24, ఫిబ్రవరి 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*298 వ రోజు*


*అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట*


అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రథసారథిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు,  అశ్వత్థామ, కృతవర్మ 

అతడి మీద బాణవర్షం కురిపించారు. అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రథము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రథములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గదను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారథిని, రథాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గదాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై

అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గదాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారథిని చంపి అతడి రథమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: