24, జులై 2023, సోమవారం

జనన మరణాల మధ్య

 *జనన మరణాల మధ్య…!*

                

మహా బలవంతుడు, మల్లయుద్ధ వీరుడైనా కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడు.


కాలం పరుగెడుతుంటే యౌవనంలోని అందాల రాశి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుంది. 


మహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపకశక్తి తగ్గి చింతిస్తుంటాడు. 


జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే!


గడిచిన క్షణం తిరిగిరాదు! ఈ నిజాన్ని జీర్ణించుకున్న విజ్ఞులు... నేను,నాది అనే అహంకారాన్ని తలకెక్కించుకోరు. స్వార్థాన్ని కట్టడి చేసుకుని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారు. తమకు తెలియని శక్తి ఏదో తమను నడిపిస్తోందని విశ్వసిస్తారు. ఆ శక్తినే దైవంగా భావిస్తారు. తమ జీవితం ఆ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారు. 

ఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారు. 


పరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాట! పుట్టిన వెంటనే మాట రాదు. మరణ సమయంలో మాట పడిపోతుంది. మధ్యకాలంలో సత్య సంభాషణం మనిషి విలువను పెంచుతుంది. కష్టసుఖాల్లో పాలుపంచుకునే బంధుమిత్రులను ఆదరించినవారి జీవితం ఆనందమయమౌతుంది. 


స్నేహబాంధవ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి. జనన మరణాల మధ్య కాలంలో లోభ మోహాలను, మదమాత్సర్యాలను మనసు నుంచి తరిమికొట్టి మంగళకరమైన ఆలోచనలతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది. 


చెడుతలపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే. భూమి  మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదు. ముసలితనంలో యమ భటులు వాకిట ముందుకొచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతున్ని తలచగలమో లేదో? భజింపగలమో లేదో? తెలియదుకనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ని ధ్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథీ శతకపద్యం.


జీవితంలో ప్రతిక్షణం విలువైనదని తెలుసుకోగలగాలి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, సోమరితనంతో కాలాన్ని వృదా చేసుకునేవారు అజ్ఞానులు.


మనసులో రూపుదిద్దుకొన్న మంచి ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణం. 


తమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారే విజ్ఞులు, నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారు. కదలలేని స్థితిలో 

చేసిన తప్పులు తలచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదు. చివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడనుగ్రహించిన జీవితాన్ని సార్ధకం చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి.


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

కామెంట్‌లు లేవు: