🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఇందిరా ఏకాదశి*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఈ ఏకాదశి వర్ణించబడింది.*
*ఒకసారి ధర్మరాజు దేవదేవునితో *"ఓ కృష్ణా ! మధుసూదనా ! భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ? ఆ ఏకాదశి వ్రతపాలనకు ఉన్నట్టి నియమనిబంధనలు ఏమిటి ? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి ?"* అని ప్రశ్నించాడు.*
*ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. *"ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీనిని పాటించడము ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతే కాకుండ అతని సమస్త పాపాలు నశిస్తాయి."*
*"రాజా ! సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరియైన ఆ రాజు మహీష్మతీ పురాన్ని చక్కగా పాలించేవాడు. పుత్రపౌత్రులతో గూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. అతడు సర్వదా విష్ణుభక్తిరతుడై ఉండేవారు. ఆధ్యాత్మికజ్ఞానంలో నిరంతరము లగ్నమై యుండెడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినొసగెడి గోవిందుని నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవాడు."*
*"ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి , చేతులు జోడించి వినమ్రంగా వందనము కావించాడు. తరువాత షోడశోపచార పూజ కావించి మునిని సుఖాసీనము కావింపజేసాడు. అపుడు నారదుడు ఇంద్రసేనునితో "రాజా ! నీ రాజ్యంలో సుఖసమృద్ధులతో ఉన్నారా ? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా ? నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా ?"* అని ప్రశ్నించాడు." దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో *"ఓ మునివర్యా ! మీ దయ వలన అంతా బాగానే ఉన్నది. మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది , నాకు యజ్ఞఫలం లభించింది. ఏ దేవర్షీ ! మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది" అని అన్నాడు.రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశార్దూలమా ! నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను , ఓ రాజేంద్రా ! నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడ అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూసాను. వ్రతోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా ! అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు - *"మహిష్మతీ పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిపుడు యమసదనంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అపుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను." "కనుక ఓ రాజా ! నీ తండ్రిని ఆధ్యాత్మికలోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు" అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు.*
*అపుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపమని నారదుని అర్థించాడు.*
*వ్రతవిధానాన్ని శ్రీనారదుడు ఇలా వివరించాడు *"ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుఝామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారు ఝామునే మేల్కొని దంతధావనము , హస్తముఖప్రక్షాళనము చేసికొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతికభోగంలో పాల్గొననని ప్రతనియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా ! నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను" అని పలికి భగవంతుని స్తుతించాలి.*
*"తరువాత మధ్యాహ్నవేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకముగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరము బ్రహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీ కృష్ణుని నామరూపగుణ లీలాదుల శ్రవణకీర్తనలతో , స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరము అతడు సోదరులు , పుత్రపౌత్రులు , బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణము చేస్తూ భోజనం చేయాలి. రాజా ! ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు."*
*నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు. తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము , బంధువులు , మిత్రులతో గూడి నిష్టగా ఇందిర ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారూధుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షియైన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి , చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు.*
*ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు , వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు.*
*ఓం నమో భగవతే వాసుదేవాయ।*
*ఓం నమః శివాయ।*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి