22, ఫిబ్రవరి 2024, గురువారం

*శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు..*


2004 వ సంవత్సరం లో నేను మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి ధర్మకర్తగా..మందిర నిర్వహణా బాధ్యతలు చేపట్టాను..అప్పట్లో శ్రీ స్వామందిరానికి దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు..వాళ్ళ ఏర్పాట్లు వాళ్లే చూసుకోవాల్సి వచ్చేది..ముఖ్యంగా శనివారం సాయంత్రం పూట భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉండేవి..వర్షం కురిస్తే తలదాచుకోవడానికి కేవలం శ్రీ స్వామివారి మందిరం లోని మంటపం ఒక్కటే దిక్కు..అందరికీ ఆ మంటపం సరిపోయేది కాదు..అలానే సర్దుకొని వుండేవారు..ప్రధాన ఆలయం చుట్టూరా కనీసం పందిరి వేయించినా కొంతలో కొంత ఇబ్బంది తప్పుతుందని భావించాను..


శ్రీ స్వామివారి మందిరానికి వెనుక వైపు ఆర్య వైశ్య సత్రం ఉన్నది..శ్రీ స్వామివారికి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ మీరా శెట్టి గారి ఆధ్వర్యంలోనే ఆ ఆర్య వైశ్య సత్రం కూడా నిర్వహింపబడేది..కానీ కొద్దిరోజుల్లోనే..విజయవాడ వాస్తవ్యులు శ్రీ గోనుగుంట పెద్ది శెట్టి గారు ఆ సత్రం యొక్క నిర్వహణా బాధ్యతలు చేపట్టారు..పెద్ది శెట్టి గారు శ్రీ స్వామివారికి పరమ భక్తులు..ప్రతి సంవత్సరము రెండు మూడు సార్లు మందిరానికి వచ్చి..దర్శనం చేసుకొని వెళ్లేవారు..


2004 లో నేను శ్రీ స్వామివారి మందిర ధర్మకర్త గా బాధ్యత తీసుకున్న తరువాత..పెద్దిశెట్టి గారితో సాన్నిహిత్యం ఏర్పడింది..ఒకసారి పెద్దిశెట్టి గారు మందిరానికి వచ్చినప్పుడు..భక్తుల సౌకర్యార్థం మందిరం చుట్టూరా రేకులతో పందిరి లాగా వేద్దామని అనుకున్నానని..నేను కొంత మొత్తాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నానని..మిగిలిన మొత్తానికి వారి సహకారం కావాలని అడిగాను..నావైపు సాలోచనగా చూసి.."ఆలోచిస్తాను..మళ్లీ చెపుతాను!." అని అన్నారు..అంతేకానీ స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు..తిరిగి విజయవాడ వెళ్లిపోయారు..నా వద్ద ఉన్న నగదుతో పని పూర్తి కాదు..మొదలుపెట్టి..మధ్యలో ఆపడం బాగుండదు..ఏమి చేయాలి?..శ్రీ స్వామివారి సమాధి వద్ద ప్రార్ధన చేసుకున్నాను..


ఆ ప్రక్కరోజు మా సిబ్బంది వచ్చి.."అయ్యా..మనం రేకులతో పందిరి వేయించాలని అనుకున్నాము కదా..ముందు పని మొదలుపెడదాము..ఆ తరువాత మందిరానికి వచ్చే భక్తులను విరాళాలు అడుగుదాము..కొద్ది మందైనా స్పందించి ఎంతో కొంత సహాయం చేస్తారు..అలా మెల్లిగా పని పూర్తి చేద్దాము.." అన్నారు..ఈ సూచన అమలు చేయాలని అనుకున్నాను..సరే మంచిరోజు చూసి పని మొదలుపెట్టాలని సంకల్పించాను..


ఆరోజు సాయంత్రం..ఆర్యవైశ్య సత్రం మేనేజర్ గారు నా దగ్గరకు వచ్చి.."పెద్దిశెట్టి గారు మీ ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్పారండీ..మీతో మాట్లాడతారట.." అన్నారు..నెంబర్ ఇచ్చాను..ఆ రాత్రికి పెద్దిశెట్టి గారు నాకు ఫోన్ చేసి.."ప్రసాదూ..నువ్వు రేకులతో పందిరి లాగా వేయాలని అనుకున్నావు కదా..రేపుదయం విజయవాడ నుంచి మా పనివాళ్ళ ను పంపుతున్నాను..శ్రీ స్వామివారి మందిరం లో ఎంత మేర పందిరి వెయించాలని నువ్వు అనుకున్నావో.. ఆ లెక్క వాళ్లకు చెప్పు..వాళ్ళు ఎస్టిమేషన్ వేసి నాకు చెపుతారు..మొత్తం సామాను ఇక్కడినుంచి నేను పంపిస్తాను..మా పనివాళ్ళు అక్కడే ఉండి..పని పూర్తి చేసి తిరిగి వస్తారు..నువ్వు ఒక్క నయాపైసా కూడా ఖర్చు చేయొద్దు..ఆ స్వామివారికి నేను ఈ మాత్రం సేవ చేసుకుంటాను.." అన్నారు..ఆ నిమిషం లో నాకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు..కేవలం ధన్యవాదములండీ అని మాత్రం అన్నాను..


మరో వారం కల్లా అనుకున్న విధంగా పని పూర్తి అయింది..మరో రెండు రోజుల్లో పెద్దిశెట్టి గారు మళ్లీ మందిరానికి వచ్చారు.."ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా?.." అన్నారు నవ్వుతూ..తలవూపాను.."నువ్వు నన్ను అడిగిన రోజు..నేను ఆలోచిస్తాను అన్నాను..విజయవాడ వెళ్లిన తరువాత..అంతా స్వామివారి ఆదేశం అని అనిపించింది..ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకు ఫోన్ చేసాను.." అన్నారు..


శ్రీ పెద్దిశెట్టి గారు ఆ ఒక్క పనితో ఆగలేదు..భక్తులు తలదాచుకోవడానికి నాలుగువందల చదరపు అడుగుల విస్తీర్ణంతో రెండు షెడ్లు..వేయి చదరపు అడుగుల విస్తీర్ణం తో మరో షెడ్డు కూడా కట్టించారు..ఈనాటికి కూడా ఆ కట్టడాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి..స్వామివారి ని అత్యంత భక్తితో కొలిచిన ధన్యజీవి శ్రీ పెద్దిశెట్టి గారు..వయోభారం తో పాటు ఆరోగ్యం సహకరించక పోయినా..లేని శక్తి కూడగట్టుకొని..ప్రతి శివరాత్రికి, అలానే శ్రీ స్వామివారి ఆరాధనా ఉత్సవాలకు తప్పనిసరిగా మందిరానికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకొని వెళ్లేవారు..వారు ప్రస్తుతం భౌతికంగా లేరు కానీ..వారు శ్రీ స్వామివారి కి చేసిన సేవ సదా స్మరించుకుంటాము..


పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం...రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: