గరకు పిలిపించుకుంటాడు..మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు, శ్రీ స్వామి వారి మొర ఆలకించాడు..శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది..ఒక్కక్షణం ఆలస్యం చేయలేదు.. పరుగు పరుగున మాలకొండ చేరారు..
మాలకొండలో తపోసాధన..రేపటి భాగంలో..
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి