*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*
*590 వ రోజు*
*మధు కైటబులు*
ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.
*ఏకాగ్రత*
జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.
*నోములు వ్రతాలు*
జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి