18, మే 2022, బుధవారం

నేను

 ‌‌‌    *నేను*


*పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. మరి మనమెందుకలా "నేను" అనే అహం లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం?*


*బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. "నేను"  అనే అహం లేకుండా చేసుకుంటే ఆ బుద్ధి వరం.*

             *"నేను" అనే అహం ను మేరుపర్వతమంత పెంచుకుంటే ఆ బుద్ధి  శాపం.*

         

               *చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న "నేను" అర్జునుడు. పెద్ద  "నేను"  శ్రీకృష్ణుడు.  అతి పెద్ద జీవనగమనం కురుక్షేత్ర యుద్ధం.*


 *అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత.    శ్రీరాముడు సాధారణ మనిషిలా భూమిపై జీవించాడు. మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆదర్శప్రాయుడు అయ్యాడు.*


*జీవితం అవకాశం ఇస్తుంది. అంతే. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కారణజన్ముడికైనా, అకారణ జన్ముడికైనా- బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి విధిరాత భయపడుతుంది.*


*మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.*


            *పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. ఇంతకంటే మహాసాధన జీవితానికి ఉండదు.*


 *మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... ఎన్నో జన్మల పుణ్యం. ఏ ఉపనిషత్తూ ఈ విషయాన్ని కాదనలేదు.*


*వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు. కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద.*


*వేదాలు పదేపదే చెప్పే విషయం. దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.*


*శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని  (శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం (ఆత్మావలోకనం)  అత్యవసరమని మనిషి గ్రహించి, ఆత్మజ్ఞానం పొందిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.*


*ఏ అవకరం లేని,‌ ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం. ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు  అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.*


*శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.*


*మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం  "నేను"  కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.*

కామెంట్‌లు లేవు: