17, జనవరి 2025, శుక్రవారం

మ్రొక్కులూ-త్రొక్కుళ్లు

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం గురుభ్యోనమః


మ్రొక్కులూ-త్రొక్కుళ్లు

(హితోక్తి)

డా.రఘుపతి శాస్త్రుల


వైకుంఠైకాదశినా

డాకాంక్షను భక్తజనములా బాలాజిన్

శ్రీ కైవల్యము గోరుచు

ప్రాకటముగ గనుట నెంచ పాపమ్మగునే?

(కైవల్యము=మోక్షము)


భక్తజనమ్ముల గములను

యుక్తిగ గనిపెట్టి వారి ఉరుకులు పరుగుల్

రక్తిగ చూడక, ప్రోవగ

శక్తులు గల రక్షకుల కసాధ్యమె కావన్

(గములు=సమూహములు-ప్రోవగ=ఆదుకోవడానికి)


తిరుమల వేంకటేశ్వరుని తృప్తిగ గాంచగ గోరి ఆశతో

నరిగెడు వారి పట్టుదలనంతయు కేవల మర్థకాంక్షతో

సరిగని ప్రోవకుండుటది సత్కృతియే తగినట్లు వారికిన్

సరిపడ రక్షణమ్ముల విశాల మతిన్ సమకూర్చ లేరొకో?

(అర్థ కాంక్ష= డబ్బే ధ్యేయంగా -సత్కృతి=గౌరవము)


బలగము లనునవి ప్రాణ

మ్ములను బలిగ గొనుటకో?సమున్నత గతులన్

పలువిధములుగా బ్రోవన్

తలపడి రక్షించు కొఱకొ? తలపగ వలయున్

(బలగములు=రక్షకభటులు)


అధికారుల గణములకును

ముదముగ నాయకుల సేవ మోదము నందన్

సదమల గతిసేయుటకై

మదిదలచిన, పేదజనుల మనుగడ ఎటులౌ?

(మనుగడ=బ్రతకడం)

కామెంట్‌లు లేవు: