శు భో ద యం 🙏
అర్జునుని పాశుపత వ్రతదీక్ష!
శా: " పంచ బ్రహ్మ షడంగ బీజసహిత ప్రాసాద పంచాక్షరీ
చంచ న్మంత్ర పరంపరా పరమ నిష్ఠా తత్పరత్వంబునన్
మంచుంగొండ యనుంగుఁ బెండ్లికొడుకున్ మధ్యాహ్న కాలంబు సే
వించున్ నిర్జర రాజ సూనుఁడు మనోవీధీ సదాధ్యాసియై ;
హరవిలాసము--5 ఆ: 33పద్యం: శ్రీనాథ కవిసార్వభౌముడు!
శైవాగమ మంత్ర రహస్యావ బోధకమైన యీపద్యం శ్రీనాధ హరవిలాస గ్రంధములోనిది. అర్జునిని పాశుపత వ్రతదీక్షా విధానమును యిది నిరూపించు చున్నద
:- అర్ధములు:- పంచబ్రహ్మ షడంగ బీజసహిత-- పంచాక్షరీ మంత్రమునకు గల 11అనుబంధమంత్రములతోగూడిన;
(అంగన్యాస కరన్యాస సమయమున నుచ్చరింపబడు1 ఓంహ్రీం హృదయాయనమః 2 ఓంహ్రీం శిరసేస్వాహా 3 ఓంహ్రీం శిఖాయైవషట్;
ఇత్యాదిగానున్న11 మంత్రములు)వీటితోకూడీన; ప్రాసాద పంచాక్షరీ చంచన్మంత్ర పరంపరా పరమ నిష్ఠాతత్పరత్వంబునన్; శివానుగ్ర కారియైన యొప్పు మంత్రముయొక్క జపవిధానరీతితో కూడిన గొప్ప నిష్ఠాపరాయణత్వమున: మధ్యాహ్న కాలంబునన్--మధ్యాహ్న సమయమున; మంచుంగొండ యనుంగు బెండ్లికొడుకున్: హిమగిరి ప్రియ జామాతను ;నిర్జరరాజసూనుడు--దేవేంద్ర కుమారుడు;మనోవీధిన్--మనస్సులో ;సదాధ్యాసియై --నిరంతర జపరీతిలో సేవించున్; పూజించును;
భావము: పంచాక్షరీ మంత్రమునకు గల అంగన్యాస కరన్యాసములయందలి 11 మంత్రములను కలిపి శివానుగ్రహ కారకమైన పంచాక్షరీ మంత్రమును జపించుచుచు. హిమగిరి జామాతను అర్జనుడు చక్కని నిష్ఠతో మధ్యాహ్న సమయమున పూజించుచుండును.
శ్రీనాధుని ఈశ్వరార్చనా శీలమున కీపద్యము చక్కనిప్రతీక!
శైవము 1కాలాముఖము 2 వీరభద్రము 3 పాశుపతము -అనిప్రధానముగా మూడువిధములు. కాపాలికాదులు మరికొన్నియున్నను అవిక్షుద్రములగుట ఆర్యులుపరిగణింపరు. పైమూడును వీర శైవ శాఖలు. పాశుపతశైవము యించుక తీవ్రమైనది. దానిని అర్జనుడేవిధముగా పాటించు చున్నడో యీపద్యం సూచించుచున్నది.
అభిషేక సమయంలో మనంసాధారణంగా అంగన్యాస కరన్యాసాలు చెప్పుకుంటూ ఉంటాం.కానీ పాశుపతశైవులు పంచాక్షరీ మంత్రజపానికి ఉపక్రమించిన ప్రతిమారు యివిచెప్పుకుంటారన్నమాట.
మంచుంకొండ యనుంగు పెండ్లికొడుకున్- అని యీపద్యంలో శివునిపేర్కొనటం గమనించదగినది. శివుడు ఉగ్రుడే, కానీ
భక్తలయెడ చల్లనివాడు. నివాసం శ్వశురగృహం హిమాలయంగదా! అదిగో అందులవన నన్నమాట!
మొత్తంమీద పద్యమంతా శైవ మత తత్వావబోధనకు పట్టుఁగొమ్మ!!!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🕉️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🌷🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి