26, అక్టోబర్ 2023, గురువారం

రు క్మి ణి వే డి కో లు

 శు భో ద యం🙏


రు క్మి ణి వే డి కో లు!!


జగదంబను రుక్మిణి వేడుట! 


            ఉ:  నమ్మితి  నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్  


                 మిమ్ము , పురాణ దంపతుల  మేలుభజింతు గదమ్మ ! మేటి   పె


                ద్దమ్మ !  దయాంబురాసివి గదమ్మ!  హరిం బతిసేయుమమ్మ!  నిన్


                నమ్మిన  వారి  కెన్నటికి  నాశము  లేదు గదమ్మ!    యీశ్వరీ !


                    శ్రీ భాగవతము- దశమస్కంధము- 1741 పద్యం:  బమ్మెఱపోతన;


                               తెలుగు వారి  పుణ్యాల పేటి  శ్రీ మహాభాగవత గ్రంధము. ఇది 18 పురాణములకు  మించిన నహాపురాణముగా

ప్రసిధ్ధి గాంచినది. శ్రీకృష్ణ పరమాత్ముడే నాయకుడుగా వెలసిన యీగ్రంధమున  నతని లీలా వినోదములే యనేక రసవద్ఘట్టములుగా , తీరిచి దిద్ద బడినవి. రక్తికి , భక్తికి , ముక్తికి ,యీగ్రంధము మూలమై యాంధ్ర సాహిత్యమున కొక వెలలేని యలంకారమై భాసించు చున్నది. భాగవతమునందలి  రసవద్ఘట్టములలో  రుక్మణీకళ్యాణము  ప్రముఖమైనది. 


                                 పెండ్లి కుమార్తెయగు  రుక్మణి  శిశుపాలుని  వరింప నిష్టపడక  తాను మనసిచ్చిన కృష్ణ పరమాత్మకు తనహృదయమును నివేదించి  యతనిని దోడ్కొని వచ్చుటకు అగ్నిద్సోతనుడను బ్రహ్మణ వర్యుని  ద్వారకకు పంపినది.తడవైనది యతడురాడాయెను.ముహూర్తము దరియు చున్నది.  గౌరీ పూజయు ,ప్రారంభమైనది. డోలాయమాన చిత్తయగు రుక్మిణి  సర్వమునకు  ఆపరమేశ్వరిపైననే భారముంచి  ఆజగ దంబ  నిట్లని ప్రస్తుతింప సాగినది. 


                   పోతన కవి చాతుర్యమంతము  పద్యము యెత్తుగడలోనే ప్రదర్శించినాడు."  నమ్మితి నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్ మిమ్ము"- అమ్మా!  నేను  మిమ్మల్నే నమ్ము కొన్నాను. మీరు సనాతన దంపతులు. మీకన్న నాకు దిక్కెవ్వరు?అనుచున్నది. ఆమాటతో భారమంతయు పార్వతీ పరమేశ్వరులపై నుంచినట్లయినది.


                      పార్వతీ పరమేశ్వరులనే  గోరనేల? వారును ప్రేమ జంటలే !వారినిగూడ పెద్దలు వారించినారు. అయినను వారిరువురు సతీపతులైనారు. ఎన్ని యుగములైనదో వారిదాంపత్య మారంభమై,కావున వారు పురాణదంపతులు. అట్టి దంపతులదీవెనలే పెండ్లికుమార్తెకు కావలసినది. నచ్చినవరుతో కళ్యాణము ఆడుదానికి ఒక అమూల్యమైన వరముగదా! ఆవరము నీయగల

శక్తి శివ పార్వతులకేగలదు. కాబట్టే రుక్మిణి వారినాశ్రయించుట. గౌరీ పూజలోని ఆంతర్యమిదే !


                                     మిమ్ము పురాణదంపతుల  మేలుభజింతు గదమ్మ" ఆది దంపతులగు మిమ్ము  నెల్లవేళల పూజింతునుగదా!

నాచేపూజలందెడు మీరే నాకోర్కెదీర్పవలె. వేరెవ్వరు దీర్పగలరు.? 


                    మేట్టి  పెద్దమ్మ!  అమ్మలకు  అమ్మలున్నారు కాని  మేటియైన పెద్దమ్మల నెక్కడ గాంచగలము. ఆతల్లి పార్వతియే!" ఆకీట,

బ్రహ్మపర్యంతం ,ఆమెయే జనని. జగజ్జనని. కావున నందరకు పెద్దమ్మ ఆమెయే! పెద్దలే పిల్లలకోరికలు దీర్చాలి. లేకున్న వారి పెద్దరికమునకే అవమానము.


                     "దయాంబురాశివి గదమ్మ" ఆమె దయా సముద్ర. సువిశాలమై  అగాధమై  యనంతమైన  సముద్రముతో  నామెదయకు పోలిక. ఆహా! యెంత చక్కని యుపమానము.భక్తులయెడ  తరుగని దయగలది యాతల్లి.కావున ఆమెదయకు నోచుకొన్నవారి కోరికలు దీరక పోవునా?


                 చివరకు చెప్పుచున్నది అసలుమాట."హరింబతిసేయుమమ్మ" శ్రీకృష్ణుని నాకు భర్తగా చేయవమ్మా! యెవరు కాదన్నాసరే,నీవు అవునంటే చాలు మావివాహం జరిగితీరుతుంది. అమ్మా! నేవలచిన కృష్ణుని  భర్తగా ననుగ్రహించు.


                       నిన్  నమ్మిన వారి కెన్నటికి  నాశము లేదుగదమ్మ  యీశ్వరీ!"- నిను నమ్మిన వారు చెడగా నేనెక్కడా చూడలేదమ్మా!

కాన నాకోరిక ఫలింప జేసి  మానమ్మకము నిలబెట్టు మని రుక్మిణి  గౌరీ ప్రార్ధనము!


                           చక్కని నుడికారముతో  బహు చక్కని భావజాలముతో  రుక్మిణి కోరిక  ఫలించు రీతిగా  గౌరీ ప్రార్ధనా ఘట్టమును

కేవల మొకేయొక్కపద్యమున సయుక్తికముగ, సముచితముగ  రచియించిన పోతన మహాకవికి సాటి యగువారెవ్వరు? 


                                                       స్వస్తి!!🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: