14, డిసెంబర్ 2025, ఆదివారం

శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1325


⚜  తమిళనాడు : పల్లికొండ - వెల్లూరు


⚜  శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం




💠 ఉతర రంగనాథర్ ఆలయం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పల్లికొండ గ్రామంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. 


💠 ఈ ఆలయం పాలార్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ స్వామివారిని   రంగనాధ స్వామి అని, అమ్మవారిని రంగనాయకి తాయర్ అని పిలుస్తారు. 


💠 బ్రహ్మదేవుని యజ్ఞానికి భంగం కలిగించడానికి ఉద్దేశించిన వరదను అడ్డుకోవడానికి నారాయణుడు తనను తాను శయన కోలంలో ప్రదర్శించిన మూడు ఆలయాలలో ఇది మొదటిది.


💠 ప్రభువు పాల సముద్రంలో (క్షీర సాగర లేదా పాల కడల్) వలె శయన రూపంలో ఉన్నందున, ఈ నదికి పాలార్ అని పేరు పెట్టారు, అంటే 

పాలార్ అనగ క్షీర నది. 

పల్లికొండ అనగా శయనించిన స్వామి అని అర్ధం. 


💠 బ్రహ్మాండ పురాణము ప్రకారము ఈ క్షేత్రములో ఒక దినము గడిపి స్వామిని పూజించిన మోక్షము లభించునని భక్తుల నమ్మకము. మూడు దినములు కాంచిపురములో గడిపి వరదరాజ స్వామిని పూజించిన మోక్షము కలుగునని నమ్మకము. 



🔆 స్థల పురాణం


💠 శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతిల మధ్య ఒకరిపై మరొకరి ఆధిపత్యం గురించి ఒకసారి చర్చ జరిగి వారివురు బ్రహ్మదేవుని వద్దకు తీర్పుకై వచ్చారు. బ్రహ్మ శ్రీ మహాలక్ష్మి సరస్వతిదేవి కంటే ఉన్నతమైనదని తెలిపెను. 

దాంతో సరస్వతీ దేవి కోపించి బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి, నంది దుర్గ కొండలకు వచ్చి ఆధిపత్యం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. 

ఈ సమయంలో, బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుడుకు అంకితం చేయుటకు యజ్ఞాన్ని నిర్వహించాడు. నియమం ప్రకారం, ఈ ఆచారాలను అతని భార్యతో నిర్వహించాలి. 

బ్రహ్మ సరస్వతీ దేవిని తనతో కలిసి యజ్ఞానికి ఆహ్వానించాడు, కానీ ఆమె నిరాకరించింది.


💠 బ్రహ్మ మహా సరస్వతి గుణాలతో సావిత్రిని సృష్టించి, ఆమెను వివాహం చేసుకొని, సరస్వతి దేవికి మరింత కోపం తెప్పించిన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 

యజ్ఞాన్ని నాశనం చేయడానికి సరస్వతి దేవి, షీరా నది లేదా పాలార్ నదిగా అవతరించి ఉగ్రంగా ప్రవహించడం ప్రారంభించింది. 

వరదను ఆపమని యజ్ఞాన్ని రక్షించమని బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు.


💠 బ్రహ్మ కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు జలప్రళయానికి ముందు మూడు పుణ్యక్షేత్రాలలోని ఆదిశేషునిపై దీర్ఘరూపం ధరించి వరదను ఆపి యజ్ఞం విజయవంతంగా ముగించుటకు సహాయపడ్డారు.


💠 మహావిష్ణువు శయన రూపాన్ని పొందిన మొదటి ప్రదేశం ఈ పల్లికొండ క్షేత్రం, దీనిని వడ ఆరంగం అని కూడా పిలుస్తారు, రెండవది కావేరిపక్కం సమీపంలోని తిరుపార్కడల్, మూడవది కాంచీపురంలోని తిరువెక్కా ఆలయం లేదా యథోక్తకారి పెరుమాళ్ (సొణ్ణ వణ్ణం సెయిద పెరుమాళ్).


💠 విదేశీ దండయాత్రల సమయంలో, అసలు ఉత్సవ రంగనాథస్వామి విగ్రహాన్ని దాచిపెట్టి, దాని స్థానంలో కస్తూరి రంగనాథర్ లేదా చొట్ట రంగనాథర్ అని పిలువబడే శ్రీ రంగనాథర్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. 

ధండయాత్రలు ముగిసినప్పటికి నేటికినీ ఈ చొట్ట రంగనాథ స్వామికి పూజలు జరుపుతారు. 


💠 సంపతి ఋషి కోరిక మేరకు ఈ క్షేత్రములో స్వామి శెంబగవల్లి తాయారును ఉత్తర పాల్ఘుణి దినమున వివాహము చేసుకొన్నందున ఈ ఆలయములో వివాహములు జరుపుదురు. 

ఇచట వివాహము జరిగిన దంపతుల దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగునని భక్తుల నమ్మకము. 


💠 స్థలపురాణము ప్రకారము బ్రహ్మ విష్ణూమూర్తికి అంకితము చేసిన యజ్ఞమును విజయవంతముగా పూర్తి చేసిన తరువాత యజ్ఞ కుండము నుండి కాంచిపురములోని శ్రీ వరదరాజ స్వామి ఉద్భవించారు. ఇప్పటికిని స్వామి తిరుముగముపై కాలిన మచ్చలు కనిపించును. 


💠 ఇచట రంగనాధ స్వామికి బ్రహ్మ పది దినముల ఉత్సవము జరిపెను. ఈ ఉత్సవమును మొదటి బ్రహ్మోత్సవముగా పరిగణించబడినది. ఈ కాలములో అనేక విష్ణు ఆలయములలో బ్రహ్మోత్సవములు జరుపుచున్నారు గాని ఇచట జరిగిన ఉత్సవము బ్రహ్మ జరిపిన మొదటి బ్రహ్మోత్సవమని పరిగణించబడినది. 


💠 ప్రధాన మూలవర్ ఉతర రంగనాధస్వామి భూదేవి, శ్రీదేవి సమేతముగా బ్రహ్మ నాభి స్థానములో శయన కోలములో కలరు. 

స్వామి వారి విగ్రహము శాలగ్రామ శిలతో చేయబడినది. 


💠 ఉత్సవ మూర్తి రంగనాధ స్వామి శ్రీదేవి భూదేవి సమేతముగా వేంచేసియున్నారు. 

వేరొక ఉత్సవ మూర్తి కస్తూరి రంగనాధ స్వామి కూడ ఇచట కలదు. 

ఈ ఉత్సవ మూర్తికి కూడ ప్రతి దినము ఆరాధన జరుగును. అమ్మవారు రంగనాయకి ప్రత్యేక సన్నిధి  భక్తులకు దర్శనము.


💠 ఈ ఆలయములో శ్రీ రాములవారు, నవనీత కృష్ణుడు, ఆండాళ్, ఆంజనేయుడు, రామానుజలవారు, మనవాల మామునిగళ్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, గరుడాళ్వార్ సన్నిధులు ఆలయ ప్రాంగణములో కలవు. ఆలయ తీర్ధము వ్యాస తీర్ధము. 


💠 ఏప్రిల్-మే నెలల్లో బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో చాలా కోలాహలంగా జరుపుకుంటారు. 


💠 ఈ ఆలయం వెల్లూరు నుండి 24 కిలోమీటర్లు, చెన్నై నుండి 159 కిలోమీటర్లు దూరంలో ఉంది. 

ఈ ఆలయం వెల్లూరు నుండి కృష్ణగిరి మార్గంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

కామెంట్‌లు లేవు: