26, జూన్ 2021, శనివారం

కృషితో నాస్తి దుర్భిక్షం

 కృషితో నాస్తి దుర్భిక్షం 

జపతో నాస్థి పాతకం 

మౌనేన కలహం నాస్తి 

జాగ్రతేన భయం నాస్తి 

మన మహర్షులు వారి జ్ఞానంతో మన దైనందిక జీవనానికి ఉపకరించే అనేక సూత్రాలను, నీతులను మనకు అందించారు ఆ పరంపరలో వెలసినదే ఈ శ్లోకం 

కృషితో నాస్తి దుర్భిక్షం : అంటే కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు అంటే మనం శ్రమ చేస్తే దరిద్రం ఉండదు. ఎందుకంటె శ్రమకు మనము ఫలితాన్ని పొందుతాము ఆ ఫలితం వలన దరిద్రం పారదోల వచ్చు  ఇక్కడ శ్రమ అంటే ఏదయినా ఉద్యోగం లేక వ్యాపారమో వృత్తి కావచ్చు తద్వారా మనకు ధనం లభిస్తుంది.  ఆ ధనంతో వలసిన వాటిని కొనుక్కొని సుఖ జీవనం చేయవచ్చు. 

జపతో నాస్థి పాతకం: జపం చేయటం వలన అంటే కేవలం జపమే కాకుండా దేముడికి సంబందించిన పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వలన మనం చేసిన పాపాలు అన్ని పాటా పంచలు అయ్యి పుణ్య ఫలం లభిస్తుంది అందు వలన పాతకాలు నశిస్తాయి అని అర్ధం. మనం నిత్యం జప తపాదులను ఆచరించి మన చిన్నారులకు కూడా మార్గ దర్శకంగా ఉంటే గృహంలో ముందుగా ప్రశాంతత తరువాత అదృష్టం  చేకూరుతుంది. ఏ ఇల్లు పరి శుభ్రంగా ఉండి అక్కడి గృహస్తులు  దైవ చింతనలో వుంటారో ఆ ఇంటిలో నిత్యం లక్ష్మి దేవి వసిస్తుంది అన్నది సత్యం. 

మౌనేన కలహం నాస్తి: ఇది ఇప్పటి కాలంలో ప్రతివారు ఆచరించ వలసిన సూత్రము. మనం చేసిన ప్రతి పనిని ఈ సమాజం వేయి కళ్ళతో గమనిస్తూ ఉండటమే కాకుండా కొందరు వారికి తెలిసి కొంచం తెలియక కొంచం అహంతో కొంతఎదుటి వారిని విమర్శించాలనే సంకల్పంతో మనకు మనసు గాయ పడే విధంగా ప్రవర్తించినా కూడా మనం మౌనంగా ఉంటే ఎటువంటి మనః స్పర్ధలు రావు తత్ ద్వారా కలహం రాదు. కాబట్టి ఈ రకంగా కలహాన్ని ఆపగలం. మహా భారతంలో తిక్కన మహా కవి వ్రాసిన పద్యం ఈ సందర్భంలో అనుసరణగా ఉంటుంది చుడండి 

ఒరులేయవి వనరించిన 

నరవర యప్రియంబుదన మనంబునకగు 

నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ 

భావము: ఇతరులు ఏవయితే అప్రియమైనవి అనగా మనకు ఇష్టము కాని పనులు మన యెడ చేస్తారో అవి వారికి చేయకుండా అంటే అదేవిధంగా వారితో ప్రవర్తించకుండాఉండటం పరమ ధర్మము అంటే   ధర్మాల కన్నా ఎక్కువ అయిన ధర్మము అని అర్ధము. మనకు ఎంతో విలువైన వాగ్మయం వున్నది కానీ అది పెద్ద వారు తెలుసుకోవటం లేదు అట్టి తరి ఇక పిల్లలకు ఏమి నేర్పగలరు. ప్రతి వారు కొంత సమయాన్ని వెచ్చించి చక్కటి విషయాలు తెలుసుకొని తమ సంతతికి నేర్పిన ఈ సమాజం ఎటువంటి గొడవలు లేకుండా చల్లగా ఉంటుందనుటకు సందేహం లేదు. 

జాగ్రతేన భయం నాస్తి:  ఇది ఇప్పటి ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన వాక్యంగా నేను  అనుకుంటాను. నాకు ఇటీవల కలిగిన ఒకపరోక్ష అనుభవాన్ని తెలియ చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తికీ ఒక వడ్డీ వ్యాపారం చేసే సంస్థ ఉద్యోగి బలవంతంగా వ్యక్తిగత ఋణము ఇప్పించారట.  ధనాశతో అతనుకూడా అనాలోచితంగా తీసుకున్నాడు.  తరువాత తెలిసింది తాను నెలసరి చెల్లించే వాయిదా సొమ్ము కలిపితే తానూ తీసుకున్న ఋణం కన్నా చాల ఎక్కువ అని. అంతే కాదు తానూ ఈ కరోనా నేపథ్యంతో నెలసరి వాయిదాలు కొన్ని కట్ట నందువల్ల ఆ సంస్థ వారి ఉద్యోగులు రాత్రియంబవళ్ళు దూర శ్రవణితో మాట్లాడుతో అనేక విధముల దుర్భాషలాడటమే కాక అతనిపై అతని ధర్మ పత్ని ఫై  పోలీసు కేసులు పెట్ట గలమని భయపెట్టు చున్నట్లు నాతొ నుడివినాడు, అందు వల్ల తన కుటుంబ జీవనం దుర్భరమైనదని వాపోయినాడు. ఇది యదార్ధంగా జరిగిన సంఘటన.  నిజానికి తనకు అవసరము లేకున్నను దొరికిందని ఋణము తీసుకోవటం వల్ల వచ్చినఁ ముప్పు అంటే తనంతట తానె ముప్పుని కొని తెచుకున్నట్టు.  మనం రోజు అనేకమైన ఇటువంటి విషయాలను వింటున్నాము కంటున్నాము.  అనేకులు ఋణములు చెల్లించ లేక ఆత్మ హత్యలకు పాలుపడుటము కూడా  మన మెరుగుదుము.  ముందు జాగ్రత్త లేక పోవటమే ఇటువంటి పరిస్తుతములకు  దోహద పడుతాయి.  

మనుషులకు ఆశ లేశ మాత్రంగానే ఉండాలి. ప్రస్తుతము కరోనా కారణంగా ధనార్జన లేని అనేక సాఫ్ట్ వెరు జ్ఞానులు అక్రమ ధనార్జనకు పలు తెరుగుల మోసములు చేయుటకు  పాల్పడుతూ అమాయకులను ప్రలోభ పెట్టి వారిని దోపిడీ చేస్తున్నారన్నది విశ్వ విదిత సత్యం. 

మనకు ఉరక ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎందుక ఇస్తారు అని ఆలోచించే వారు ఎట్టి ప్రలోభాలకు లొంగరు. కానీ చాలా మంది అమాయకులు అందులోని నిజా నిజాలను పసి కట్టక లక్షలలో కంప్యూటరు మోసాలకు లోనవుతున్నారు.  మన భారతీయుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కేనియా దేశస్తులు కూడా మోసగిస్తున్నట్లు మనం వార్తలలో చూస్తున్నాము.   

" ఆశయాబద్దతే లోకం కర్మణేన బహుచిన్తయామి" 

మరొక శ్లోక వివరంతో మరలా కలుద్దాము. 

ఇట్లు 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: