24, ఫిబ్రవరి 2025, సోమవారం

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(59వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ *సగరులు - సాగరం; భగీరథుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘ఈ ముని పెద్ద దొంగ! మన యాగాశ్వాన్ని దొంగిలించాడు. ఇతన్ని క్షమించకూడదు. కొట్టండి, చంపండి.’’ అంటూ సగరపుత్రులంతా ఒక్కసారిగా కపిలమునిని చుట్టుముట్టారు. మారణాయుధాల్ని ఎక్కుపెట్టారు.*


*ఆ కలకలానికి తపోభంగం కలిగింది. కళ్ళు విప్పి చూశాడు కపిలముని. ఆ చూపుల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. అరవైవేలమంది సగర పుత్రులూ ఆ జ్వాలలకు ఆహూతయిపోయారు. భస్మమయిపోయారు. బూడిదగుట్టలయ్యారు.* 


*కపిలముని నేత్రాగ్నికి తన అరవై వేలమంది పుత్రులూ బూడిదయిపోయారని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు సగరుడు. బాధపడ్డాడు.*


*అప్పుడు మనవడు అంశుమంతుణ్ణి పిలిచాడు. యాగాశ్వాన్ని తీసుకుని రమ్మని అతన్ని పంపాడు. తన పినతండ్రులు తవ్విన సముద్రమార్గం గుండా అంశుమంతుడు రసాతలానికి చేరాడు. అక్కడ బూడిదగుట్టల్నీ, వాటి సమీపంలో తపస్సు చేసుకుంటున్న కపిలమునినీ చూశాడతను. కట్టి వేసి ఉన్న యాగాశ్వాన్ని కూడా గమనించాడు. కపిలమునిని సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడతనికి. అనేక విధాల స్తుతించాడు.*


*అనుగ్రహించాడు కపిలముని. చల్లగా కళ్ళు తెరచి, మెల మెల్లగా ఇలా చెప్పాడు. ‘‘యాగాశ్వాన్ని నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు. నీ పినతండ్రులు పవిత్రులు కావాలంటే దానికి గంగాజలమే పరిష్కారం.’’*


*కపిలునికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు అంశుమంతుడు. యాగాశ్వాన్ని తీసుకుని బయల్దేరాడు. అశ్వాన్ని తాత సగరునికి అప్పగించాడు. యాగం పూర్తయిందప్పటికి. కొన్నాళ్ళకు రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పగించి, తపోనిష్ఠలో తనువు చాలించాడు సగరుడు.*


*సగరపుత్రులు తవ్విన కారణంగా సముద్రానికి ‘సాగరం’ అని పేరు వచ్చింది.*


*తన పినతండ్రులకు ఉత్తమ గతులు కల్పించేందుకు అంశుమంతుడు అనేక సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. అయితే అది సాధించకుండానే కాలధర్మం చెందాడు. అంశమంతుడు కొడుకు దిలీపుడు కూడా గంగను రప్పించి, తన పితామహాదులకు ఉత్తమగతులు కల్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. అతని ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకి ఆ కార్యాన్ని దిలీపుని పుత్రుడు భగీరథుడు సాధించాడు.*


*భగీరథుడు:~*


*ఎవరూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధించి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాడు భగీరథుడు. దివి నుండి భువికి గంగను తీసుకుని వచ్చింది అతనే!*


*తన పితృదేవతలకు సద్గతి కల్పించాలని భగీరథుడు కఠోరమయిన తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలూ మునులూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి గంగాదేవి ప్రత్యక్షమయింది. విషయం అడిగి తెలుసుకుంది. అప్పుడు ఇలా అంది. ‘సరే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ పితృదేవతలకు సద్గతి కల్పిస్తాను. అయితే నేను స్వర్గలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నా ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు కావాలి. లేకపోతే భూతలాన్ని చీల్చుకుని, నేను పాతాళంలోకి జారిపోతాను. నన్ను తట్టుకునే మహనీయుణ్ణి ముందు చూడు.’’*


*‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు భగీరథుడు.‘*


*‘మరో విషయం. నేను భూమి మీద ఉంటే భూలోకంలోని పాపాత్ములంతా నాలో స్నానం చేసి, తమ పాపాలు నాకు అంటగడతారు. ఆ పాపాల్ని నేనెలా భరించేది?’’ అడిగింది గంగ.*


*ఆలోచించాడు భగీరథుడు. ఇలా అన్నాడు. ‘‘నీ ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు శంకరుడు ఉన్నాడు. అతడు నిన్ను భరిస్తాడు. విష్ణుపాదోద్భూతమయిన నిన్ను పాపాలు అంటవు. నిప్పును చెదలు అంటుతాయా తల్లీ? దయచేసి నా ప్రార్థన ఆలకించి, భూలోకంలోకి దిగి రా.’’ వేడుకున్నాడు భగీరథుడు.*


*అంగీకరించింది గంగ. తనని తట్టుకుని నిలబడే శంకరుని కోసం ముందు ప్రార్థించమంది. శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యి భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: