*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*
*592 వ రోజు*
*ఉత్తమ ధర్మము*
ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో ధర్మములన్నీ చెప్పారు కదా ! వాటిలో ఆచరించతగిన ఉత్తమధర్మము ఏది ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని ధర్మములు ఉత్తమమైనవే పనికిరాని ధర్మము ఏదీ లేదు. వాటిలో వారివారికి నచ్చిన ధర్మాలు వారు ఆచరిస్తారు. తమకు నచ్చిన ధర్మాలను ఆచరించే జనులను అనేకులు మన జీవితంలో తారసపడతారు. ఒక సారి నారదుడు లోక సంచారము చేస్తూ దేవేంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు నారదమునిని తగురీతిని సత్కరించి ఉచితాసనమున కూర్చుండ పెట్టి " నారద మునీంద్రా ! నీవు అన్ని లోకములను సంచరిస్తుంటావు కదా ! నీకు ఎక్కడైనా అత్యంత ఆశ్చర్యకరమైనది కనిపించిందా ! " అని అడిగాడు. నారదుడు " గంగానదికి దక్షిణ తీరంలో మహాపద్మము అనే నగరములో భృగుడు అనే భ్రాహ్మణుడు నివసిసిస్తున్నాడు. అతడు ధర్మపరుడు, సత్యవాది, అహంసా వాది, ఇంద్రియనిగ్రహము కలవాడు, తనకు ఉన్న దానితో తృప్తిచెందే వాడు. కోపము అసలే లేని వాడు, తాను న్యాయంగా సంపాదించిన ధనముతో దేవ కార్యములు, పితృ కార్యములు, అతిథి సత్కారములు చేసే వాడు. అతడికి తగినట్లు వినయ సంపన్నులైన కుమారులు కలిగారు. అయినా అతడు సదా ఏ కార్యము చేస్తే మేలు కలుగుతుంది, ధర్మకార్యాలు ఏవి ఆలోచిస్తూ ఉండే వాడు. ఒకరోజు వారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.
*ఆత్మదర్శనం*
భృగుడు అతడికి అతిథి సకారాలు చేసి " అనఘా ! నేను ప్రతిరోజు ఆత్మ దర్శనం చేయడానికి ప్రత్నిస్తాను కాని నా మనసును ప్రాపంచిక విషయముల నుండి మరల్చలేక పోతున్నాను. కనుక నాకు ఆత్మదర్శనం సాధ్యం కావడం లేదు. నాకు మార్గము ఉపదేశించండి " అని అడిగాడు. భ్రాహ్మణుడు " భృగూ ! నేను కూడా ! నీ మాదిరి ఆత్మదర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ప్రాపంచక విషయాలలో పడి పొంద లేక పోయాను. నాకూ సరి అయిన దారి కనపడ లేదు. నాకు సరి అయిన మార్గము గోచరించ లేదు. కొందరు బ్రహ్మచర్యము వలన, కొందరు గృహస్థాశ్రమంలో ఉండి, మరి కొందరు తపమాచరించి, కొందరు యజ్ఞయాగములు చేసి, మరి కొందరు నిష్కామ కర్మలు చేసి మరి కొందరు ఆత్మదర్శనం పొందారు. కొంత మంది తల్లి తండ్రులను సేవించి, మరి కొందరు భక్తితో భవంతుడిని కొలిచి, కొందరు మంచి నడవడి ప్రవర్తనతో, కొందరు ఇంద్రియ నిగ్రహముతో ప్రఆశాంత జీవితము గడుపుతూ, కొంరౌ సత్యము, అహింస పాటించి ఆత్మ దర్శనం పొందుతారు. ఆత్మ దర్శనానికి అనేక కార్యములు ఉన్నా అది అంత సులువైనది మాత్రం కాదు. నైశారణ్యములో ఉన్న గోమతినదీ తీరాన మహాపద్మతటాకము తీరాన ఒక మహాసర్పము నివసిస్తుంది. ఆ మహాపద్మతటాక తీరంలో పూర్వము మాంధాత తపమాచరించాడని ప్రతీతి. అక్కడ ఉన్న నాగరాజు పేరు పద్ముడు. అతడు మహా ధర్మాత్ముడు, దయకల వాడు. అతడికి అతిథులంటే ప్రేమ ఎక్కువ. నీవు పద్ముడిని దర్శించి అతడి వద్ద ఉపదేశం పొంద వచ్చు " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి