4, జనవరి 2025, శనివారం

శ్రీ దత్త ప్రసాదం - 21

 శ్రీ దత్త ప్రసాదం - 21 – దిక్కుతోచని స్థితిలో అక్కరకు వచ్చిన సర్వస్య శరణాగతి


2007వ సంవత్సరం డిసెంబర్ నెల లో నాపై నా ఋణదాతలు వేసిన ఒకానొక కేసు నిమిత్తం విశాఖపట్నం లోని కోర్టుకు హాజరు కావాల్సివున్నది...రేపుదయం వాయిదా అనగా విశాఖపట్నం లోని మా లాయర్..ముందురోజు మధ్యాహ్నం ఫోన్ చేసి..నన్ను తప్పకుండా హాజరు కమ్మని చెప్పివున్నారు..ఆ ఫోన్ వచ్చే సమయానికి నేను మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో వున్నాను..వాయిదా ఏమైనా తీసుకునే అవకాశం వున్నదా అని లాయర్ గారిని అడిగాను..ఒక నెల వాయిదా దొరికితే..వాళ్లకు కొంత నగదు జమ చేయొచ్చు అని నా ఆలోచన.. కానీ..ఆయన..కుదరదు అని తేల్చిచెప్పారు..పైగా హాజరు కాకపోతే..జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారేమో అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చారు..ఇక చేసేదేమీ లేదు..విశాఖపట్నం వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని.."స్వామీ! నీదే భారం!.." అని మనసులో గట్టిగా అనుకొని వచ్చేసాను..


ఆరోజు రాత్రే విశాఖపట్నం కు రైలులో బయలుదేరి..మరుసటిరోజు ఉదయానికి చేరుకున్నాను..ఉదయం 10 గంటల కల్లా కోర్టు ఆవరణకు చేరి..మా లాయర్ గారిని కలిశాను.."ఈరోజు వాయిదా అడగాలని అనుకున్నాను కానీ..కుదరదండీ..జడ్జి గారు ఇటువంటి కేసులకు వాయిదాలు ఇవ్వటం లేదు..త్వరగా ముగించేయాలని చూస్తున్నారు.." అన్నారు..సరే..కానివ్వండి..జరిగేది జరుగుతుంది అని మాత్రం అన్నాను..


మరొక్కసారి శ్రీ స్వామివారి కి మనసులోనే నమస్కారం చేసుకొని ఓ ప్రక్కగా కూర్చున్నాను..ఎటువంటి ఆలంబన లేని పరిస్థితి లో ఆ దైవమే మనకు తోడుగా ఉంటాడు..కాకుంటే..మనం సర్వస్య శరణాగతి చెందాలి..ఆరోజు నేనున్న స్థితి లో నేను శ్రీ స్వామివారిని వేడుకోవడం తప్ప మరో మార్గం కనుపించలేదు..


మామూలుగా కోర్టు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది..నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను..పదకొండు గంటలు గడిచినా కోర్టు లో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు..విచారిస్తే..ఇంకా జడ్జి గారు రాలేదు..అన్నారు..మరి కొద్దిసేపటికే.."12 గంటల తరువాత అత్యవసర కేస్ లు మాత్రం విచారిస్తారు..మిగిలినవన్నీ వాయిదా వేయమన్నారు.." అని జడ్జి గారి దగ్గరుండే గుమాస్తా గారు చెప్పారు..నా తాలూకు కేస్ ను అత్యవసర జాబితా లోనే ఉంచారు కనుక..నేను కోర్టు లోనే ఉండిపోయాను..సరిగ్గా ఒంటిగంటకు జడ్జి గారు వచ్చారు..వరుస క్రమంలో పిలుస్తారు కనుక..నా వంతు వచ్చేసరికి..మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందని చెప్పారు..భోజనం చేసి తిరిగి కోర్టు వద్దకు వచ్చాను..


మూడు గంటలకు నా కేస్ విచారిస్తారని ఎదురుచూస్తూ వున్నాను..మూడున్నర అయింది..నాలుగయింది..జడ్జి గారు వేరే కేసుల విచారణ లో వున్నారు కానీ..నన్ను మాత్రం పిలవలేదు..కోర్టు లోనే వేచి చూస్తూ వున్నాను..సాయంత్రం 5.30 గంటలకు కూడా నా కేసు విచారణ కు రాలేదు..జడ్జి గారు బెంచ్ దిగి వెళ్లి పోయారు..ఏమీ అర్ధం కాలేదు..గుమాస్తా వద్దకు వెళ్లి..మధ్యాహ్నం నుంచీ వేచి ఉన్నాననీ.. కేస్ పిలువలేదనీ..కారణం చెప్పమని అడిగాను..నన్ను అక్కడే వుండమని చెప్పి..జడ్జి గారి దగ్గరకు వెళ్లి కనుక్కుని వస్తాను..అన్నారు..ఇంకొక ఐదు నిమిషాల్లో..జడ్జి గారు నన్ను తన ఛాంబరుకు రమ్మన్నారని చెప్పారు..వెళ్ళాను..జడ్జి గారికి నమస్కారం చేసి..నిలబడ్డాను.."ఈరోజు మీ కేస్ తీసుకోలేదు.." అంటూ..ప్రక్కనే ఉన్న కేలండర్ చూసి..మళ్లీ మార్చి నెలకు వాయిదా వేస్తున్నాను..అప్పుడు విచారణ చేస్తాను.." అని చెప్పి..వాయిదా వేసేశారు..నేను నెల వాయిదా దొరికితే చాలు అనుకున్నాను..కానీ..ఏకంగా మూడు నెలలు ఇచ్చారు..నమస్కారం పెట్టి ఇవతలికి వచ్చేసాను..


అక్కడితో శ్రీ స్వామివారి లీల అయిపోలేదు..కోర్టు నుంచి బైటకు రాగానే..అనుకోని సంఘటన ఒకటి జరిగింది..కోర్టు బైట నాకోసం..నా మీద కేస్ వేసిన కంపెనీ ప్రతినిధులు..వాళ్ళ లాయర్ గారూ..మా లాయర్ గారూ అందరూ వేచి చూస్తున్నారు..మా లాయర్ గారు.."ప్రసాద్ గారూ మీతో మాట్లాడి కేస్ ఇంతటితో ముగిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు..మీరొక మాట చెపితే..."అన్నారు..


ఇప్పటికిప్పుడు డబ్బు కట్టాలంటే...కష్టం కదా..అన్నాను..ఈసారి కంపెనీ ప్రతినిధే నేరుగా మాట్లాడాడు..ఒక అంగీకారానికి వచ్చాము..నేను ఇవ్వగలిగింది స్పష్టంగా చెప్పాను..అదికూడా ఒక నెల లోపు చెల్లిస్తానని చెప్పాను..వాళ్ళూ ఒప్పుకున్నారు..కేసు ఉపసంహరణకు కావాల్సిన సంతకాలు కూడా పూర్తి అయ్యాయి..అంతా ఒక గంటన్నర లోపలే జరిగింది..ప్రక్కరోజు ఆ కేసు మూసివేయడం కూడా చక చకా జరిగింది..వాయిదా దొరికితే చాలు అని అనుకున్న నాకు..అసలు కేసు కు హాజరే కాకుండా పూర్తి స్థాయి మినహాయింపు దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప! 

రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్


(మందిర వివరముల కొరకు :


కామెంట్‌లు లేవు: