26, జూన్ 2021, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆహారపు ఏర్పాటు..*


1973 వేసవి సెలవులకు నేను కనిగిరి నుంచి మొగలిచెర్ల కు వచ్చేసాను..అప్పటికే ఆశ్రమ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది..ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది..ఆశ్రమ ప్రాంగణం లోనే బావి త్రవ్వడం..శ్రీ స్వామివారి కోసం ఒక వంటగది కూడా నిర్మించడం జరిగిపోయాయి..బావి త్రవ్వకం..అందులో జలధార గురించి ఇంతకుముందు శ్రీ స్వామివారి చరిత్రలో పాఠకులు చదువుకొని వున్నారు..


నేను మొగలిచెర్ల లో లేని రోజుల్లో శ్రీ స్వామివారికి ఆహారం తీసుకెళ్లి అందించే బాధ్యత మార్నేని లక్ష్మీ నరసింహం అనే అతను నాకంటే వయసులో కేవలం ఓ సంవత్సరం పెద్దవాడు నిర్వహించేవారు..ఈ లక్ష్మీనరసింహం అంటే మా తల్లిదండ్రులకు కూడా విపరీతమైన అభిమానం ఉండేది..అతనూ అంతే చనువుగా మసిలేవాడు.. ఒకరకంగా చెప్పాలంటే..మా ఇంట్లో మాతో పాటు లక్ష్మీ నరసింహం కూడా ఒకడు అన్న  భావన మా అందరిలో ఉండేది..


రోజూ క్రమం తప్పకుండా శ్రీ స్వామివారివద్దకు వెళ్లి మా అమ్మగారు ఇచ్చిన ఆహారాన్ని శ్రీ స్వామివారికి అందించి..శ్రీ స్వామివారు ఏదైనా కబురు చెపితే..దానిని తిరిగి చేరవేసేవాడు..శ్రీ స్వామివారికి కూడా లక్ష్మీ నరసింహం అంటే అవ్యాజ కరుణ ఉండేది.. ..శ్రీ స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి..ప్రస్తుతం ఈ లక్ష్మీ నరసింహం కందుకూరులో ఉంటున్నాడు..


ఒకరోజు యధావిధిగా నేను శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..శ్రీ స్వామివారు ఆశ్రమం లోపల తాను సాధన చేసే గదిలో వున్నారు..తలుపులు వేసి ఉన్నాయి..కొద్దిసేపు అక్కడే నిలబడ్డాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా బయటకు రాలేదు..మరి కొద్దిసేపు అక్కడే వేచి వుండి.. శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని ఎప్పుడొస్తారో తెలీక..తీసుకొచ్చిన ఆహారపు డబ్బా ను వంటగదిలో పెట్టి వచ్చేసాను..


ఇంటికొచ్చి ఆ మాటే చెప్పాను..అమ్మ కోప్పడింది.."ఆయనకు నువ్వు ఆ డబ్బా ఎక్కడ పెట్టింది తెలీదు కదా..ధ్యానం నుంచి లేచిన తరువాత నువ్వు రాలేదనుకొని పస్తు వుంటారేమో..కొంచెం సేపు అక్కడ వుండి రాలేక పోయావా?.." అని.నేనేమీ జవాబు చెప్పలేదు..ఇకనుంచి శ్రీ స్వామివారితో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను..


ఆ ప్రక్కరోజు నేను వెళ్లే సరికి శ్రీ స్వామివారు బావి వద్ద వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."నిన్న వచ్చి వెళ్ళావా?..నా కోసం చూసావా?..ఇకనుంచీ..నేను ధ్యానం లో వుంటే..నిన్నటి లాగే ఆ గదిలో పెట్టి వెళ్ళు.. ఇబ్బంది ఏమీ లేదు..అమ్మతో నా గురించి ఆందోళన పడొద్దని చెప్పు..ఒకవేళ నీకు ఇబ్బంది గా వుండి రాలేకపోయినా..నేను ఆ నాలుగు గింజలు ఇక్కడ ఉడకేసుకుంటాను.. మా తమ్ముడు పద్మయ్య నాకోసం బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టి పోతాడు.." అన్నారు..


నాకు ఆశ్చర్యం వేసింది.. అంతవరకు అమ్మ బాధపడ్డ విషయం నేను శ్రీ స్వామివారితో చెప్పలేదు..కానీ ఆ సంగతి ఆయనే ప్రస్తావించారు..నా వరకూ ఏదో ఒక పెద్ద భారం తప్పినట్లు అనిపించింది..నేను అన్నింటికీ సరే అన్నట్లుగా తలూపాను..


శ్రీ స్వామివారు నాతో మాట్లాడటం ముగించి..బావి లోకి బక్కెట్ వేసి నీరు తోడుకున్నారు..ఆ బక్కెట్ ను నూతి గట్టు మీద పెట్టి..తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకొని..బక్కెట్ ను రెండు చేతులతో పైకెత్తి..తన తలమీద ధారగా నీళ్లు పోసుకున్నారు..శ్రీ స్వామివారి తలమీద నీళ్లు పడగానే..తలమీద వదులుగా ముడివేసుకుని ఉన్న జుట్టు పాయలుగా విడిపోయి..శ్రీ స్వామివారి భుజాల క్రిందకు వచ్చింది..ఆ జుత్తునుంచి నీళ్లు ధారగా కారుతూ ఆ శరీరాన్ని తడుపుతున్నాయి..అలా దాదాపు పదిహేను నిమిషాల పాటు తీరుబడిగా స్నానం చేసారు.. 


నేను చూస్తూ ఉండిపోయాను..ఎందుకనో ఆ దృశ్యం నా మనసులో హత్తుకొనిపోయింది..ఏదో తెలియని అనుభూతి మనసంతా ఆవరించింది..శ్రీ స్వామివారిది ఆరడుగుల పైనే ఎత్తు గల దేహం..తెలుపు పసుపు వర్ణాలు కలిసిన మేని ఛాయ.. భుజాల క్రిందకు వ్రేలాడుతున్న జటాఝూటం లాంటి కేశాలు.. ఇప్పటికీ కూడా ఆనాడు శ్రీ స్వామివారు స్నానం చేసిన దృశ్యం నాకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది..


భగవంతుడు నాకు ప్రసాదించిన అత్యద్భుత దృశ్యాలలో ఇది ఒకటి..


మరో అనుభవంతో రేపు ...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: