21, జులై 2024, ఆదివారం

మానవ జన్మ*

 *మానవత్వం*




మానవుడు అనేక జన్మల ఎత్తుతూ ఉండవచ్చు, *కాని సమాజానికి  తనవల్ల ప్రయోజనము ఏమిటి అనే విషయము ఆలోచించడము లేదు.*  సమాజము వల్ల తనకేమి లాభము అని ఆలోచించినంత కాలము అతను అజ్ఞానములో ఉన్నట్లే.  *సమాజానికి  ఏదో  సేవ చేయాలని భావిస్తున్నంత కాలము మనము  భగవంతునికి దగ్గరగా ఉంటాము, అనుగ్రహము పొందుతూనే ఉంటాము*. ఈలా దైవానికి దగ్గరగా ఉండటాన్ని గూడా మనము, ఆ కరుణను దైవానికి ఆపాదిస్తూనే ఋణపడి ఉన్నాము. ఎందుకంటే దైవము అపార కారుణ్య మూర్తి. దైవము అనేక విధాలుగా మనపై దయ చూపిస్తున్నాడు. ఆ దయ మూలంగానే మనము సుఖ సంతోషాలతో, శాంతులతో ఉన్నాము.


మనకు కష్టాలిచ్చినప్పుడు, మనలను శిక్షిoచ్చినప్పుడు, శిక్షిస్తున్నప్పుడు కూడా మనను దోష రహితులుగా శుద్ధిపరుస్తున్నట్లే. *కష్టాలు కష్టాలు కావు. మనకు ఇచ్చిన కష్టాలన్నీ కూడా మనలను కల్మష రహితులను చేయటమే*.  బాధలను అనుభవించిన తర్వాత అంతకు పూర్వము కన్నా నిర్మలంగా ఉంటాము. *కష్టాల తర్వాత మనము నిర్మలమైన, ఉన్నతమైన వ్యక్తిత్వముతో జీవనము సాగిస్తున్నందుకు మనము సంతోష పడాలి*, అంతే కాదు *కష్టాలను సరైన దృష్టితో అర్థం చేసుకుంటూ ఎల్లవేళలా ఇతరులకు సేవ చేయాలి, చేస్తూనే ఉండాలి*. కష్టాల బాధ మనకు తెల్సు కాబట్టి. 


ఆ సేవ ఇతరులకొరకు అనుకుంటాము కాని అది మనకోసమే. *ఈ కారణంగా భగవంతుడు మనకు కావల్సింది ఇవ్వడానికి ఇష్టపడతాడు*. మనము చేసే, చేయబోయే సేవ/సేవలు, మనకు రాబోయే అదృష్టానికి, పుణ్యానికి పెట్టుబడి/పెట్టుబడులు మాత్రమే. పూర్వ కాలంలోనే గాదు ఇప్పుడు కూడా ధర్మాత్ములు అన్న సత్రములు, ధర్మశాలలు స్థాపించి ఆర్తులకు కావల్సిన వసతులు కల్పిస్తున్నారు. 


*దాన ధర్మాలు అవిశ్రాంతంగా నిర్వహించిన మన పూర్వీకుల సంస్కృతి గొప్పది కావటము చేత ఈ రోజు మనము గొప్పగా, గర్వంగా చెప్పుకుంటున్నాము*. ఆ గొప్ప గుణాలను మనము మనసులో మాత్రమే దాచుకోకుండా, మనము  కూడా  వాటిని వారసత్వంగా స్వీకరిస్తే,  మన కొచ్చే కీర్తి ప్రతిష్టలతో బాటు, *మన వారసులు కూడా అంత గొప్పవారు కావడానికి మనము బీజము వేసినట్లే*. 


చాలా మందికి తెల్సు ఎలా సంపాదించాలో, ఎలా దాచుకొవాలో, *కాని దాన్ని ఎలా సద్వినియోగము చేయాలో అని తెలిసిన వాళ్లు కొద్దిమంది మాత్రమే*.


సమాజంలో ప్రతి పౌరుడు దాన కర్ణుడి లాగా, శిభి చక్రవర్తి లాగా ఆర్థుల సేవలో నిలవాలి, ఎదగాలి.  *గాలి బలం ప్రపంచానికి తెల్వదు సుడిగాలై చుట్టెంత వరకు, నీటి బలం తెల్వదు ఉప్పన అయి పోటెoత్త వరకు, విత్తు బలం తెల్వదు మొలకెత్తి మాను అయ్యేంత వరకు, ఆలాగే వ్యక్తులకు తెల్వదు సేవా రంగములో అడుగిడి సేవలకు ఉపక్రమించి విజయాలు సాధించే వరకు*. పరోపకారమే పుణ్యము, పుణ్య ఫలితమే సుఖము.


*చివరిగా.....* 

"స్వ పర హిత యోగ్యతాం జన్మ"

*తన హితముతో బాటు ఇతరుల హితము కొరునదే మానవ జన్మ*

ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: