30, సెప్టెంబర్ 2023, శనివారం

సంతోషమే

 -----0 సంతోషమే సగం బలం లేదా ఆనందానికి అతి దగ్గరిదారి 0-----              *****  ఈ లోకంలో అందరూ ఆనందాన్ని పంచేవారే! మొదటి వర్గం వారు తాము వెళ్ళినప్రతి చోటా! రెండవ వర్గంవారు తాము విడచివెళ్ళిన ప్రతిచోటా! అంతే తేడా!          ***** మన వద్ద సెంట్, అత్తరు, పన్నీరు వంటి పరిమళ ద్రవ్యాలున్నాయి. ఎంతోకొంత మన వంటిమీద పడకుండా చుట్టుపక్కలవారిపై చల్లలేంకదా! సంతోషం లేదా ఆనందం కూడా అటువంటిదే! ఎంతోకొంత మనం ఆనందించకుండా ఇరుగు పొరుగువారిని సంతోషపరచలేం!                 ***** మహాభారతం చివరలో పంచపాండవులు ద్రౌపదితో మహాప్రస్థానం గావించారు. ధర్మరాజు కూడా అనివార్యంగా నరకలోక ప్రవేశం గావించి, అక్కడి పాపుల వేదనకు కలతచెంది, తాను శాశ్వత నరకలోకవాసిగా ఉండుటకు సంసిద్ధపడ్డాడు. ధర్మరాజు గారి ఉనికి తో నరకలోక వాసులు సంతోషపరవశులైనారు. మనం కూడా శోకభూయిష్టమైన ఈ లోకంలో ధర్మరాజు ల వలె వర్తించాలని ఈ గాథ బోధించే నీతి!                       ***** ఏదైనా విషయంలో లోతుగా ఆలోచించడం, ఏదైనా అనుభూతిని బాగా ఆస్వాదించడం, స్వేచ్ఛగా ఆలోచించడం, అవసరమైతే జీవితాన్నే పణంగా పెట్టడం, అవసరంలో ఇతరులకు ఎంతోకొంత సహాయపడడం , వీటి ద్వారా మీకు ఏమాత్రం ఆనందం లభించకపోతే ఇక బంగారం తో చెయ్యబడిన ( మహామేరువు) పర్వతం తో కూడా ఆనందం లభించదు.                             ***** కొంతమంది ఆనందంగా ఉంటున్నారంటే అన్నీ సక్రమంగా ఉన్నట్లు కాదు. సంపన్నుడు బిచ్చగాడి వేషంతో నటిస్తున్నట్లుగా, దరిద్రుడు కోటీశ్వరునిగా నటించినట్లు మాత్రమే!          ***** మనకు లేనివాటిగురించి ఆందోళన చెందడం విడచిపెడదాం. మనకు ఉన్నవాటితో సంతోషంగా ఉందాం. ఇకచాలు! భూలోకంలో స్వర్గలోకం ఏర్పడి తీరుతుంది.                           ***** ఆనందం కోసం ఆరాటపడటం విడచిపెడదాం. మనకు ఉన్నవాటితోనే ఆ.... నం .... దం .... గా ఉంటే బాగుంటుంది కదా! ఆలోచించండి!                      ***** ఆనందానికి ఒకే ఒక మార్గం. మన శక్తికి మించినవి, మన నియంత్రణలో లేనివాటిని గురించి అతిగా ఆలోచించడం మానివేయడం మాత్రమే!       ***** విందులు, వినోదాల్లో మునిగితేలితే సంతోషం దొరకదు. సంపదలలో పడి పొర్లాడితే ఆనందం అందుబాటులోకి రాదు. మరి ఎట్లా లభిస్తుంది? పరోపకారం లేదా పుణ్యకార్యాలతో మాత్రమే!                              ***** నవ్వడం మాత్రం అందరితో కలిసి చెయ్యండి. ఏడవడమా! అది ఎవరూ చూడని ఒంటరి ప్రదేశం లో మాత్రమే సుమా!                      తేది 30--9--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: