🌹అన్నమాచార్య చరితము 🌹
తదుప రన్న మయ్య తాళ్లపాకందున
వాస ముండె యిల్లు వదలకుండ
సతత విష్ణుసేవ సాగించు చుండగా
కాలమందు యేండ్లు గడచి పోయె
తరుణ వయసునందు తలి దండ్రు లతనికి
పరిణయంబు సేయ భావ మొంది
వధువు కొఱకు బంధు వర్గంబు నందున
వెదుక సాగి రంత వేడ్క తోడ
అక్కమ్మ తిమ్మక్క లను వధూరత్నముల్
యాత్మబంధువులింట నరయ నుండ
నవ్వారి స్థితిగతులధ్యాత్మచింతన
సాత్వికగుణముల సమ్మతించి
గ్రామ పెద్దలెదుట ఘన విప్రులెదుటను
వేదోక్తపద్ధతిన్ విహిత రీతి
యన్నమాచార్యుకు యాతని తలి దండ్రి
పెండిలి జేసిరి ప్రేమ తోడ
సకల జనములు విప్రులు సన్నుతించ
బంధువర్గంబు సర్వము ప్రస్తుతించ
యాత్మగురువులు యాశీస్సు లందజేయ
యన్నమయ్యయ్యె భువిని గృహస్తు నిగను
కాపురము కొచ్చి కోడండ్రు కదలు చుండ
లలిత లావణ్య మస్తిష్క లక్కమాంబ
పుత్రు విభవంబు నకు హృది పొంగి పోవ
హరిని దలచుచు యానంద దరిని నుండె
అన్నమయ్య తిరుమల పునర్దర్శనము
అన్నమయ్యారీతి యర్ధాంగి ద్వయముతో
నానంద డోలల నరయ నుండి
హరిసేవ మరువక ననయంబు సల్పుచూ
కాలంబు గడిపెను ఘనము గాను
కలియుగ దైవంబు ఘన కల్పతరువగు
వేంకటేశ్వరు జూడ వేడు కయ్యు
తీర్థరాజంబైన తిరుమల కొండకు
యర్ధాంగు లిద్దఱు యనుసరించ
భక్తి భావంబు తోడను పయన మయ్యు
పాద రక్షలు లేకుండ పావనముగ
కాలి నడకన నెక్కియు కదలి కదలి
చేరె వేంకట శిఖరంబు తృప్తి గాను
గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి