30, సెప్టెంబర్ 2023, శనివారం

రామాయణమ్ 340

 రామాయణమ్ 340

....

ప్రాతఃకాలము లో విభీషణుడు గొప్ప తేజస్సుగలసూర్యుడు మేఘమండలములో ప్రవేశించినట్లు అన్నమందిరములోనికి ప్రవేశించెను.

.

రాక్షససార్వభౌమునికి జయజయధ్వానములతో అభివాదము చేసి నమస్కరించి నిలిచెను .కనుసైగచేసి అక్కడ ఉన్న ఒక ఉన్నత ఆసనము రావణుడు తమ్మునకు చూపించి కూర్చొమ్మని చెప్పగా రావణసహోదరుడు సుఖాసీనుడాయెను.

.

మంచి మాటలతో అన్నగారిని ప్రసన్నుడిని చేసుకొని దేశకాలప్రయోజనమునకు అనువైన మాటలు పలికెను.

.

అన్నా ! సీత లంకలో పాదము మోపినది మొదలు మనకు అశుభ శకునములు గోచరించుచున్నవి.

.

హోమాగ్ని ప్రజ్వరిల్లుట లేదు

జ్వాలను పొగ ఆవరించుచున్నది

సర్పసంచారము సర్వప్రదేశములలో ఎక్కువ అయినది

ఆవు పాలు విరిగిపోవుచున్నవి

ఉత్తమోత్తమమయిన గజములు కూడా మదజలములు స్రవించుట లేదు

.

గుఱ్ఱపు సకిలింపుల దీనముగాయుండి అవి పచ్చగడ్డి కూడా మేయుటలేదు

గాడిదలు,ఒంటెలు,కంచరగాడిదలు తమ కన్నులనుండి జలజలా నీరుకార్చుచున్నవి.

.

గ్రద్దలు మండలాకారముగా తిరుగుచూ వ్రాలుచున్నవి .

.

సంధ్యాసమయములో నక్కల ఊళలు అమంగళముగా కూయుచున్నవి.

.

మహారాజా నేనీమాటలు అజ్ఞానము వలనను ,లోభము వలనను పలుకుచున్నను నీవు మరొక విధముగా భావింపకుము.

.

ఈ దుర్నిమిత్తములు నాకే కాదు సమస్త లంకాపురవాసులకు కూడా కనిపించుచున్నవి.నీకు చెప్పుటకు ఎవరికీ ధైర్యము సరిపోవడం లేదు.

.

విభీషణుని ఈ మాటలు విని రావణుడు కోపముతో జేవురించిన ముఖము కలవాడై ,విభీషణా !!, రాముడు ఇక ఎన్నటికీ సీతను పొందజాలడు.ఇంద్రాది దేవతలతో కలిసి నాపై దండెత్తి వచ్చినా రాముడు యుద్ధములో నా ఎదుట నిలువలేడు ! .

.

చెప్పినది చాలు ఇకనీవు వెళ్ళవచ్చును అని విభీషణుని పంపివేసెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: