22, ఆగస్టు 2022, సోమవారం

తక్షణ కర్తవ్యం.

 *భగవత్ సాన్నిధ్యం*


పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్‌ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్‌ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని మహాత్ముల అభిప్రాయం.


సాధుల హృదయము నాయది

సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్‌

సాధుల నేనే యెరుగుదు

సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా!


పై భాగవత పద్యాన్ని అనుసరించి ‘సాధువుల హృదయమే నాది. అదే నేను’ అని పేర్కొన్నాడు శ్రీమహావిష్ణువు. 


సౌకర్యం ఏమంటే భగవంతుడు శరీరధారి అయి మనకు కనిపించకపోయినా, సాధువులు ఎక్కడో ఒకచోట కనిపిస్తారు. నిజమైన సాధువు కోసం అన్వేషించాలి. భగవత్‌ విభూతి నిండిన సాధువులు మన అదృష్టం కొద్దీ లభించారా భగవంతుడికి మనం సన్నిహితులం కావడం అంత కష్టమైన పనేం కాదు. అందుకే సాధు సజ్జన సాంగత్యానికి అంత ప్రాధాన్యం.


నిజమైన సాధువులు ఎలా ఉంటారో, వారిని ఎలా గుర్తుపట్టాలో ముందుగా తెలుసుకోవలసి ఉన్నది. సంత్‌ కబీర్‌దాస్‌ సాధువు గురించి గొప్పమాట సెలవిచ్చాడు.


నిరబైరీ నిహకాంమతా, సాయి సేతీ నేహ

విషియా సూఁన్యారా రహై, సంతహి కా అంగ్‌ ఎహ్‌


‘ఎవరి మీదా పగలేకపోవడం, ఏ కోరికలూ లేకపోవడం, విషయ సుఖాలపై ఆసక్తి లేకపోవడం, దైవం పట్ల దృఢమైన భక్తి సాధువు సహజ గుణాలు’ అని కబీర్‌ ప్రవచించాడు. 


అంతేకాదు, ఎంతమంది దుర్జనులు చుట్టూ ఉన్నా సాధువు మారడు. గంధపు చెట్టును పాములు ఎన్నో ఆశ్రయించినా, అది తన సహజ స్వభావమైన చల్లదనాన్ని వదులుకోదు కదా! అలాగే తమచుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా వారి సహజ స్వభావంలో ఎలాంటి మార్పూ రాదు! ఎంతదూరం నుంచి చూసినా సాధువును గుర్తించవచ్చు. 


వారి శరీరం శుష్కించి ఉంటుంది. చూపు ఎప్పుడూ పైకి ఉంటుంది (ఊర్ధ దృష్టి). లోక వాసనలుండవు. ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటారు. అందుకే కబీర్‌ ‘కబీర్‌ హరికా భావతా’ అనే దోహాలో ఈ లక్షణాలనే పేర్కొన్నాడు.


సాధువు ఎలా ఉంటాడో, ఏ లక్షణాలను చూసి అతణ్ని సాధువుగా గుర్తించాలో కూడా వివరించాడు కబీర్‌దాసు. 


‘ఎల్లప్పుడూ శ్రీహరిని భజిస్తూ ఉంటాడు. దైవానికి దూరమయ్యాననే బాధ అతణ్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. తనను గురించి ధ్యాస ఉండదు. నిదురపోతున్నట్టు కూడా కనిపించడు’ అంటాడు. 


అంతేకాదు, ‘వజ్రవైడూర్యాలు ఒకచోట రాశిగా పడనట్టు, రాజహంసలు ఒకేచోట గుంపుగా కనిపించనట్టు, సింహాలు ఒకేచోట సంచరించనట్టుగా.. సాధువులు కూడా జట్లుజట్లుగా మనకు తారసపడర’ని కబీర్‌ అభిప్రాయం.


ఆహ్వానించినంత మాత్రాన సాధువులు ఎవరి ఇండ్లకూ రారు. సద్గుణ సంపన్నులని తమకు విశ్వాసం కలిగినవారి ఇండ్లకే విచ్చేస్తారు. ఎవరింటికి సాధువుల రాకపోకలు జరుగుతూ ఉన్నాయో కనుక్కొని వారింటికి వెళ్లాలి. ఆ ఇంటి యజమానులు ఫలానా వాళ్లు సాధువులు అని నిర్ధారించుకున్న తర్వాతే కదా వారిని ఆహ్వానిస్తున్నది! అప్పుడు సాధువులు ఎవరో నిర్ధారించుకునే శ్రమ చాలావరకు తగ్గుతుంది. 


అయితే, మారుతున్న కాలాన్ని బట్టి చాలామంది సాధువుల రూపంలో, పాదపూజల నెపంతో తారసపడుతూ ఉంటారు. పైపై మెరుగులు, పటాటోపాల మాయలో పడకుండా నిజమైన సాధువును గుర్తించడం సాధకుడి బాధ్యత! సద్గురువు మార్గదర్శనంలో నిజమైన సాధువు ఎవరో తెలుసుకోవడం ఉత్తమం. 


సాధువులు ఎలా ఉంటారో, వారికి ఎలాంటి లక్షణాలుంటాయో కనిపెట్టిన తర్వాత గాని సాధకులు ముందడుగు వేయకూడదు. 


నిజమైన సాధువు తారసపడితే మాత్రం వారి అనుగ్రహం కోసం ఎన్నాళ్లు ఎదురుచూసినా తప్పులేదు. ప్రయత్నపూర్వకంగా వారిని దర్శిస్తూ ఉండాలి. వారితో మర్యాదగా సంభాషించాలి. వారి ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి. వాళ్లు పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. ఇన్ని చేస్తేగానీ, సాధువు అనుగ్రహం లభించదు. వారి చల్లని దృష్టి సోకితే మాత్రం జీవితం సార్థకమవుతుంది. భగవత్‌ సాన్నిధ్యం సులభతరమవుతుంది.


ఇక సాధువులను గుర్తించి వారి ఉపదేశాలను పాఠించడమే తక్షణ కర్తవ్యం.

కామెంట్‌లు లేవు: