26, జనవరి 2024, శుక్రవారం

మఠం - మందుల షాపు

 మఠం - మందుల షాపు


చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారి కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇండియన్ బ్యాంకు వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ అలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు.


మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలిసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొకచోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు.


రెండు సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి, స్వామి వారితో “ఈరోజు మా పెళ్ళిరోజు. పరమాచార్య స్వామి వారు మమ్మల్ని దీవించాలి” అని ప్రార్థించారు.


మహస్వామి వారు వారిని గుర్తుపట్టి, “నువ్వు మందుల షాపు ముదలియార్ కదూ?” అని అడిగారు. 

”అవును పెరియవ”


“మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు”

”అవును పెరియవ”


వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు. “ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు?”


“షాపు ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవ. సరైన స్థలం కోసం చూస్తున్నాము” అని చెప్పారు.


మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ”ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాలీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలఏదా?” అని అడిగారు.


ముదలియార్ సణుగుతూ ”అది పెరియవ . . ”


ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారుకి అర్థం అయ్యింది. మఠం మేనేజరు గణేశ అయ్యర్ ని పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. ”మనకు వీలున్నంతలో దదాపు అందరికి మరోచోట స్థలాలు ఇచ్చాము” అని చెప్పాడు


“కాని మెడికల్ షాపు ముదలియార్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అతను ఇంకా షాపు పెట్టుకోలేదు అని చెప్తున్నాడు” అని అడిగారు స్వామి వారు.


గణేశ అయ్యర్ తడబడుతూ ”లేదు పెరియవ అతనితో అన్ని మాట్లాడి నిర్ణయించాము. . . .”


ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవ్వరితోను మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్టు కనిపించారు. మందుల షాపు ముదలియారుకు వేరోకచోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చేయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరగా తీసుకున్న నిర్ణయం అందరికి చెప్పారు. వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చెసింది.


ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతణ్ణి అప్పుడే పంపించివేసారు. తరువాత వారు మేనేజరుని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండు గోడని కూల్చితే ముదలియార్ పాత షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తుంది. సాయిత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీయరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు.


మూడునెలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపుని పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు.


పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని తనకు కలిగిన అదృష్టాన్ని తలచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు.


--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: