9, మే 2024, గురువారం

తెనాలి

 83  సంవత్సరాల  క్రితం  " తెనాలి " పట్టణము గురించి ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన వ్యాసం .


తెనాలి గురించి

    ~కొడవటిగంటి కుటుంబరావు


1.

గుంటూరు వారున్నారు,

చేబ్రోలు వారున్నారు,

ఒంగోలు వారున్నారు,

తెనాలివారు లేరు.

నేనెరిగినంత మట్టుకు లేరు. రామలింగడు తప్ప.


రామలింగడివల్ల

తెనాలికి ప్రసిద్ధి వచ్చిందా,

తెనాలి వల్ల రామలింగడు ప్రసిద్ధికి వచ్చాడా ?


చెట్టు ముందా, 

విత్తు ముందా వంటి ప్రశ్న ఇది

ఆ విషయం ఎవరూ తేల్చలేరు.


2. 

రెండు సికింద్రాబాదులూ,

రెండు హైదరాబాదులూ,

రెండు అన్నవరాలు,

రెండు పూండ్లలూ 

-ఒకటే తెనాలి.

'ప్రపంచమంతటికీ!'


అందుకనే

రామలింగడా పేరు 

ఇంటి పేరు చేసుకున్నాడేమో.


3.

రామలింగడి కాలం వదిలి

వర్తమానానికి వస్తే 

తెనాలి చాలా విషయాలకు ప్రసిద్ధి కెక్కింది.


బియ్యానికి, 

కాఫీ హొటెళ్ళకూ,

పత్రికల అమ్మకానికీ

దోమలకూ,

వానాకాలం బురద రోడ్లకు,

వగైరాలకు.


4.

తెనాలి బియ్యం లండన్లో కూడా చెప్పుకుంటారు అని నేను నమ్మకంగా విన్నాను.

తెనాలి కాఫీ హొటెళ్ళు జగత్ప్రఖ్యాతి గలవి.

తెనాలి చుట్టు పట్ల వారంతా

ఒక్కొక్కప్పుడు 20 మైళ్ళనించి కూడా 

-ఉదయం పూట రైళ్ళ మీదా,

 జట్కా బళ్ళ మీదా,

నడిచి తెనాలి చేరుకుంటారు.

తెనాలిలో చెప్పుకోదగ్గ అయ్యరు హొటలు లేదు.

కాఫీ ఇవ్వడం అయ్యర్లకే చేతనవుననే అనుమానం ఎవరికైనా ఉంటే

తెనాలి పోయి కాఫీ తాగి చూడండి.

మా తెనాలి వాళ్ళు

నలుగురువచ్చి 

మద్రాసులో కాఫీ హొటళ్ళు ప్రారంభిస్తే 

అరవాళ్ళు 

పంజాలు తెంచుకొని 

పట్నం వదిలి పారిపోతారు.


5. 

తెనాలి వాళ్ళు 

పత్రికలు చదవడంలో కూడా ప్రధములు

ఆంధ్రదేశం మొత్తం మీద అమ్ముడుపోయే పత్రికల సంఖ్యలో 

ఏ పదో వంతో తెనాలిలో అమ్ముడుపోతుంది.

అది రామలింగడి ఆశీర్వాదం కావచ్చు,

సాహితీ సమితి పుట్టిన ప్రభావం కావచ్చు.


6. 

తెనాలి దోమలు 

దాదాపు విశాఖపట్నం దోమలంత ఉంటై. 


ఒక దోమలషో పెట్టి 

(బేబీ షో పెట్టినట్టు) 

అందులో విశాఖపట్నం దోమనీ

తెనాలి దోమనీ తూకం వేస్తే

విశాఖపట్నం దోమకి

డిపాజిట్ కూడా నమ్మకం లేదు


7. 

వేసవి కాలమంటే జ్ఞాపకం వచ్చింది ,

వేసవి కాలంలో మా ఊరు బెజవాడ వారికీ ,

గుంటూరు వారికి సిమ్లా  లాంటిది.


8. 

తెనాలి నాటకాలకి, 

నటులకీ ప్రసిద్ధి కెక్కింది.

మొదటి నాట్య కళా పరిషత్తు తెనాలిలో జరిగింది.

మిగిలిన ఆంధ్రదేశమంతా కలిసి ఎంతమంది పెద్దా చిన్నా నటులున్నారో తెనాల్లో అంతమంది ఉన్నారు.

అసలు ప్రతీ తెనాలివాడూ వేషధారే.


అంత దాకా ఎందుకు 

తెనాలి నటుడు లేని టాకీ ఉందీ? 


9. 

నాట్యకళ 

మా తెనాలి వారి కంత బాగా తెలుసు కనకనే

మా తెనాల్లో పై ఊళ్ళవాళ్లు పరాభవం పొందారు.

పైనుంచి వచ్చి తెనాలి వారిని మెప్పించి పోయినవాడు గట్టిగా లెక్కిస్తే ఒక్క బళ్ళారి రాఘవాచారి గారే.


10. 

తెనాలిలో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది.

అది తెనాలి వాళ్ళ కన్నా

పై వాళ్ళకు తెలుస్తుంది.

తెనాలి నుండి బదిలీ అయిపోయి పోవలసి వస్తే ఉద్యోగానికి నీళ్ళొదలిన వాళ్లున్నారు.


ఏ పని మీదో వచ్చి 

తెనాలిలో వేళ్ళతో సహా పాతుకు పోయిన వాళ్ళున్నారు.

ఇంకే పనీ లేక తెనాలిలో ఉండటమే

జీవితాశయంగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు.


ఇందులో 

అతిశయోక్తి ఏమీ లేదు.

ఏ బస్తీలో కన్నా తెనాల్లో నిరుద్యోగులు అధికంగా ఉండటానికి కారణం ఈ ఆకర్షణే.

తెనాలి గురించి " వెధవ తెనాలి " అంటుంటే నమ్మకండి.

గవర్నరు గిరి వచ్చినా చేయడానికి

తెనాలి వాడు 

తెనాలి వదలడు.


11. 

మరి కొన్ని బస్తీల మాదిరిగా

తెనాలి అట్టే గొప్పవారిని చెప్పుకోక పోవడానికి కారణం..


బుద్ధిమంతుడు సులభంగా ఊహించవచ్చు.


మా తెనాలి వాళ్ళం 

ఇతర ఊళ్ళ మాదిరిగా 

ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్తం.


మా చవిలి నాగేశ్వర రావుకీ

మా గోవిందురాజు సుబ్బారావుగారికి

మా స్థానం వారికి,

మా మాధవపెద్దికి,

ఇతరులు బ్రహ్మరధం పట్టొచ్చు గాక

మేం పట్టం.


మాకు వాళ్ళు 

మామూలు మనుష్యులే.


వారిని ఆరాధిస్తూ కూర్చుంటే

ప్రపంచం ఆరాధించే మనుష్యుల్ని మేమెట్లా సృష్టించగలుగుతాం ?


మనుష్యుల్ని తయారు చేసి లోకం మీద వదలటం మాత్రమే మా వంతు.

మాస్టర్ అంజిని,

బసవలింగాన్ని,

పిల్లమర్రి సుందర రామయ్యనూ

మేమే తయారు చేసాం.


భీమవరపు నరసింహరావునూ, 

ప్రభల సత్యన్నారాయణనూ,

మేమే తయారు చేసాం.


ములుగు శివానందం గారు 

మా వాడు.

మా గొప్ప వాళ్ళెవరూ

మా ఊళ్ళో ఉండరు.

దేశాలు పట్టి పోతారు.

కాంచనమాలది మా ఊరే

ఆవిడా అంతే. 


మూడు కాలువలు నడుమ నడిచేదే తెనాలి

ఇలా ప్యారీస్ లోనూ

తెనాలి లోనే ఉంటుంది


అందుకే

*_తెనాలిని_*

*_ఆంద్రా ప్యారీస్ అంటారు_* 


*ఆంధ్రపత్రిక*

*12-2-1941*

*(కొకు వ్యాస ప్రపంచం నుంచి* )

ఈ గ్రూపులో తెనాలి వారికి అంకితం....😄

కామెంట్‌లు లేవు: