గ్రేట్ ఫిలాసఫీ...
చచ్చిపోయేమనుకో.!. అప్పుడు ఏమవుతుందంటావ్.?'
'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'
'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'
'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'
'స్వర్గం అంటే ఏమిటో.?'
'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'
'రంభా, ఊర్వశి, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'
'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'
'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '
'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'
'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'
'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'
'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'
'అంటే వేయించడంటావా.?'
'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'
'అంటే.. స్వర్గం, నరకం లేవంటావు.?'
'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.
ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం..
అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి