24, డిసెంబర్ 2020, గురువారం

భాష్యములు


*భాష్యములు – వ్యాఖ్యానములు*.

బ్రహ్మసూత్రాలకు అనేక భాష్యాలు వెలువడ్డాయి. త్రిమతాచార్యులైన *శ్రీ శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు - ముగ్గురూ భాష్యాలు వ్రాశారు*.

ముందుగా *శంకరభగవత్పాదులవారు 'అద్వైత' పరంగా భాష్యం* వ్రాశారు. అప్పటికి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే సిద్ధాంతాలే లేవు. అప్పుడున్నది *అభేద వాదం, భేదా భేద వాదం, భేదవాదం* అనే వాదాలు మాత్రమే. ఆ తరువాత దాదాపు మూడువందల సంవత్సరాలకు *శ్రీ రామానుజాచార్యుల వారు 'విశిష్టా ద్వైత' పరంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాశారు. ఆ తరువాత 400 సంవత్సరాలకు 'ద్వైత' పరంగా శ్రీ మధ్వాచార్యుల వారు భాష్యం* వ్రాశారు. ఇలా ముగ్గురు ఆచార్యులు బ్రహ్మసూత్రాలకు తమ తమ సిద్ధాంతాల (మతముల) పరంగా భాష్యాలందించారు.

శంకరాచార్యులవారికి ముందుకూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసిన వారున్నారు. దాదాపు 10 భాష్యాలున్నాయి. అయితే వాటికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. శంకరుల వారి భాష్యం వచ్చేటప్పటికి అవి అసలు అదృశ్యమై పోయాయి. అవి సర్వాంగీకారంగా లేకపోవటం వల్లను, సూత్రాలకు భాష్యాలను అంత తృప్తికరంగా అందించలేకపోవటం వల్లను అవి కనుమరుగైపోయినవి. ఇప్పుడివి ఎంత వెతికినా కనిపించే స్థితిలో లేవు.

ఇక శంకరుల తరువాత కాలంలో కూడా దాదాపు 10 భాష్యాలు వచ్చాయి. అవి కూడా భేదవాదం, భేదాభేదవాదం, అభేదవాదం మొ||న అనేక వాదాలను ఆధారం చేసుకొనే వచ్చాయి. అవి కూడా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. కారణం సూత్రాలకు అవి తాత్పర్యంగా, సర్వాంగీకారంగా లేకపోవుటే. వీటిలో *కొన్ని భాష్యాలు మాత్రం ప్రచారంలోకి* వచ్చాయి. మొత్తం భాష్యాలు: ( మనకు అందినంతవరకు)

1. *అద్వైతపరంగా శంకరాచార్యుల వారి 'శారీరక మీమాంస'* (భాష్యం)

2. *విశిష్టా ద్వైత పరంగా రామానుజాచార్యుల వారి శ్రీ భాష్యం*

3. *ద్వైత పరంగా మధ్వాచార్యుల వారి 'పూర్ణ ప్రజ్ఞ భాష్యం'*

4. *ద్వైతాద్వైత పరంగా నింబార్కుల వారి భాష్యం*.

5. *శైవ విశిష్టా ద్వైత పరంగా శ్రీ కంఠుల భాష్యం- 'శైవ భాష్యం'* .

6. *శ్రీ పతి వారి 'శ్రీకర భాష్యం' వీరశైవ విశిష్టా ద్వైతం*.

7. *విజ్ఞాన భిక్షు భాష్యం. 'విజ్ఞానామృతం' (అవిభాగా ద్వైతం)*

8. *భాస్కరాచార్యుల వారి భాస్కర భాష్యం. భేదాభేదం*.

9. *వల్లభాచార్యుల అణు భాష్యం. శుద్ధా ద్వైతం*.

10. *బలదేవాచార్యుల వారి గోవిందభాష్యం- అచింత్య భేదాభేదం*.

ఇలా అనేక భాష్యాలు వెలువడ్డాయి. అయితే *అన్నింటిని పరిశోధించిన మహాత్ములు శంకర భాష్యమే సూత్రాలకు అనుగుణంగా ఉన్నదని తేల్చారు*.

శంకరభాష్యం బ్రహ్మసూత్రాలకు పరమతాత్పర్యం అని పండితులు, మహాత్ములు నిగ్గు తేల్చారు. *ఇతర భాష్యాలన్నీ 'శిశువులు' అన్నారు*.

కామెంట్‌లు లేవు: