14-01-గీతా మకరందము
గుణత్రయవిభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
శ్రీ భగవద్గీత
అథ చతుర్దశోఽధ్యాయః
పదునాల్గవ అధ్యాయము
గుణత్రయ విభాగయోగః
గుణత్రయ విభాగయోగము
శ్రీ భగవానువాచ :-
పరం భూయః ప్రవక్ష్యామి
జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయస్సర్వే
పరాం సిద్ధిమితో గతాః ||
తాత్పర్యము:- శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) దేనిని తెలిసికొని మునులందఱును ఈ సంసారబంధమునుండి (విడివడి) సర్వోత్తమమగు మోక్షసిద్ధినిబడసిరో అట్టి పరమాత్మవిషయకమైనదియు, జ్ఞానములలోకెల్ల నుత్తమమైనదియునగు జ్ఞానమును మఱల చెప్పుచున్నాను.
వ్యాఖ్య:- ‘భూయః’ - ‘క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ జ్ఞానమును మఱల చెప్పుచున్నాను వినుము’ - అని పలుకుటచే భగవానునకు భక్తుల యెడల యెంత కరుణగలదో, వారిని తరింపజేయవలెనను కుతూహలమెంతకలదో విశదమగుచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకెక్కుటకై ఒకే బోధను మఱల మఱల చెప్పుచుండును.
"వక్ష్యామి" అని చెప్పక "ప్రవక్ష్యామి” (లెస్సగా వచించుచున్నాను) అని చెప్పుటవలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతునిదృష్టిలో ఎంత ముఖ్యమైనవో యోచించుకొనవచ్చును.
‘జ్ఞానానాం జ్ఞానముత్తమమ్’ - ప్రపంచములో అనేక జ్ఞానములు (భౌతిక జ్ఞానము, సంగీతజ్ఞానము, శిల్పజ్ఞానము, గణితజ్ఞానము మున్నగునవి) ఉన్నను, వానియన్నింటిలోను భగవానునిదృష్టిలో ఆధ్యాత్మికజ్ఞానమే సర్వశ్రేష్ఠమైనదని ఈ వాక్యముద్వారా, మఱియు ‘పరమ్’ అను పదముద్వారా స్పష్టమగుచున్నది.
‘యజ్జ్ఞాత్వా మునయః సర్వే’ - ఈ జ్ఞానమును తెలిసికొని పూర్వము మునులందఱును బంధవిముక్తులైరని ఇట తెలుపబడినది. ఔషధముయొక్క శ్రేష్ఠత్వము రోగులపై అది కలుగజేయు ఫలితముమీద ఆధారపడియుండును. దేని సేవనముచే రోగము శమించునో ఆ ఔషధము చాల గొప్పదని అర్థము. అట్లే పూర్వము మునులందఱును ఈ జ్ఞానమును సేవించుటవలన బంధరహితులై శాశ్వత మోక్షపదము నొందిరని యిట తెలుపుటచే ఆ జ్ఞానముయొక్క మహిమ వెల్లడియగుచున్నది. ప్రత్యక్షఫలితమును జూపుటద్వారా భగవానుడు జనులకు జ్ఞానముపై పరమ విశ్వాసమును కలుగజేయుచున్నారు. ‘సర్వే’ అని చెప్పుటచే ఈ జ్ఞానము నెఱింగినవారిలో ఒకరు కూడ ముక్తినిబడయక నుండలేదనియు అందఱును తరించిపోయిరనియు తెలియుచున్నది. అయితే ‘మునయః’ = (మననశీలురు) అని పేర్కొనుటవలన, వారందఱును తత్త్వమును బాగుగ మననముచేసియే తరించిరిగాని, వాచాజ్ఞానముచే గాదని స్పష్టమగుచున్నది.
‘పరాం సిద్ధిమ్’ - మోక్షస్థితి అన్నిటికంటెను గొప్పపదవి - అని చెప్పబడుటచే, చిన్నచిన్న ప్రాపంచికపదవులను, గతులను గొప్పగ తలంచి మురిసిపోక వానికంటె ఎన్నియోరెట్లు ఆనందకరమైనట్టి పరమాత్మపదమును జ్ఞానసముపార్జనముద్వారా పొంది ధన్యులు కావలయును.
ప్రశ్న:- భగవానుడు చెప్పబోవు జ్ఞానమెట్టిది?
ఉత్తరము:- (1) జ్ఞానములన్నిటిలోను ఉత్తమమైనది (2) దాని నెఱుంగుటవలన మునులందఱును మోక్షస్థితిని బడసిరి.
ప్రశ్న:- మోక్షస్థితి యెట్టిది?
ఉత్తరము:- ప్రపంచములో అన్నిపదములకంటెను సర్వోత్తమమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి