21, డిసెంబర్ 2020, సోమవారం

మొగలిచెర్ల

 *స్వామివారి సమాధి ముచ్చట..(1వ భాగం)*


1976 జనవరి నెల రెండవ వారం లో సంక్రాంతి సెలవులకు నేను మావూరు మొగలిచెర్ల కు వచ్చాను..అప్పటికి నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను..మొగలిచెర్ల కు వచ్చిన ప్రక్కరోజే మా అమ్మగారు (పవని నిర్మల ప్రభావతి )  శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి వచ్చే బాధ్యతను ఎప్పటిలాగే నాకు అప్పజెప్పింది..సరే అన్నాను..ఆరోజు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి కోసం ఒక టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టి "స్వామివారు ఈమధ్య సరిగా ఆహారం తీసుకోవటం లేదు..ఆయన ధ్యానం లో ఉంటే..కొంచెం సేపు అక్కడివుండి..ఆయన చేతికి ఇచ్చేసి వచ్చేసేయ్.." అన్నది..అలాగే అని చెప్పి స్వామివారి ఆశ్రమం దగ్గరకు వెళ్ళిపోయాను..


ఆశ్రమం ప్రహరీ గోడ తలుపు తీసే ఉంది..లోపలికి వెళ్ళాను..స్వామివారు ధ్యానం చేసుకునే గది (ప్రస్తుతం ఆ గదినే శ్రీ స్వామివారి సమాధి మందిరం గా వ్యవహరిస్తున్నాము..) తలుపులు మూసి ఉన్నాయి..బావి వద్దకు వెళ్లి నీళ్ళు తోడుకొని..కాళ్ళూ చేతులు కడుక్కుని..వరండా లో కూర్చున్నాను..


పది నిముషాల తరువాత..శ్రీ స్వామివారు తలుపు తీసుకొని బైటకు వచ్చి.."నేను ధ్యానం లో ఉంటే..నాకోసం చూడకుండా నువ్వు తెచ్చిన డబ్బాను వంటగది లో పెట్టి పొమ్మని పోయినసారి నీకు చెప్పివున్నాను కదా..మళ్లీ నాకోసం ఎదురు చూడటం ఎందుకు?.." అన్నారు..


"మీరు వచ్చేదాకా వుండి, మీకు అందజేసి రమ్మని మా అమ్మ చెప్పింది..అందుకని.." అంటూ నసిగాను..


"అమ్మకు చాదస్తం ప్రసాదూ..నేను సరిగా ఆహారం తీసుకోవటం లేదని బెంగ..నా ధ్యాస ధ్యానం మీదే కానీ..అన్నం మీద కాదు కదా..ఆమాటే అమ్మకు చాలాసార్లు చెప్పాను..సరే..ఆమె తాపత్రయం ఆమెది.." అన్నారు.."ఈ పది రోజులూ నువ్వే వస్తావా..? " అన్నారు..అవును అన్నట్లు గా తలవూపాను..వంటగది లోకి వెళ్లి నా చేతిలో ఉన్న అన్నం డబ్బా ను అక్కడ ఉన్న బల్ల మీద పెట్టి.."వెళ్ళొస్తాను స్వామీ.." అన్నాను.."మళ్లీ వస్తావుగా.." అన్నారు..మళ్లీ రావడమేమిటి అనుకోని..రేపటి సంగతి గుర్తు చేస్తున్నారేమో అని నాకు నేనే భావించుకొని..సరే అన్నట్లుగా తలవూపి..తిరిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చాను..


ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ, శ్రీ స్వామివారి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీ మీరాశెట్టి గారు, స్వామివారి ప్రధమ శిష్యుడు శ్రీ చెక్కా కేశవులు గారు ఇద్దరూ మొగలిచెర్ల కు వచ్చారు..నాన్నగారు (పవని శ్రీధరరావు గారు ) నన్ను పిలిచి.."ఈరోజు మన పనివాడు ముసలయ్య పనిలోకి రాలేదు..మేము ముగ్గురమూ స్వామివారి వద్దకు వెళ్ళాలి..నువ్వు మన గూడుబండికి ఎద్దులు కట్టేసి..మమ్మల్ని  స్వామివారి ఆశ్రమానికి తీసుకెళ్లి, తిరిగి మన ఇంటికి చేరుస్తావా?.." అన్నారు..


"మళ్లీ వస్తావుగా.." అని స్వామివారు పొద్దున అడిగిన మాట గుర్తుకొచ్చింది..గబ గబా ఇంట్లోకి వెళ్లి, అమ్మతో ఉదయం స్వామివారితో జరిగిన సంభాషణ అంతా చెప్పాను.."మహానుభావుడు..ఆయనకు అన్నీ ముందే తెలుసు.." అన్నది అమ్మ..


ఎద్దులబండి తోలడం తెలిసున్న విద్యే కనుక ..పది నిమిషాల్లో బండి సిద్ధం చేసాను..నాన్నగారి తోపాటు మిగిలిన ఇద్దరినీ బండి ఎక్కించుకొని..శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..బండి దిగి ముగ్గురూ లోపలికి వెళ్లారు..బండిని ఒక ప్రక్కగా నిలిపి నేనూ లోపలికి వెళ్ళాను..


స్వామివారి సమాధి ముచ్చట తరువాయి భాగం రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: