4, జనవరి 2023, బుధవారం

ఈ నిమ్మకాయలు తీసుకో

 ఈ నిమ్మకాయలు తీసుకో


‘నడిచే దైవం’ పరమాచార్య స్వామివారి దర్శనంకోసం ఒక ముసలావిడ వరుసలో నిలబడి ఉంది. ఆమె తెల్ల చీర కట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు ధరించింది. నుదుటన విభూతి రేఖలు పెట్టుకుని తన వంతు రాగానే అత్యంత భక్తి వినమ్రతతో మహాస్వామి వారికి నమస్కరించింది. 


స్వామివారు ఆవిడని చూసిన తరువాత అక్కడ ఉన్న పరిచారకుడిని పిలిచి వెంటనే మఠం వంటగదిలోకి వెళ్ళి వంద నిమ్మకాయలు తీసుకుని రా అని చెప్పగా అతను వెళ్ళి తీసుకుని వచ్చాడు. 


“వీటిని ఆ ముసలావిడకు ఇవ్వు” అని ఆదేశించారు స్వామివారు. 


ఆమెకు అంతా అయోమయంగా ఉంది. మామూలుగా స్వామివారు ప్రసాదం ఇవ్వదలచుకుంటే ఒకటి లేదా రెండు నిమ్మకాయలు ఇస్తారు. ఇలా వంద నిమ్మకాయలను ఇవ్వరు. ఆమె స్వామివారి వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. 


”క్షుద్ర శక్తులను ప్రవేశపెట్టడానికని బజారులో నిమ్మకాయలు కొనడానికి చాలా ఖర్చు పెడుతున్నావు. అలా ఆభిచారిక ప్రయోగాలు చేసి ఎంతోమంది అమాయకులని కష్టాలకు గురి చేసి డబ్బు సంపాదిస్తున్నావు. అందుకే ఈ నిమ్మకాయలను తీసుకో. ఇవి నీ పిశాచ పనులకు పనికివస్తాయి” అని కొంచం ధృడమైన స్వరంతో అన్నారు స్వామివారు. 


ఆ ముసలావిడ చాలా కలవరపడుతోంది. తను రహస్యంగా చేసే పనులు స్వామివారికి ఎలా తెలిసాయో అర్థం కాక, చేసిన తప్పుకు పశ్చాతాప్పడుతూ కళ్ళ నీరు పెట్టుకుంటోంది. స్వామివారి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించింది. తను ఈ ఇక ఈ ప్రయోగాలు చెయ్యనని కర్తవ్యం సెలవివమని వేడుకుంది. 


”ఒక గోవు చెవిలో ఈ మంత్రములన్నిటిని చెప్పి ఇక వాటిని శాశ్వతంగా మరచిపో. మళ్ళా జీవితంలో ఎప్పుడూ ఈ చేతబడి ప్రయోగాలు చెయ్యలని అనుకోవద్దు. ఇది ధన సంపాదనకు ఒక మార్గంగా భావించకు. మిగిలిన జీవితం భగవన్నామాన్ని జపిస్తూ గడుపు. అది చాలు నిన్ను ఉద్ధరిస్తుంది” అని ఆదేశించారు. ఆమెని ఆశీర్వదించి విభూతి ప్రసాదం ఇచ్చి పంపించారు. 


“ఇకనుండి నేను ఇటువంటి పనులు చెయ్యను. నా జీవితాన్ని మార్చుకుంటాను” అని జీవిత పర్యంతం నిరంతరం రామ నామాన్ని జపిస్తూ గడిపింది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: