23, మార్చి 2024, శనివారం

శ్రీ కాళహస్తీశ్వరా

 శు భో ద యం🙏


శ్రీ కాళహస్తీశ్వరా!


"నీతో యుధ్ధముసేయనోపఁగవితా నిర్మాణశక్తిన్ నినున్/

బ్రీతుంసేయగలేను,నీకొఱకు తండ్రింజంపఁగాఁజాల,నా/

చేతన్ రోకటనిన్నుమొత్తవెఱతున్, జీకాకు నాభక్తి,యే/

రీతిన్ నాకిక నిన్నుజూడఁగలుగున్ ,శ్రీ కాళహస్తీశ్వరా!


కాళహస్తీశ్వర శతకము.

ధూర్జటి మహాకవి.


భావము:స్వామీ! కాళహస్తీశ్వరా! నీభక్తులందరూ అసాధ్యమైన కార్యములొనరించి నీమెప్పువడసినారు.తెలిసీతెలియనివాడనునాభక్తియెట్టిదో నాకేతెలియనిపామరుడనునీతో యుధ్ధమొనర్చుటనాతరమా?కవిత్వమును జెప్పినిన్నుమెప్పించు శక్తియు లేనివాడనే, నీకొరకు కన్నతండ్రినైనను జంపుసాహసములేదే,నాచేతిరోకటితో నిన్నుదంచలేనే?మరియెట్లుస్వామీ నీసన్నిధినిచేరుట.నాకాఉపాయమేదో ఉపదేశింపుమని కవియభవుని అడుగుచున్నాడు.


విశేషములు:

ఇందు నిందాస్తుతి యలంకారమున్నది.నిందించుచున్నట్లు పైకిగానవచ్చినను వ్యంగ్యముగా శివుని ,యతనిభక్తులను ప్రశంసించుటయే కవియొనరించినకార్యము.

1అర్జునుడు పాశుపతాస్త్రముకొరకై తపమొనర్చునపుడు మాయాకిరాతవేషధారియగుశివునితో యుధ్ధమొనరించును.ఆరీతిగా నీతో యుధ్ధము నేనుచేయలేనుస్వామీ!అనుచున్నాడు.(సమరమున అర్జునుడు శివునిపలురీతులనొప్పించెను)

2నత్కీరుడనే శివభక్తుడు శివునికవిత్వమునతప్పులుబట్టి తనకవితాశక్తితో శివుని మెప్పించినాడు.నాకు అటువలె కవితచెప్పుశక్తిలేదనుచున్నాడు.

3విచార,శర్మయనునాయనారు పశువులను మేపుటకుగొనిపోయి,భక్తిపారవశ్యమున మునుగ,పశులు పంటపొలమునబడినవి.ఇదేమిరాయని అడుగ వచ్చిన తండ్రిని తనఏకాగ్రతకుభంగముకల్గించెనని, కోపావేశమున గొడ్డలితోనరకును.అదిగో ఆనాయనారువలె తండ్రిని చంపలేననుచున్నాడు.


4చిరుతొండనంబియను శివభక్తుడు కపటజంగముకోర్కెదీర్చుటకై కొమరుని జంపి యతనిశిరోమాంసమునురోకటదంచి కూరవండి పెట్టినాడు.


ఈరీతిగా శివభక్తులు చేసినత్యాగములను నేనుచేయలేని యశక్తుడననుచు,"చీకాకునాభక్తి"-యనుచున్నాడు(.అనగా తనభక్తిస్వరూప స్వభావ ులేవో చెప్పుటకు వీలులేనిది)

అట్టిశక్తిహీనుడను నన్ను నీవే నీదరికి చేర్చుకొనవలె ననుచున్నాడు.

                     స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: