17, జనవరి 2023, మంగళవారం

250 రూపాయలు చాలు

 250 రూపాయలు చాలు


ఈ భక్తుడు కూడా సేలంవాసి. అతనికి చాలా కాలంగా ఒక కారు కొనాలని ఆశ. కొద్దికొద్దిగా ధనం పొదుపు చేసి, చెన్నై వచ్చి ఒక పాత కారును కొన్నాడు. కొన్న తరువాత కారులో సేలం రావాలని అతని కోరిక. అతను మహాస్వామి వారికి పరమ భక్తుడు కావడం వల్ల సేలం వెళ్తూ, కంచిలోని శ్రీమఠానికి వచ్చాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికి ఉన్న వరుసలో నిలబడ్డాడు. 


ఆ సమయంలో ఒక వృద్ధుడు వచ్చి తన మనవరాలి పెళ్ళికి సహాయం చెయ్యవలసిందిగా స్వామిని వేడుకున్నాడు. ఇటువంటి విషయాలలో సహాయం చెయ్యడం శ్రీమఠం ఆనవాయితి. పరమాచార్య స్వామివారు వారిని పక్కన కూర్చుందమని చెప్పి, శిష్యులతో ఒక వెదురు పళ్ళాన్ని తెప్పించి, తమ దర్శనానికి వచ్చిన భక్తులకు వారికి తోచినంత సహాయం చెయ్యమని చెప్పారు. 


ఆ వచ్చిన డబ్బు లెక్క కోసం, ఒక శ్రీమఠం సహాయకుణ్ణి పిలిచి ఒక పుస్తకంలో ఇచ్చిన వారి పేరు, చిరునామా, ఇచ్చిన మొత్తం వ్రాయమని చెప్పారు. 


మహాస్వామి వారే ఈ విషయంపై శ్రద్ధ చూపించడంవల్ల, వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ వారికి తోచినంత వెయ్యడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు రాసిన వివరాలను గట్టిగా చదవమని చెప్పారు. పేర్లు వారి ఇచ్చిన ధనం చదువుతూ, ఈ సేలం భక్తుని వివరములు కూడా చదివారు. ఆ భక్తుడు తిరుగు ప్రయాణానికి కావలసినంత ధనం ఉంచుకొని మొత్తం అంతా ఇచ్చేసాడు. అతను ఇచ్చిన మొత్తం 500 రూపాయలు. అది చదవగానే మహాస్వామి వారు అతని వంక ఒకసారి చూసి, “రెండువందల యాభై రూపాయలు చాలు. మిగిలినది అతనికి ఇచ్చెయ్” అన్నారు. ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. తను ఇచ్చిన మొత్తంలో ఎందుకు కొంత తిరిగిస్తున్నారో అర్థం కాక తన వల్ల ఏదో అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. ఖిన్న మనస్కుడై తన కారు దగ్గరికి వచ్చాడు. తన ముక్కు పుటాలకి ఘాటైన వాసన వస్తోంది. అది పెట్రోల్ వాసన. కొద్దిగా పరిశీలించి చూడగా తన కారు పెట్రోల్ ట్యాంక్ కు చిన్న కన్నం ఉండడం వల్ల దాని నుండి పెట్రోల్ బయటకు వస్తోంది. దాన్ని బాగుచేయించకుండా తను ఊరికి తిరిగి వెళ్ళలేడు. పరమాచార్య స్వామివారు తిరిగిచ్చిన డబ్బులు దీనికి ఉపయోగపడ్డాయి. స్వామి వారు తిరిగివ్వకపోయుంటే అతని దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి కారు బాగుచేయించ వలసి వచ్చేది. అయినా ఈ ఊళ్ళో తనకు సహాయం చేసేవారు ఎవరు? పరమాచార్య స్వామివారు తప్ప.


--- రా. వేంకటసామి. ‘శక్తి వికటన్’ జులై 2, 2004 ప్రచురణ 


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: