///// ఆలోచనాలోచనాలు ///// (సాధు సంగంబు సకలార్థ సాధనంబు.) ***** భక్తి శతక పద్య సంకలనం ***** 1* దిక్కెవ్వరు ప్రహ్లాదకు/ దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్/ దిక్కెవ్వర య్యలహల్యకు/ దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా! ( కృష్ణ శతకం, నరసింహకవి) 2* దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ/ దాసుని దాసుడా గుహుడు? తావకదాస్యమొసంగినావు; నే/జేసిన పాపమా? వినుతి సేసిన గావవు; గావుమయ్య, నీ/ దాసులలో నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ! (కంచెర్ల గోపన్న , భక్త రామదాసు బిరుదాంకితులు, దాశరథి శతకం) 3* అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టె? జలచరాదులకు భోజనమెవ్వడిప్పించె? చెట్ల కెవ్వడు నీరు చేది పోసె? స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు బెంచె? ఫణుల కెవ్వడు పోసె పరగపాలు? మధుపాళికెవ్వండు మకరందమొనరించె? పశుల కెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని/ వేరె దాత లేడయ్య వెదకి చూడ/ భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార!నరసింహ! దురితదూర! ( నరసింహ శతకం, కాకుస్థం శేషప్ప కవి) 4* వెలయన్ యౌవనకాలమందు మరుడున్, వృద్ధాప్యకాలంబునన్/ పలు రోగంబులు, నంత్యమందు యముడుం బాధింప నట్లైన యీ/ పలు జన్మంబులు చాల తూలితి, ననుంపాలింపవే దేవ మీ/ ఫలితానంద దయావలోకనము నాపై జూపు నారాయణా! ( నారయణ శతకం, బమ్మెర పోతనామాత్యులు) 5* తరులంపువ్వులు పిందెలై యొదవి తత్తజాతితోఁ పండ్లగున్/ హర! మీ పాద పయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్/ కరులౌ, నశ్వములౌ, సువర్ణమణులౌ, కర్పూరమౌ, హారమౌ/ తరుణీ రత్నములౌ, పటీర తరులౌ, దధ్యంబు సర్వేశ్వరా! ( సర్వేశ్వర శతకం, యథావాక్కుల అన్నమయ) 6* ఏ వేదంబు పఠించెలూత, భుజగంబే శాస్త్రముల్సూచె, తా/ నే విద్యాభ్యసనంబొనర్చె కరి, చెంచే మంత్ర మూహించె, బో/ ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా! కావు! మీ పాద సం/ సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా! ( శ్రీ కాళహస్తి శతకం, ధూర్జటి) 7* అల విభీషణు పల్కు లాదరించిన వాఁడె, యతి దుష్టుడౌ రావణాసురుండు. వసుదేవముఖ్యుల వరబోధ వినియెనే దుండగీడైన కంసుండు నాఁడు. విదురాది బుధుల వివేకముల్దెలిసెనే, క్రోధాత్ముఁడైన దుర్యోధనుండు. భీష్మాదులెంత చెప్పిన నిచ్చగించెనే బాలిశుఁడగు శిశుపాలకుండు. కొట్టకుండఁగ ధూర్తుల వట్టిశాంతి/ తాలిమేటికి తురకలు తరిమిరాఁగ/ నొదిగి చూచెదు కలిబోయ నుట్లదిక్కు/ వైరిహరరంహ! సింహాద్రి నారసింహ! ( సింహాద్రి నారసింహ శతకం, గోగులపాటి కూర్మనాథ కవి) 8* విరధుఁడై యున్న భాస్కర పుత్రునాజిలో నరునిచేఁ జంపింప న్యాయమగునె? ధర్మజుచే నసత్యఁపు పల్కుఁ పల్కించి, గురుని ద్రుంపించుట ఘనగుణంబె? గంగాకుమారు , శిఖండి యుద్ధంబున పడగూల్చజూచుట పౌరుషంబె? మారుతిచే యధర్మముగా సుయోధను తొడలు దున్మించుట దొడ్డతనమె? ఇట్టి పుణ్యుండవన్న నీ గుట్టుగన్న! భావజ విలాస! హంసల దీవి వాస! లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార! పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!! ( హంసలదీవి గోపాల శతకం, కాసుల పురుషోత్తమ కవి) 9* ఏనుంగెక్కినవాఁడు గుక్కలకు! దానేరీతిగా జంక క/ త్యానందంబున నేగునో, యటు తనూయాత్రన్, జగన్నాథు ని/ న్నే నిక్కంపుసహాయుఁగాఁ గొనునరుండేయాపదల్ వచ్చినన్/ దానిన్ లక్ష్యమొనర్పఁడించుకయు; దేవా! భక్త చింతామణీ! ( భక్త చింతామణీ శతకం, వడ్డాది సుబ్బారాయుడు) 10* వేదంబులును నీవె, వేదాంగములు నీవె! జలధులు నీవె, భూజములు నీవె; క్రతువులు నీవె; సద్వ్రతములు నీవెకో!విదుఁడటంచన నీవె, నదులు నీవె; కనకాద్రి నీవె; ,యాకాశంబు నీవె; ప! ద్మాప్తసోములు నీవె; యగ్ని నీవె; యణు రూపములు నీవె; యవనీతలంబు నీవె! బ్రహ్మము నీవె, గోపతియు నీవె; ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాడ! గించనుడ నన్ను బ్రోవుము కింకరునిగ/ మదరిపు విఫాల మునిజన హృదయలోల! వేణుగోపాల సంత్రాణశీల! (వేణుగోపాల శతకం, పోలిపెద్ది వేంకటరాయ కవి) 11* చిఱుత తనంబునన్ జెలులంజేరి విహారము సల్పువేళ నా/ దరమునఁ గొయ్యబొమ్మను ముదంబునఁ బుత్రునిగాఁదలంచి, తాఁ/ బరశవమంది వేడుక నెపంబిడి లాలనఁజేసి మిక్కిలిన్/ మురిపముఁగాంచి, మోహమున నూల్కొను తల్లినిఁ బోలరెవ్వరున్. ( మాతృ శతకం, మాతూరి అప్పావు మొదలారి) 12* కలికి యిచ్చిన పాలు కడుపు నిండని లాగు! రక్కసి విసపుఁ బాల్గుక్కకొనుట. . తరుణి పెట్టిన వెన్నఁదనివి దీఱనియట్లు! వ్రేపల్లె మ్రుచ్చిల్లి వెన్నఁదినుట. నతివ గట్టిన చల్దియాపోవనటువలె! విప్ర భార్యల బువ్వ వేడుకొనుట వన్నొనంగిన కజ్జమాసదీఱని రీతి! మేలి యపూపమూల్ చాల గొనుట. రట్టడితనానఁ దల్లిని రవ్వసేయ! దలచికాక జగంబులు గలుగనీదు బొజ్జ నిండింపనెవ్వరు పూనువారు! బళిర కఱివేల్ప!పసిఁడి దువ్వలువ దాల్ప! ( కఱివేల్పు శతకం, వైదర్శు అప్పయ కవి) 13* శ్రీ రుక్మిణీ నాథ, జితకోటి రతినాథ, సుందరాకార సానంద శరణు! సుర యక్ష కిన్నర వరమౌని శుభాకర, నరకాంతకా శరణు, శరణు. జలధరనిభ గాత్ర, జలజాతదళనేత్ర, పరమపవిత్ర, గోపాల శరణు. నిర్మల గుణ తోష, నిజ భక్త జన పోషక, వివచో భూష ప్రకాశ శరణు. అనుచు నిను చాల నుతియించి యబ్జభవుని ! వెలది నెంతయు గొనియాడి విఘ్నపతిని. సన్నుతి యొనర్చి, రచియింతు శతకముగను! మదన గోపాల సత్యభామా విలోల! ( మదన గోపాల శతకం, చెంగల్వరాయుడు) తేది 12-12-2023, మంగళవారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి