🌼భక్త పోతన 🌼
సీ. బమ్మెర గ్రామాన ప్రభవించి నుర్విపై
భక్తి పంచిన యట్టి భాగవతుడు
పద్యముల్ సేద్యమున్ పరవశంబున జేసి
సన్నుతుండైనట్టి సవ్యసాచి
మకరంద సాహిత్య మాధుర్య గరిమను
తెలుగుజాతి కిడిన వెలుగు రేఖ
భక్తి సాహిత్యంబు పంచియు మేనున
పులక లెత్తించిన పుణ్యమూర్తి
తే. రాజులకు కావ్య మీయక రక్తి తోడ
భక్తితో రామవిభునకు ముక్తి గోరి
కావ్య మంకింత మొనరించి ఘనత గాంచె
భక్త పోతన పావన భాగవతము
సీ. 'కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి'
పరికించి చూచిన భక్త వరుడు
'ఎవనిచే జనియించు నీ జగమ'నుచును
'కరిచేత' తెల్పిన పరమ బుధుడు
'రాజులు గల్గరే ! రాజ్యంబు లేలరే !
యవనిలో నుండిరే!' యనిన ఘనుడు
కన్నీరు నింపిన కమలాసనునిపత్ని
నోదార్చి పొగడిన యోగివరుడు
తే. భక్తి వైరాగ్య కావ్యమౌ భాగవతము
రచన జేసియు నత్యంత రమ్యముగను
తెలుగు వారికి నిచ్చిన దివ్య సుకవి
పోతనకు మించి నెవ్వరు పుడమి గలరు ?
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి