🙏:కాశీలో ద్వాదశ (12) సూర్య దేవాలయాలు 🙏
దేశం మొత్తం మీద సుమారు పది దాకా ఆలయాలలో మాత్రమే మూల విరాట్టుగా పూజలు అందుకొనే శ్రీ సూర్య నారాయణ స్వామి, కాశీలో ఏకంగా పన్నెండు ఆలయాలలో కొలువై ఉండటం ప్రత్యేకంగా పేర్కొనాలి.
1) కేశవాదిత్యుడు: ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని (కేశవుడు) గురువుగా స్వీకరించి, తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. శ్రీ ఆది కేశవ స్వామి ఆలయంలో (రాజ్ ఘాట్ ఫోర్ట్ దగ్గర ---> రాజ్ ఘాట్ వేరు... రాజా ఘాట్ వేరు. గమనించ గలరు..) కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి, మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం. కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శనం చేయాలి.
2) మయుఖాదిత్యుడు: సూర్య భగవానుడు ధూత్ పాప, ధర్మ నదుల సంగమ స్థానం వద్ద వైకుంఠ వాసుని ఉపదేశం మేరకు, విశ్వనాధుని అనుగ్రహం ఆపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజురోజుకీ సూర్య కిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోసాగాయి. సూర్య తాపాన్ని ప్రజలు తట్టుకోలేక పోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్త స్పర్శతో ప్రచండుడిని చల్లబరిచారు. లోకాలకు ఉపశమనం కలిగించారు. నేటికీ ఈ మాయుఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండటం గమనించవచ్చును. ఇదే కిరణా నదీ ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్ లో కలుస్తుందట.
సూర్యుడు ప్రతిష్టించిన పరమేశ్వర లింగం గాభస్తీశ్వరుడిగా, అమ్మవారు మంగళ గౌరి గా పంచ గంగా ఘాట్ లో కొలువు తీరి ఉన్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళ గౌరీ ఆలయంలో వెలిసాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులు అన్నీ తొలగి పోతాయని విశ్వసిస్తారు.
3) గంగాదిత్యుడు: లలితా ఘాట్ వద్ద గల నేపాలీ మందిరం క్రింద భాగాన ఉన్న గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధననష్టం ఉండదని అపమృత్యు భయం ఉండదని చెప్తారు.
4) అరుణాదిత్యుడు: గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు ఊరువులు లేకుండా జన్మించిన వినత పుత్రుడైన అనూరుడు. సంతుష్టుడైన రవి తన రధానికి సారధిగా నియమించుకున్నాడు. త్రిలోచన ఘాట్ లో, శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం క్రింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్య్రం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు.
5) ఖగోళాదిత్యుడు: కద్రువ వద్ద దాస్యం తొలగిన తరువాత, వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకొని, తన తప్పులకు పరిష్కారం చేసుకోడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోక పూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొంటారని చెప్తారు.
6) లోలార్కాదిత్యుడు: తులసీ ఘాట్ వద్ద, అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువుతీరి ఉంటారు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండం లోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోర్కెలు శీఘ్రంగా నెరవేరతాయని చెప్తారు.
7) సాంబాదిత్యుడు: నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠురోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి, విశ్వేశ్వరునితో పాటు, సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు. ప్రభాకరుని కృపతో కుష్టు రోగం తొలగిపోతుంది. సూర్య కుండం (సూరజ్ కుండ్) వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్ధించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారట.
8 .ద్రౌపది ఆదిత్యుడు: శ్రీ కృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవానుని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి కనపడతారు.
9) ఉత్తరార్క ఆదిత్యుడు: జాతక రీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనం లోనే తల్లితండ్రులను పోగొట్టుకొన్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సుర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంత కాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ, శివ పార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకొన్నది. బాలిక నిస్వార్ధ బుద్దికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసం ప్రసాదించాడు. మేక మరు జన్మలో కాశీ రాజుకు పుత్రికగా జన్మించినది. స్థానికంగా 'బకరీ కుండ్' అని పిలిచే కోనేరులో స్నానమాచరించి, ఉత్తరార్క ఆదిత్యుని ఆరాధించిన వారికి ఇహ పర సుఖాలు లభిస్తాయట. వారణాశి సిటీ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్ లో ఉంటుందీ మందిరం.
10 విమలాదిత్యుడు: అంతు తెలియని చర్మ వ్యాధితో బాధ పడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్దలతో దినకరుని ప్రార్ధించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడినది. విమలుడుకి ఆరోగ్యం ప్రసాదించిన స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. ఖారీకువా గల్లీ (జంగంబారి)లో ఉండే విమలాదిత్యుని సేవించిన వారిని అనారోగ్య బాధలు దరి చేరవని చెప్తారు.
11) వృద్దాదిత్యుడు: హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్ధించాడు. స్వామి కృపతో పునః యవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తిరిగితే (కనుక్కుంటూ వెళ్ళాలి) అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ చిన్న గదిలాంటి మందిరంలో ఉన్న వృద్ద ఆదిత్యుని పూజించిన వారికి వృద్దాప్య బాధలు ఉండవని చెప్తారు.
12) యమాదిత్యుడు: సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు, తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్టించిన శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కాశీ ఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్ లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు .🙏శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పీఠం🙏 ch భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి