7, ఆగస్టు 2023, సోమవారం

భారతీయత

 👉 *నీతికథలు* 👈


*ఇదీ మన భారతీయత!*

        ➖➖➖


భగవంతుడిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత, క్షమాపణ వేడు కోవడంలో ఆంతర్యం ఏమిటని నన్ను ఒకరు ప్రశ్నించారు. 


ఇందుకు సమాధానం నాకు హిందూ ఆచారాలలోనే లభించింది.


లండన్ లో వుంటున్న ఒక ప్రవాస భారతీయుడు తన తండ్రిని భారత దేశం నుంచి లండన్ సందర్శనకు పిలిపించుకున్నాడు. 


తండ్రిని వెంటబెట్టుకుని లండన్ లో వివిధ నగరాలను సందర్శించే సమయంలో, అతనికి పరిచయమున్న లండన్ మిత్రుడు వీరిద్దరినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. 


మిత్రుడి ఇంటికి వెళుతున్నప్పుడే అక్కడి మర్యాదల గురించి చెబుతూ “భోజనం చేసిన పిమ్మట, ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం ఇక్కడి మర్యాద!” అని తండ్రికి కుమారుడు వివరించాడు. 


ఆ విధంగానే ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడికి వారు ధన్యవాదాలు చెప్పారు. అందుకు “వెల్ కమ్ సర్, ఇటీజ్ మై ప్లెజర్” అని లండన్ మిత్రుడు తన పద్ధతిలో స్పందించాడు. 


కొంత కాలానికి ప్రవాస భారతీయుడు తన లండన్ మిత్రుడిని వెంటబెట్టు కుని భారతదేశాన్ని చూపించడానికి తీసుకువచ్చాడు. 


మిత్రుడికి విడిది, విందు, తమ వసతి గృహంలోనే ఏర్పాటు చేసాడు. 


పర్యటన అనంతరం మిత్రుని సాగనంపుతున్న సమయంలో, ప్రవాస భారతీయుడి తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మిత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. “మీరు మా ఇంటికి రావడం, మా ఆతిథ్యాన్ని స్వీక రించడం మాకు ఎంతో ఆనంద దాయకం! 'అతిథి దేవోభవ'అని మేము నమ్ముతాం, అంచేత మేం మీకు ఋణ పడివున్నాం. ఏమైనా పొరబాట్లు వుంటే మన్నించగలరు!” అని తండ్రి చెప్పిన మాటలకు లండన్ మిత్రుడు ఆశ్చర్యపోయాడు. 


పుచ్చుకున్న వాడు, ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పడం పాశ్చాత్య నాగరికత! 


ఇచ్చిన వాడే పుచ్చుకున్న వాడికి ధన్యవాదాలు చెప్పడం భారతీయ సంస్కృతి! 


భగవంతునిపట్ల కూడా ఈవిధంగానే స్పందిస్తాము. 


షోడశోపచారాలతో పూజించి, మనకు చేతనైనంత భగవంతునికే సమర్పించి, చివరగా ఈ ఉపచారాలతో ఏమైనా లోపం వుంటే క్షమించమని వేడుకుంటాం. 


ఇది మన హిందూ ధర్మంలో ఒక అనిర్వచనీయమైన ఆచారం!


ఇదే మన భారతీయత.


 *మన ఆచారాలను సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం* 


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

కామెంట్‌లు లేవు: