19, సెప్టెంబర్ 2022, సోమవారం

స్నేహ బంధం

 స్నేహ బంధం 

ప్రకృతిలో తియ్యనిది స్నేహం అని అంటారు.  మనకు స్నేహితులు అనేకరకాలుగా తారస పడతారు. కొందరు మన చుట్టుప్రక్కల ఉండటం వలన స్నేహితులుగా వుంటారు. కొందరు మనం చదువుకునే పాఠశాలలోనో లేక కళాశాలలోనో మనతో చదువుకోవటం వలన స్నేహితులుగా అవుతారు.  ఇంకా కొంతమంది మన ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో మనతో వుండి పరిచయం ఏర్పడి మిత్రులుగా అవుతారు. స్నేహితులు ఏరకంగా వున్నా కూడా ఒక స్నేహితునికి ఇంకొక స్నేహితుడు సహాయ సహకారాలు అందించుకోవటం చాలా  మంచిది. కొంతమంది వ్యసనపరులకు వారి వ్యసనాల ద్వారా కూడా స్నేహితులు ఏర్పడవచ్చు. 

గతంలో మంచి మార్గంలో నడవనివారు కూడా ఒక మంచి స్నేహితుని సాన్నిధ్యంలో మంచివారుగా మారవచ్చు కూడా. అందుకేనేమో "సావాసదోషే గుణీభవన్తు" అని అంటారు. సావాసం వలన మంచి గుణాలు అలవడితే అంతకంటే సంతోషించవలసింది  లేదు. కానీ కొన్ని సందర్భాలలో చెడుగుణాలు కూడా స్నేహ ప్రభావంతో కలుగవచ్చు.  ఉదాహరణకు నీవు మంచివాడివే కానీ నీకు ఒక వ్యక్తి నీవల్ల ఏదో ఆశించి అంటే నీ ఉద్యోగాన్ని ఆసరాగా తీసుకోనో, లేక నీ వృత్తిని, వ్యాపారాన్ని ఆసరాగా తీసుకొని తాను లబ్ది పొందాలని కుతంత్రించి నీకు ఆప్త స్నేహితుడిగా నీతో స్నేహం చేసి నీకు దుర్వాసనలు అలవాటు చేయవచ్చు కూడా నీవు అతను చుపించిన కపటపు ప్రేమను నిజమని నమ్మి అతని మాయకు బలికావచ్చు కూడా ఇలా దొంగ స్నేహితుల మోసాలకు బలైన వారు ఎందరో.  చివరకు కానీ తెలియదు నీవు అతని చేతిలో మోసపోయావని.  అప్పటికే సమయం మించిపోతుంది. ఇలాంటి వారిని నమ్మక ద్రోహులని, నమ్మించి మోసగించేవారని, తడిగుడ్డతో గొంతులు కోసేవారని అనటం మనం నిత్యము వింటున్నాము. 

స్నేహం చేసే ముందు ఆ వ్యక్తి నడవడిక గూర్చి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇక కొందరు చాలా సన్నిహితంగా వుంటూ వుంటారు వారినే మనం ప్రాణస్నేహితులు అంటాం.  వారిరువురు "ఛాయా ప్రచ్ఛాయ" లాగ వుంటారు లేక వారిరువుమద్య బంధం "త్వమేవ అహం" అన్నట్లు అంటే వాడే వీడు అన్నట్లు ఎప్పుడు వుంటారు అని అంటారు. నిజానికి ఒక స్నేహితునికి ఆసరాగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు వాళ్లదే నిజమైన స్నేహబంధం. మన శాస్త్రాలు ఇద్దరు వ్యక్తులకు మధ్య ఏడు మాటలు కలసిన, లేక ఏడడుగులు కలసి నడచిన స్నేహం కలుగుతుందని పేర్కొన్నాయి.  అందుకే వివాహంలో వధూవరులను ఏడడుగులు కలిపి నడిపిస్తారు.  అంతేకాదు మన సాంప్రదాయంలో వివాహాన్ని "ఎడడుగుల సంబంధం" అని అంటారు. పెండ్లయిన భార్య భర్తలు ఇద్దరు జీవితాంతం మంచి స్నేహితులుగా మూడు పురుషార్ధాలను (ధర్మ, అర్ధ, కామాలను)  కలసి కట్టుగా ఆచరించాలని అనేక ప్రమాణాలను చేయిస్తారు. అందులో భాగంగా అగ్నిసాక్షిగా కూడా ప్రమాణాన్ని చేయిస్తారు. స్నేహ సంబంధాన్ని మధురమైన బంధంగా మనం అనుకుంటాం. నిజానికి స్నేహబంధాన్ని నిలుపుకోవటం ప్రతి స్నేహితుడు చేయవలన పని. ఈ విషయాలు తెలియక ఈ రోజుల్లో అనేకమంది దంపతులు పెండ్లి అయిన ఒక ఏటికే విడాకులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 

స్నేహ బంధం ఒక తియ్యని అనుభూతి. కానీ స్నేహితం అనేది ఇద్దరు స్నేహితులల్లో ఒకరు జీవించి ఉన్నంతవరకే ఉంటుంది. మరి ఈ స్నేహబంధం శాస్వితంగా వుంటూ ఎల్లప్పుడూ మధురానుభూతిగా ఉండాలంటే యెట్లా అంటే దానికి ఒక స్నేహితుడు సదా మనకు తోడుగా వుండి మనలను రక్షిస్తూవుండే వాడు కావలి మరి ఎవరు ఆలా వుంటాడు అంటే ఒకే ఒక్కడు మనకు అలంటి స్నేహితుడు దొరుకుతాడు  అతడే ఆ పరమేశ్వరుడు. ఎప్పుడైతే భక్తుడు త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని ఫై అకుంఠిత శ్రర్ధతో, నిష్టతో, అనురక్తితో, అంకితభావంతో, నిష్కల్మషంగా స్నేహం చేస్తాడో అప్పుడు భగవంతుడు భక్తుని ఒక మంచి స్నేహితునివలె సదా వెన్నంటి ఉండి కాపాడుతూవుంటాడు.

దేముడితో స్నేహం: 

దేముడితో యెప్పుడైతే మనం స్నేహం చేయటం మొదలు పెడతామో అప్పుడు ఈ ద్వైత ప్రపంచం మొత్తం మిధ్యగా కనిపిస్తుంది. ఎప్పుడు ఈశ్వరుని గూర్చిన ధ్యాసే ఉంటుంది. 

కృష్ణుడితో స్నేహం: మీరా బాయి శ్రీ కృషునితో స్నేహం చేసింది అతనిలోనే ఐక్యం చెందిని. 

రాముడితో స్నేహం: భక్త రామదాసు, తులసీదాసు, త్యాగరాజు, పోతన్న, ఇలా అనేక మంది  శ్రీ రాముడితో స్నేహం ఏర్పరచుకొని వారి జన్మలను సార్ధకత చేసుకోవటం మాత్రమే కాదు మనకు అనేక గ్రంధాలను అందించారు. 

ఈశ్వరునితో స్నేహం: మార్కండేయుడు, కిరాతుడైన కన్నప్ప మొదలైనవారు తాము ఈశ్వరునితో స్నేహం చేసి ముక్తిని పొందారు. 

ఏదేముడితో స్నేహం చేసిన మనం చేసే స్నేహం కేవలం నిరాకారుడైన ఆ పరబ్రహ్మతోటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు నారద మహర్షి నవవిధ  భక్తి మార్గాలు తెలిపారు అవి శ్రవణం, కీర్తనము, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అను తొమ్మిది భక్తి మార్గాలు.  కాబట్టి భక్తులు భగవంతునితో నిరంతరం స్నేహంచేసి మోక్షాన్ని పొందాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 మీ 

భార్గవ శర్మ.

కామెంట్‌లు లేవు: