5, డిసెంబర్ 2023, మంగళవారం

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 97*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*గిరా మహుర్దేవీం ద్రుహిణగృహిణీ మాగమవిదో*

*హరేః పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయామ్ |*

*తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమ*

*మహామయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ||*



సౌందర్యలహరి కి ఇది మకుటాయమానమైన శ్లోకం. అమ్మవారి తత్త్వాన్ని చెప్పే శ్లోకం.


గిరా మహుర్దేవీం = నీవు వాగ్దేవివి


ద్రుహిణగృహిణీమ్ = బ్రహ్మ భార్యవు, సరస్వతి అనీ


హరేః పత్నీం పద్మాం = విష్ణు పత్నివైన లక్ష్మివనీ


హరసహచరీ మద్రితనయామ్ = రుద్రుని భార్యవైన హిమగిరి తనయవనీ అంటున్నారు ఆగమ శాస్త్రవేత్తలు. అనగా వారి శక్తివిగా  సృష్టి స్థితి లయ కార్యములను నీవు నిర్వహిస్తున్నావని. ముగురమ్మల మూలపుట్టమ్మవని.కానీ వారు నీకు సదా సేవ చేస్తుంటారు.

లలితా సహస్రనామము *సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా*


తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమమహిమా = ఇక్కడ పరతత్త్వాన్ని గురించి చెపుతున్నారు.

జగత్తు అంతా మూడిటితో ఉన్నది.జాగ్రత్,స్వప్న, సుషుప్త అవస్థలు. అంటే మేల్కొని ఉండటం, నిద్రలో స్వప్నావస్థలో ఉండటం, స్వప్నం కూడా లేని గాఢనిద్రలో ఉండటం. సుషుప్తి- గాఢనిద్రలో మనస్సు కూడా పనిచేయదు. ఈ మూడింటికీ అవతల మరొకటుంది. దానిని తురీయం అంటారు అదే పరతత్త్వం. దీపకాంతిలో మనము మన వ్యవహారాలు చక్కపెట్టుకుంటామని ఆ కాంతి పరమేశ్వరి అయితే ఆ దీపము పరేశ్వరుడు. చైతన్యం ఈశ్వరునిది కాంతి జ్యోతిదైనట్లు. వారిద్దరూ వేరుకాదు వాటిని వేరు చేసి చూడలేము. అదే *శివశక్త్యయిక రూపిణి* 

ఓంకారంలో అ, ఉ, మ శబ్దాలు సృష్టి స్థితి లయ శక్తులైతే చివరిలో మ్ అనే సూక్ష్మ నాదం తురీయం పరతత్త్వం. ఈ తురీయము హద్దులు లేని అధిగమించలేని నీ మహిమేనమ్మా అంటున్నారు ఈ పాదంలో.

మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి = మహామాయ పరమేశ్వరుని శక్తియే.ఆ మహామాయతోనే ఈశ్వరుడు ఈ ప్రపంచ నిర్వహణ చేస్తున్నాడు.ఆమె పరమేశ్వరుని పట్టమహిషి.

*మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి* లలితా సహస్రనామాల్లో రెండవ నామం *శ్రీ మహారాజ్ఞీ* అని కదా.మరి ఇక్కడ మహాకామేశ మహిషీ అన్నారేమిటి అంటే కంచి పరమాచార్య వారన్నారు మహారాజ్ఞీ అంటే సమస్త స్వతంత్రాధికారం కలది.కానీ అమ్మవారు శివశక్త్యయి రూపిణి కనుక ఆమె ఇక్కడ కామేశ్వర పట్టమహిషి అనే పిలవబడుతుంది అన్నారు. అమ్మవారు మహామాయయై విశ్వమునంతా త్రిప్పి వేస్తున్నది. మహాకామేశ్వరుడు త్రిమూర్తుల స్వరూపమైతే ఆమె వారి శక్తుల స్వరూపము. 

ఈ మాటనే శ్రీకృష్ణుడు అర్జునునితో భగవద్గీతలో అంటాడు....

*ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ౹*

*భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ౹౹*

ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఓ అర్జునా భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: