*తిరుమల సర్వస్వం -159*
*స్వామి పుష్కరిణి -6*
*పరీక్షిన్మహారాజు*
ద్వాపరయుగంలో ఒకానొకప్పుడు అర్జునుని మనుమడు అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తు మహారాజు సుదీర్ఘ సమయం పాటు వేటాడడంతో అలసిపోయి, పరివారానికి దూరమై, దప్పికతో అలమటిస్తూ శమీకమహర్షి ఆశ్రమానికి సమీపించి త్రాగునీటికై అర్థిస్తాడు. ధ్యానమగ్నుడైన ఋషిపుంగవుడు క్షత్రియుని రాకను గమనించక పోవడంతో కోపోద్రిక్తుడైన మహారాజు యుక్తాయుక్త విచక్షణ మరచి, ఆ ఋష్యాశ్రమంలో చచ్చిపడియున్న సర్పాన్ని తన వింటికోపుతో తీసి, ఋషి మెడలో వేసి వెనుదిరుగుతాడు. ఈలోగా సమిధల కోసం వనానికేతెంచిన శమీకుని కుమారుడు 'శృంగి' ఆశ్రమానికి తిరిగి వచ్చి, తండ్రి కంఠము నందున్న మృతసర్పాన్ని గాంచి కృద్ధుడై, తండ్రిగారిని ఆ విధంగా అవమానించిన వాడు ఏడు దినాలలో 'తక్షకుడు' అనే విషసర్పపు కాటుతో మరణిస్తాడని శపిస్తాడు. ఈ వార్తను తెలుసుకున్న పరీక్షిత్తు పాముకాటును తప్పించుకోవడానికి మంత్రుల సలహా మేరకు ఒంటిస్తంభపు భవనంలో నివసిస్తూ, కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేసుకొని, భాగవత శ్రవణంతో కాలం గడుపుతుంటాడు.
ఇంతలో, 'కాశ్యపుడు' అని పిలువబడే మహిమాన్వితుడైన విప్రుడు, తన మంత్రశక్తితో పరీక్షిత్తు మహారాజును తక్షకుని విషం నుంచి రక్షించి, మహారాజు నుండి భూరి కానుకలను పొందే నిమిత్తం ఆఘమేఘాలపై ప్రయాణించి, సరిగ్గా ఏడవనాటి ఉదయానికి పరీక్షిత్తు మహారాజు నివసించే నగర శివార్లకు చేరుకుంటాడు. మునిపుత్రుని శాపాన్ననుసరించి, ఆరోజే పరీక్షిత్తు మృత్యువాత పడాల్సి ఉంది.
సరిగ్గా అదే సమయానికి మహారాజును తన విషపు కోరలకు బలి కావించి, మునిపుత్రుని శాపాన్ని నిజం చేసే ఉద్దేశ్యంతో తక్షకుడు కూడా నగర పొలిమేరలకు చేరుకుని, కశ్యపునికి తారసపడతాడు. కశ్యపుని ద్వారా అతని అంతరార్ధాన్ని గ్రహించిన తక్షకుడు ఆ విప్రుని మహిమను పరీక్షింప గోరి, దగ్గరలోనున్న ఒక మహావృక్షాన్ని తన విషపు కోరలతో భస్మీపటలం గావించి, దానిని పునర్జీవింప జేయవలసిందిగా కశ్యపుని కోరుతాడు.
బూడిదకుప్పగా మారిన మహావృక్షాన్ని తన మంత్రశక్తితో తిరిగి బ్రతికించిన కశ్యపుని దివ్యశక్తికి అచ్చెరువొందిన తక్షకుడు, ఆ విప్రునితో, కశ్యపుడు నిస్సందేహంగా మహా మహిమాన్వితుడని, అయితే ఋషిపుత్రుని శాపం అనృతం కాకూడదని, అందువల్ల తాను ఇచ్చే అమూల్యమైన ధనరాశులను స్వీకరించి రాజు గారిని రక్షించే ప్రయత్నాన్ని విరమించుకొన వలసిందిగా ప్రార్థిస్తాడు. ధనాశకు లోనైన కశ్యపుడు తన మహిమతో పరీక్షిత్తు మహారాజు పూర్వాపరాలనెరిగి, అల్పాయుష్కుడైన మహారాజును రక్షించడం వ్యర్థమని తలచి, తక్షకుడు ఇచ్చిన విశేషమైన సంపదను స్వీకరించి, స్వస్థలానికి వెనుదిరుగుతాడు. తత్ఫలితంగా, ఆరోజు సాయం సమయంలో తక్షకుని కాటువల్ల పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు.
తదనంతరం, దురాశాపరుడై తన విద్యుక్తధర్మాన్ని విస్మరించి, మహారాజు మరణానికి కారకుడైన కశ్యపుని ఉదంతాన్ని ఆనోటా ఆనోటా విన్న రాజ్య పౌరులందరూ అతనిని అసహ్యించుకొని సభ్యసమాజం నుండి బహిష్కరిస్తారు. ఇలా అందరూ తనను వెలివేయడంతో, నడిమంత్రపు సిరిగా వచ్చిన ధనాన్ని ఏం చేసుకోవాలో తోచని కశ్యపుడు, 'శాక్యముని' తో తన గోడును వెల్లడించు కుంటాడు. తన దివ్యదృష్టి ద్వారా జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకున్న మహర్షి ప్రజలందరికీ రాజు పితృతుల్యుడని, అటువంటి భూపాలుణ్ణి సర్వకాల సర్వావస్థలయందు రక్షించు కోవలసిన బాధ్యత పౌరులందరిపై ఉందని, అడియాసకు లోనై తన బాధ్యతను విస్మరించిన కశ్యపుడు ఘోరాపరాధానికి ఒడిగట్టాడని, ఆ పాపం కశ్యపుణ్ణి అనేక జన్మల పాటు పీడిస్తుందని శెలవిచ్చాడు. ఇంతటి మహాపరాధానికి ప్రాయశ్చిత్తం లేదని కూడా చెబుతాడు. అయితే, దారి-తెన్ను గానని కశ్యపుడు పరిపరివిధాల ప్రాధేయ పడడంతో, ధర్మశాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, కశ్యపుని పాపనివృత్తి చేయడానికి స్వామిపుష్కరిణి స్నానమొక్కటే మార్గమని తరుణోపాయం సూచిస్తాడు.
పరమానంద భరితుడైన కశ్యపుడు ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా, హుటాహుటిన బయలుదేరి, తిరుమలక్షేత్రాన్ని చేరుకుని భక్తిప్రపత్తులతో స్నానమాచరిస్తాడు. తదనంతరం శ్రీవేంకటేశ్వరునికి ప్రణమిల్లి తనను పాపవిముక్తుణ్ణి చేయవలసిందిగా వేడుకొంటాడు.
అలా స్వామిపుష్కరిణి మహిమతో పాపాన్ని పరిహరించుకొని, స్వస్థలానికి చేరుకున్న కశ్యపుణ్ణి, పురజనులందరూ జరిగినదంతా మరచి మునుపటి వలె ఆదరించి అక్కున జేర్చుకుంటారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి