🌺 ఈమధ్య చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలివేసి ఓ హోటలు దగ్గరకు వెళ్ళాము. మధ్యాహ్నం సమయం హోటల్ లో భోజనం తయారై వడ్డించడానికి రెడీగా ఉంది. వివిధ రకాల వంటలు వేడి వేడిగా ఉన్నాయి. బాగా ఆకలిమీద ఉన్న మేము టొమేటోబాత్ తీసుకురమ్మని సర్వర్ కు చెప్పాము. అప్పుడు ఆ హోటల్ మేనేజరు వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు. ఎందుకు అని అతన్ని అడిగాము. దానికి అతను ఇలా చెప్పాడు. . " అరటి ఆకులు రావడానికి 10 నిమిషాలు పడుతుంది.అవి రాగానే మీకు అందులోనే టొమేటోబాత్ ఇస్తాము. దయచేసి ఓపిక పట్టండి " అనిచాలా వినయంగా చెప్పాడు. చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా ఉంది. చేసేదేం లేక అలాగే కూర్చున్నాము. కాసేపటికి అరటి ఆకులు రాగానే మాకు టొమేటోబాత్ సర్వ్ చేశాడు. తింటూ అతనితో మాటలు కలిపాము. " అరటి అకులు లేకపోతే ఏమైంది ??? ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా! పైగా అవి రేటు కూడా తక్కువే కదా! మీరు అరటి ఆకులోనే వడ్డిస్తున్నారు. దానికేమైనా కారణం ఉందా? అని అడిగాము. . " నిజమే! మీరు చెప్పినట్లు ప్లాస్టిఫ్ ప్లేట్లు చాలా చవకే అరటి ఆకులతో పోలిస్తే! కానీ, ఆ ప్లాస్టిక్ ప్లేట్లల్లో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెపుతున్నారు. నేనేమీ చదువుకోలేదండీ! అన్నీ మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నాము. నా హోటలుకు వచ్చే వారు ధనవంతులు కాదండీ..... లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టటానికి. వారు ఆరోగ్యంగా ఉంటేనేకదా మా హోటలుకు వచ్చేది. వారివల్లనే కదా నా కుటుంబం బ్రతుకుతోంది. . కొంతమందికి ఉపాధి కలిగేది వారివల్లనే కదా! అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరటి ఆకుల్లోనే పెట్టడం మంచిదనిపించింది. పైగా అరటి ఆకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని విన్నాను. . నాకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే మహా అంటే 300 మిగులుతాయేమో! కోటీశ్వరుడిని కాలేను కదా! అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను అరటి అకులే వాడతాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను "అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి