26, జూన్ 2021, శనివారం

*మోక్ష మార్గాలు

 *మోక్ష మార్గాలు..


 *తరుణోపాయం...*

 

ప్రతి మార్గంలోనూ ఆ మార్గానికి సంబంధించిన ఇబ్బందులు కష్టనష్టాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక మానవ సహజమైన లోపాలు ఎలాగూ మనలో ఉంటాయి. సాధన అన్న తర్వాత జారు పాట్లు భంగ పాట్లు తప్పవు. మోక్షము అనేది చాలా జన్మల తరవాత వచ్చేది. దానికి అడ్డ దారులు సూక్ష్మ మార్గాలు ఉండవు. కానీ ఇందులో భగవంతుడు చిన్న వెసులుబాటు ఇచ్చాడు. సాధన మార్గంలో కొంత దూరం వెళ్లిన తర్వాత జన్మ పూర్తయితే తర్వాతి జన్మలో మళ్లీ సరిగ్గా ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి సాధన మొదలువుతుంది. చేసిన పూజ, సాధన మురిగిపోవు. గజేంద్రమోక్షం ఘట్టంలో ఆఖర లో ఈ మాట వుంది. 


జ్ఞాన భక్తి కర్మ మార్గాలలో అన్నిటిలో కూడా తప్పకుండా ఉండవలసిన దినుసు వైరాగ్యం. వైరాగ్యం లేకుండా ఏ మార్గము కూడా పనిచేయదు. మనము ఏ మార్గంలో ముందుకు పోదా మనుకున్నా ఆ మార్గంలో మన కంటే ముందు అరిషడ్వర్గాలు వెళ్లి మనల్ని దొర్లించడానికి ఆ మార్గం నిండా గుంటలు తోవ్వుకుని కూర్చొని ఉంటాయి. వైరాగ్యం ఉంటే తప్ప ఆ గుంటల్లోంచి బయటపడ లేము. సంసారాన్ని పూర్తిగా వదిలి పెట్టనక్కర్లేదు. కానీ తాపత్రయాలను కొద్దిగానైనా అదుపులో ఉంచు కోవాలి. అన్నిటికంటే ఇదే ప్రధాన మైనది.


60 ఏళ్ళు వచ్చిన తర్వాత నైనా భగవంతుడి మీదా మోక్షం మీదా ఆసక్తి కలగకపోతే మనకు వచ్చిన ఈ మానవ జన్మ వృధా అయినట్లే. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం మోక్షం మీద ఆసక్తి తప్పకుండా ఉండాలి. మనం చెయ్యవలసినది ఏమిటి అనేది గురువులు ఇలా చెప్తారు. 


*కలియుగంలో తీవ్రమైన సాధన ఎవరికీ వీలుపడదు. ఏదో ఒకటే మార్గము అనిపట్టు కొని కూర్చుంటే అసలు వీలుపడదు. అన్ని మార్గాల్లో ఉన్న మంచిని తీసుకోవాలి. ఎవరో ఒక దేవుడినో దేవతనో నమ్ముకొని సాధ్యమైనంత వరకూ సత్సంగము, నిత్యం భగవంతునికి సంబంధించిన మాటలను వినడము భగవంతునికి సంబంధించిన పుస్తకాలను చదవడం రోజూ నియమంగా ఏదో ఒక రూపంలో భగవంతుడిని కొద్దిసేపైనా పూజిస్తూ ఉండడం. వీటితో పాటు కొద్దిపాటి ఇంద్రియ నిగ్రహంతో కాస్త ధర్మ బద్దంగా బతుకు వెళ్ల దీయ గలిగితే ఇప్పటి పరిస్థితులలో మనకు సరిపోతుంది. ఉన్నంతలో కోరికలు క్రోధాలు అదుపులో ఉంచుకుని శాంతంగా బతకడమే ప్రస్తుత కాలానికి మనం చేయగలిగిన సాధన. లంపటత్వం తగ్గించుకుని వైరాగ్యాన్ని పెంచుకోవాలి. జ్ఞాన భక్తి కర్మ మార్గాల నన్నింటిని వాళ్ల వాళ్ల రుచిని బట్టి, ఓపికను బట్టి, అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కలిపి ఉపయోగించు కోవడం మంచిది.*


బ్రహ్మ సూత్రాల దగ్గర్నుంచి మొదలుపెట్టి వందల పుస్తకాలు రాసిన ఆదిశంకరులు ఆఖరులో మనకు ఇచ్చిన రత్నాల మూట భజగోవింద స్తోత్రం. అందులో ఉన్న సూచన కూడా ఇదే. భజగోవింద స్తోత్రాన్ని చదివి అర్థం చేసుకొని ఆ సూచనలు రోజూ పాటించ గలిగితే చాలు. అంతకంటే మించిన వేరే సాధన ఈ కాలంలో ఇంకేమీ లేదు. 


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: