*శనగపిండితో ఆధ్యాత్మిక బోధ*
(సేకరణ)
మిఠాయి సత్యం
మా ఊర్లో సత్యంగారనే ఆయన ఉండేవారు.
ఉదయం పదిగంటల నుంచి జంతికలు, చెగోడీలు, బజ్జీలు, బెల్లం మిఠాయి ఉండలు చేసి అమ్మేవాడు.
ఎవరింట్లో ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి చేయించుకొనేవారు. దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనేపేరు స్థిరపడిపోయింది.
ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే… ఆయన చదువుకోకపోయినా మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు. తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు, హరికథలు వినేవాడు.
ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.
ఈ సత్యం గారు హరికథకులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.
"అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే…”
సెనగపిండి (మూలమనుకోండి)
1. సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి. 2. లావుగొట్టంలో సుడితే జంతికలు. 3.అదేసెనగపిండిని సట్రంలో కొట్టి, యేరుసెనగ, పుట్నాలు, అటుకులు , కర్వేపాకు యేపి కలిపితే కారంబూంది అవుద్ది.
4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు ఔతుంది.
5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే మైసూరు పాక్ అవుతుంది.
6. అదే సెనగపిండి పల్చగా కలిపి, మిరపకాయ ముంచివేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ బజ్జీలు.
7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కలిపివేయిస్తే పకోడీయండి.
ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు, మనకి శివుడుగా, యిష్ణువుగా, ఆంజనేయుడుగా, గణపతిగా ఎన్నో రూపాలుగా కనపడతాడండి ఆయ్.”
మనం ఎలా కొలిచినా, పిలిచినా పలికేశక్తి ఒహటేనండి. ఆయ్! నాకరదమయినకాడికి సెప్పేనండి అన్నాడు సత్యంగారు.
ఆనాటి స్వామీజీలు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన శాలువ సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ మాటన్నారు…
ఇన్ని శాస్త్రాలుచదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువుగా చెప్పలేను.
నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.
సభంతా చప్పట్లు మోత!
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
లోకా సమస్తా సుఖినోభవన్తు!ఔ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి