తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారు ఎప్పుడూ భగవత్సంబంధమైన విషయములను మాట్లాడేవారు. కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనస్సు కృష్ణునియందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టమును కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ ఇంటికి వచ్చేవారు పదిహేను నిమిషములు మాట్లాడితే కనీసంలో కనీసం అయిదు నిమిషములు భగవత్సంబంధమో, పిల్లలు విన్నా పనికివచ్చే మాటలో మాట్లాడేవాడయి ఉండాలి. అంతే కానీ ఇంటికి వచ్చేవాడు లౌకికమయిన విషయములు, వాడి మీద గోల, వీడి మీద గోల, అసలు పనికొచ్చే విషయములు మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. ఒక ఇంట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమాను తలుచుకుంటుంటే ఇంట్లో పిల్లలకు పెద్దలఎడ భక్తిభావన గౌరవము ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మయందు హృదయము కుదురు కొనినది. ఆయననే వివాహం చేసుకోవాలని మనస్సు నందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి ఉన్నదై ఇంతకూ పూర్వం ఏ పురుషునికీ తన హృదయంలో స్థానము ఇవ్వనిదై, కులవతియై, ఆచారము సంప్రదాయము తెలిసి ఉన్నదై, కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దామన్న ప్రయత్నము ఉన్నది కానిదై ఇతఃపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై తన భర్తను తాను ఎన్నుకొన్నస్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు.
బంధువు లెల్ల గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషి
సింధువులై విచారములు సేయగా వారల నడ్డుపెట్టి దు
స్సంధుడు రుక్మి కృష్ణునెడ జాల విరోధముజేసి మత్తపు
ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచు దలంచె నంధుడై.
నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు గలిగిన రుక్మిణీ దేవిని కళ్ళు లేనివాడై పెద్దన్న గారయిన రుక్మి శిశుపాలునకు యిస్తానంటున్నాడు. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉన్నది. నల్లని అమ్మవారి కబరీబంధమును మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీ దేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాతగారి ఇంటికి వచ్చేశాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురుని చెయ్యాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలయిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అన్నది. ‘మహానుభావా! నేను శ్రీకృష్ణపరమాత్మను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. నా అన్నగారయిన రుక్మి నన్ను తీసుకొని వెళ్ళి శిశుపాలున కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలిని చేయవలసింది’ అని అడిగింది. వెంటనే అగ్నిద్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకా నగరమును చేరుకున్నాడు.
కృష్ణ పరమాత్మ అగ్నిద్యోతనుడు వచ్చాడని తెలుసున్నా అగ్నిద్యోతనుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలిసివున్న వాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి, ఆయనకు అర్ఘ్య పాద్యాదులు ఇచ్చిన తరువాత ఆయనకు మధురాన్నములతో భోజనం పెట్టి, ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేస్తూ, మీరు ఏ దేశమునకు చెందినవారు. మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా?’ అని అడిగాడు. అగ్నిద్యోతనుడు ‘నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుండి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకువచ్చాను. మీరు అవధరించవలసినది’ అని ఆ లేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు.
ఆ లేఖను తీసుకొని పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతనగారు తెలుగులో చక్కని పద్యములలో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములలోని శక్తి పోతనగారి పద్యములలో ఉన్నది. ఆ పద్యములు శ్రీకృష్ణపరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితము కలుగుతుంది. కన్నెపిల్లలకు పెళ్లి అవుతుంది. రుక్మిణీదేవి ఎంతో గొప్పగా ‘నీవు ధన్యుడవు, పదిమందిని ధన్యులను చేస్తావు. లోకమంతటికీ ఆనందమును చేకూరుస్తావు. నీవు భగవంతుడవు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి వీర్యము, తేజస్సు కలవాడివి’ అని ఆవిడ భగవంతుని గుణములను ఆవిష్కరిస్తుది. నేను గతజన్మలలో ఎప్పుడయినా వ్రతం చేసిన దానను, ఒక నోము నోచిన దానను ఒక మహానుభావుడయిన సద్గురువు పాదములు ఒత్తిన దానను అయితే మనస్ఫూర్తిగా వారి పాదములు పట్టి నమస్కరించిన దానను అయితే నాకు అటువంటి పుణ్యమే ఉంటే అధముడయిన చేధి ప్రభువు శిశుపాలుడు నీచేతిలో మరణించుగాక! నేను నీ దానను అవుదును గాక! అన్నది.
ఇందులో రహస్యం అంతా ఉన్నది. భీష్మకుని అయిదుగురు కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభమును కలిగిస్తుంది. మనకి అయిదు ఇంద్రియములు. ఈ అయిదు ఎప్పుడూ చేధి ప్రభువును కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. ఇంద్రియములను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ అయిదుగురు ఇంద్రియములు. చేధి ప్రభువయిన శిశుపాలుడు కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుడు కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు. ఇంద్రియములను గెలవలేకపోతే శరణాగతి చేయాలి. కృష్ణా! నీవు చతురంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమయిన గుణములు నాయందు ప్రవేశపెట్ట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలిని చెయ్యాలి. నాకు వున్న ఈ అరిషడ్వర్గములను అణచాలి. ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీదానిని చేసుకోవాలి.
రుక్మిణీ నీవు చెప్పావు బాగానే ఉన్నది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డువస్తే భీష్మకుడిని చంపవలసి ఉంటుంది. నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో మా వాళ్ళు నన్ను పెళ్ళికి ముందు ఊరిచివర ఉన్న పరమశివుని ఇల్లాలయిన పార్వతీదేవితో కలిసి కూర్చున్న మహాదేవుడయిన శంకరుని ఆలయమునకు పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నన్ను నీ రథం ఎక్కించుకొని తీసుకు వెళ్ళిపో. అని ఉపాయం కూడా అమ్మవారు బోధ చేసింది.
అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్య శరణాగతి.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్ను బొడగానగా లేని చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
ప్రాణేశా! నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతను నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడడానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చేయాలని ఉంటుంది. నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొరగానిది. నిరంతరము నిన్ను గాఢాలింగనం చేసుకొని నీ మెడలో ఉన్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు? ఎంత పెద్దపెద్ద శరీరములు వస్తే ఎందుకు? నీ సేవ చేయని శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింప గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లేప్రొద్దు జేసిన భువనోన్నతత్వంబు బొందఁ గలుగు
నే నీలసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీ చిత్తచోర!
ఈశ్వరా! నీ గుణములు, కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసార పాశములు తెగిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇవ్వగలిగిన నీ నామమును పలకగాలిగిన నాడు నా నోరు నోరు. ఇంద్రపదవి అక్కరలేదు. నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాడెవరు నన్ను చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్ధం నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నీవు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన’.
నీ పాదములనుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వేయాలని కోరుకునే మహాపురుషులవలే ఈ జన్మకే కాదు. నూరు జన్మలయినా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీకోసం వ్రతములు చేస్తాను. అంతేకానీ అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను’ అని ఆ లేఖలో విషయములను పొందుపరచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి