7, జనవరి 2022, శుక్రవారం

ఉపవాసం

 ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .


    ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.


         ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.


          ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి అవి 


           1 - నిర్జలోపవాసం .


           2 - జలోపవాసం .


           3 - రసోపవాసం .


           4 - ఫలోపవాసం .


 * నిర్జలోపవాసం -


          మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను . మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .


 * జలోపవాసం -


          కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.


 * రసోపవాసం -


           ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .


 * ఫలోపవాసం -


        ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు . 


        ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.


 * ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -


 జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.


  మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.


  మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.


  ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.


  గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.


  లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.


  శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.


  కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.


  నాడీమండలం శుభ్రపరచబడును.


  జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .


  చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.


    మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.


 * ఉపవాసం చేయకూడని వారు -


       చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .


 * ఉపవాసం చేయదగిన వారు -


       స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.


    ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి వస్తాయి

కామెంట్‌లు లేవు: