కర్ణుడి చావుకి వేయి కారణాలు !
ఒక్క అమీర్ ఖాన్ కె కాదు మొత్తం బాలీవుడ్ కి చావు దగ్గరలో ఉంది. గత 6 ఏళ్లుగా బాలీవుడ్ సినిమా రంగం వెనకబాట పట్టడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ అంటే అతిశయోక్తి కాదు!
2014 లో రిలయన్స్ జియో విప్లవాత్మక ధరల తగ్గింపు వల్ల మొబైల్ ఇంటర్నెట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చింది.
దాంతో ఉత్తరాది ప్రజలకి దక్షిణ భారత సినిమాలని విరివిగా చూడడానికి అవకాశం దొరికింది. అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది హిందీ నిర్మాతలు కూడా అందిపుచ్చుకున్నారు. ఏ మాత్రం వివక్ష లేకుండా దొరికిన కాడికి అన్ని తమిళ్,తెలుగు,కన్నడ,మలయాళ చిత్రాల హక్కులు తక్కువ ధరకి కొనడం వాటికి హిందీ సబ్ టైటిల్స్ వేసి డబ్ చేసి విడుదల చేశారు. అప్పటిదాకా ఖాన్ త్రయం నటించిన సినిమాలు వాటి తాలూకు కధ డిమాండ్ చేయకపోయినా సరే విదేశాలలో భారత సంతతి కి చెందిన వారి జీవితాలని ఖరీదయిన శైలిలో చిత్రీకరించి వదలడం చూసిన ఉత్తరాది ప్రేక్షకులకి దక్షిణా పధాన పల్లెటూరిలో జరిగే సంఘటనల మీద తీసిన సినిమాలు బాగా నచ్చాయి. ఎంతలా అంటే డబ్బింగ్ ఖర్చులు కూడా రావేమో అనుకున్న తరుణంలో కాసుల వర్షం కురిపించాయి దక్షిణాది డబ్బింగ్ సినిమాలు.
ప్రేక్షకులు సబ్ టైటిల్స్ లేకపోయినా సరే నేరుగా దక్షిణాది చిత్రాలని చూడడం మొదలుపెట్టారు.
ఒక్క ఉత్తర భారత దేశంలో నే దక్షిణాది సినిమాలకి విపరీత ఆదరణ దొరికింది అంటే పప్పులో కాలేసినట్లే !
పాకిస్థాన్ లో కూడా ఉర్దూ సబ్ టైటిల్స్ తో దక్షిణాది సినిమాలు ఇంటర్నెట్ లో విపరీత ఆదరణ లభించింది. ఫలితంగా ప్రకటనల రూపంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది.
చివరకి పాకిస్థాన్ ప్రేక్షకులలో కూడా దక్షిణాది హీరోలకి విపరీతమయిన ఆదరణ లభించింది.
నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రేక్షకులు తమ స్వంత యూట్యూబ్ ఛానెల్స్ ని ప్రారంభించి భారతీయ సినిమాల మీద మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాల మీద రివ్యూ లు చేయడం మొదలుపెట్టారు ఈ ట్రెండ్ 2017 లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పాకిస్థాన్ లో.
నిజం చెప్పాలి అంటే ఏదన్నా ఒక తెలుగు సినిమాకి సంబంధించి ట్రైలర్ కావొచ్చు లేదా టీజర్ కావొచ్చు రిలీజ్ అవగానే వెంటనే పాకిస్తానీ యూ ట్యూబ్ ఛానెల్స్ దానిమీద కూడా రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచెంగా చూసేవాళ్ళ సంఖ్య ఉన్నా రాను రాను అది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నెలకి కనీసం 500 డాలర్ల ఆదాయం రావడం మొదలుపెట్టి కొందరికి ఇప్పుడు అది నెలకి రెండు వేల డాలర్ల ఆదాయం ఇచ్చేంతగా ఎదిగింది. ఆదాయం రావడం మొదలవగానే పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ ని నిర్వహించే వాళ్ళు తమ రివ్యూ లలో చాలా స్పష్టంగా ఎలాంటి యాస లేకుండా తెలుగు ని తెలుగు గా , కన్నడ ని కన్నడ గా చాలా స్పష్టంగా పలకడం లో జాగ్రత్త తీసుకోవడం వలన పాకిస్థాన్ తో పాటు భారత్ లో కూడా వీళ్ళ ఛానెల్స్ కి ఆదరణ లభించింది అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
విశేషం ఏమిటంటే మన దక్షిణాది హీరో లని మనం పెద్దగా పట్టించుకొము కానీ పాకిస్తానీ యూట్యూబర్స్ మాత్రం ఇంటర్నెట్ లో వెతికి మరీ మనకి కూడా తెలియని విషయాలని ప్రస్తావిస్తున్నారు అంటే దక్షిణ సినిమా రంగం వాళ్ళని ఎంతలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
సంస్కృతి !
పాకిస్తానీయులు కూడా దక్షిణ భారత సంస్కృతి మీద అవగాహన పెంచుకున్నారు. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోల పాశ్చత్య సంస్కృతి మీద ఉన్న మక్కువని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇది మొదట 2017 లో ఉత్తర భారత ప్రేక్షకుల నుండి మెల్లగా పాకిస్థాన్ వరకు పాకింది. ఎవరి సంస్కృతి,సాంప్రదాయాలని వాళ్ళు పాటించడం అనేది ఏ దేశానికి అయినా మామూలే కానీ బాలీవుడ్ మాత్రం భిన్నంగా కనిపించడం మొదలయ్యే సరికి అది కాస్త మరింత ద్వేషానికి కారణం అయ్యింది. దక్షిణ భారత హీరోల ఆచార,వ్యవహారాల మీద నిశితంగా దృష్టి పెట్టడం మొదలయ్యే సరికి అది క్రమేణా బాలీవుడ్ హీరోల పాలిట శాపంగా మారింది.
సినిమా ముహూర్త సమయంలో చేసే పూజ దగ్గర దక్షిణ భారత హీరోలు చెప్పులు,బూట్లు వదిలేసి మరీ వచ్చి కొబ్బరి కాయ కొట్టడం,హారతి కళ్ళకి అద్దు కోవడం దగ్గర నుండి ఉత్తరాది ప్రేక్షకులు తేడాని చూడడం ప్రారంభించారు మెల్లగా. కొన్ని బ్లాగులలో బాగా చదువుకున్న ఆధునికమయిన జీవన శైలిని గడుపుతున్న ఉత్తరాది విద్యావంతులు దక్షిణ,ఉత్తర భారత సినీ పరిశ్రమలోని తేడాలని స్పష్టంగా వేలెత్తి చూపడం కూడా ఉత్తరాది ప్రేక్షకుల వైఖరిలో మార్పు రావడానికి కారణం అయ్యింది.
బాహుబలి సిరీస్ రెండూ కూడా ఉత్తరాదిన అఖండ విజయం సాధించడం వెనుక ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషించింది. గంపగుత్తగా బాలీవుడ్ సినిమాలని అక్కడి ప్రేక్షకులు నిరాకరించడం మొదలయ్యి ఇప్పటికీ 5 ఏళ్లు అవుతున్నది కానీ ప్రేక్షకుల లో వచ్చిన మార్పుని గుర్తించకపోవడం బాలీవుడ్ నిర్మాత,దర్శకులు,హీరోల వైఫల్యం ఆని అనే కంటే డబ్బు తెచ్చిన అహంకారం అనే చెప్పాల్సి ఉంటుంది.
సత్యం తెలుసుకునే సమయం ప్రేక్షకులు ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక పోయింది బాలీవుడ్.
గుర్తింపు తో పాటు డబ్బుని ఇచ్చేదీ సగటు ప్రేక్షకుడు అన్న సంగతి మరిచిపోయిన బాలీవుడ్ కి అదే ప్రేక్షకులు తమ ద్వేషాన్ని వాళ్ళ సినిమాలని చూడకుండా ఉండడం లో విజయం సాధించారు. మరీ ముఖ్యంగా నటన విషయంలో అగ్ర హీరోల బండారం బయటపెట్టింది OTT . దక్షిణాది నటుల తో పోలిస్తే ఉత్తరాది నటుల [అందరూ కాదు ] నటనని పొలుస్తూ ట్రోలింగ్ వీడియొ లు కొ కొల్లలుగా వచ్చేశాయి యూ ట్యూబ్ లలో. ఇదీ మరో కారణం అయ్యింది బాలీవుడ్ విఫలం అవడానికి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య !
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మీద కొన్ని అగ్ర సినీ హౌస్ లు పగ పట్టాయి. అయితే వీటి వెనుక కారణం మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి లభిస్తున్న ఫాలోయింగ్ కొందరు హీరోలకి నిద్ర లేకుండా చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరులో ఉన్న రాజ్ పుత్ ని తీసేయమని ఒత్తిడి తెచ్చారు కానీ నేను రాజ్ పుత్ ని నా పేరుని నేను మార్చుకోను అంటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనడం కూడా పరోక్షంగా అతని హత్యకి కారణం అయ్యింది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు రాజ్ కుమార్ రావ్,నావాజుద్దీన్ సిద్దికి లాంటి టాలెంట్ ఉన్న నటులు బాలీవుడ్ లో ఉన్నా వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఇక నవాజుద్దీన్ సిద్దికీని అయితే B గ్రేడ్ సినిమాలకి పరిమితం చేసింది బాలీవుడ్. ప్రేక్షకులు మాత్రం టాలెంట్ కె తమ వోటు అని చెప్తున్నా కపూర్,ఖాన్,సిప్పీ ఇలా కుటుంబ వారసులకే అవకాశాలు ఇవ్వడం మానుకోలేదు. ఇక ముందు అలా జరగదు అని భావిస్తే పప్పులో కాలేసినట్లే.
మొత్తంగా చూస్తే వరుస పరాజయాలతో బాలీవుడ్ పరిశ్రమ కుప్ప కూలే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎంత మాఫియా అయినా ఎల్ల కాలం డబ్బుని ఇస్తూ పోలేదు. ఎక్కడో అక్కడ దానికి ఫుల్ స్టాప్ పడక తప్పదు. లేకపోతే ఎలాంటి ప్రోమోషన్ లేకుండానే పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో అంత వసూళ్లు ఎలా చేయగలిగింది ? ఇప్పుడు ఉత్తరాదిన అల్లు అర్జున్,రామ్ చరణ్,ప్రభాస్,జూనియర్ ntr లకి ఉన్న ఫాలోయింగ్ ఖాన్ బ్రదర్స్ కి లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకి పోయి తీసిన పృధ్వీ రాజ్ చౌహాన్ ఫ్లాప్ అవడానికి కారణం బాహుబలి తో పోల్చి చూడడమే కారణం. మళ్ళీ రాజమౌళి పృధ్వీరాజ్ మీద సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారు. కధని నడిపించడం ఎలానో దక్షిణాది దర్శకులు బాగానే తెలుసుకున్నారు ఇప్పుడు అదే విజయానికి కారణం అవుతున్నది. పుష్ప సూపర్ హిట్ అవగానే సుకుమార్ తీసిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.
నిజానికి బాలీవుడ్ పతనానికి పునాది రాయి 20 ఏళ్ల క్రితమే పడ్డది , అది ఖుషీ సినిమాలో పవన్ మీద స్ట్రీట్ ప్లే ఆధారంగా చిత్రీకరించిన 'ఏ మేరే జహ ఏ మేరే ఘర్ మేరే ఆషియ ' అనే పాటని పూర్తిగా హిందీలోనే KK చేత పాడించి విజయం సాధించింది. అప్పట్లో బాలీవుడ్ హీరోలతో పాటు దర్శకులు కూడా ఖుషీ సినిమాని స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారు.
మారిన ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకొని తీస్తే హిందీ సినిమాకి పూర్వ వైభవం వస్తుంది కానీ ఆ పని వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరనే అనిపిస్తున్నది.
నటుల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో అనే దానిని కూడా ఇప్పటి ప్రేక్షకులు పరిగణలోకి తీసుకుంటున్నారు అన్న సంగతిని బాలీవుడ్ గుర్తించలేదు.
గత కొంత కాలంగా ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం బ్రహ్మానందం తన చేతితో గీసిన వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని అల్లు అర్జున్ కి బహుకరించిన ఫోటో. గిన్నీస్ బుక్ లో చోటు చేసుకున్న బ్రహ్మానందం ని కేవలం హాస్య నటుడుగా కాకుండా డౌన్ to ఎర్త్ అంటూ బ్రహ్మానందం సర్ అంటూ సంబోధించడం మొదలుపెట్టారు. ఈ గౌరవం ఖాన్ బ్రదర్స్ కి ఇవ్వడం మానేశారు. అదే ఇప్పటి అమీర్ ఎర్ర చెడ్డీ పరాజయానికి కారణం అయ్యింది. ఏదీ ఒక్క రోజులో జరిగిపోదు. ఎర్ర చెడ్డీ పరాజయం నేరుగా ఖాన్ త్రయం రాబోయే సినిమా బిజినెస్ మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మార్కెట్ ఉంటే ఎంత డబ్బు అయినా పెట్టి తీస్తారు కొంటారు. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకి డబ్బు తిరిగి ఇచ్చే సాంప్రదాయం బాలీవుడ్ లో లేదు. ఇదీ ఒక మైనస్ పాయింట్ అక్కడ.
వోట్లు వేసేది,సినిమా హిట్ చేసేది ఒకళ్ళే అని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి