26, ఏప్రిల్ 2021, సోమవారం

మృత్యుంజయ మంత్రం*

 *మహా మృత్యుంజయ మంత్రం*

=======================


*ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* |

*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్* || *ఓం* ||

(శుక్ల యజుర్వేద సంహిత, 3.60)


సుగంధం వెదజల్లే అన్నాన్నిచ్చి పోషించేవాడు, త్రినేత్రుడూ అయినా పరమశివుడిని ఆరాధిస్తూ- 

ఈశ్వరా! తొడిమ నుంచి దోస పండులా సంసారబంధం నుంచీ, మరణం నుంచీ, అశాశ్వతం నుంచీ నన్ను విడిపించు ఆత్మస్థితి నుంచి మాత్రం వీడిపోకుండా చూడమని ప్రార్థిస్తుందీ మంత్రం. మహామృత్యుంజయమంత్రంగా చెప్పబడిన ఈ మంత్రంలో అద్భుత అంతరార్థం దాగుంది. 

మృత్యుంజయమంటే మరణాన్ని జయించడం అని అర్థం. జీవితం జనన మరణ బంధనం. *మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు.* శరీరం నుంచి ప్రాణం వీడిపోవడం మరణం. కానీ జీవించి ఉన్నప్పుడే బుద్ధిపూర్వకంగా ప్రాణం అశాశ్వతం అనీ, ఆత్మయే శాశ్వతమనే అనుభూతిని పొంది, తమతమ కర్తవ్యాలను నిర్వర్తించడమే మరణాన్ని జయించడం. భ్రమల్లో బతుకుతూ, కాలయాపన చేస్తూ జీవిత సత్యాన్ని మన అంతరాత్మ పదేపదే గుర్తుచేస్తున్నా పట్టించుకోకుండా అసంతృప్తితోనే జీవితమంతా బతుకుతాం. అశాంతితోనే మరణాన్ని ఆశ్రయిస్తాం. ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించగలిగితే తారతమ్యాలూ, విభేదాలకు తావుండదు. సర్వసమానత్వ భావనతో ప్రపంచమంతా ఏకమై జీవిస్తుంది.

కామెంట్‌లు లేవు: