1, మార్చి 2021, సోమవారం

మన మహర్షులు- 35

 మన మహర్షులు- 35


లోమశ మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹 


ఒకనాడు లోమశ మహర్షి 

అరణ్యక మహర్షి  వద్దకు రావడం జరిగింది.

అరణ్యకుడు ఆయనకి సాష్టాంగ నమస్కారంచేసి మహాత్మా! సంసార సాగరం నుంచి తరించే వుపాయం చెప్పండన్నాడు.


లోమశ మహర్షి 'వత్సా! 'రామ'మంత్రం కంటే సంసారం నుంచి దాటించే మంత్రం ఇంకొకటి లేదు. ఇది వేదశాస్త్ర పరమ రహస్యం ఇంతకంటే వేరు మంత్రాలు, ప్రతాలు, క్రతవులు, యోగాలు, యాగాలు, దానాలు, మౌనాలు ఏమీలేవు 'అని చెప్పాడు.

ఇంకా  శ్రీరామచంద్రమూర్తిని ఇలా వర్ణించాడు..


అయోధ్యలో చిత్రమండపంలో వున్న కల్పవృక్షం క్రింద వున్న నవరత్నాలు పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని, పూర్ణిమనాటి చంద్రుడిలా ఉండే మొహంతో నీలిరంగులో వుండే శరీరంతో, మణులు పొదిగిన కిరీటంతో, నల్లటి జుట్టుతో, మకర కుండలాల్తో, వైఢూర్యమణుల్లాంటి పలువరుసతో, పువ్వులావుండే నాలుకతో, శంఖంలాంటి మెడతో, ఎత్తైన భుజాల్లో, శుభలక్షణాలు కలిగిన ముక్కుతో, రకరకాలయిన ఆభరణాల్లో వున్న ఆజానుబాహువులయిన చేతుల్లో, లక్ష్మీనివాసము విశాలము అయిన వక్షస్థలంతో,

గంభీరమైన నాభి, మృదువైన పాదాలు కలిగి దేదీప్యమానంగా వెలిగే శ్రీరామచంద్రుణ్ణి మనసారా ధ్యానించి, చేతులారా పూజించి, నోరార భజించి చాలా సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. ఇంతకన్న సులభమయిన మార్గం లేదని చెప్పాడు లోమశ మహర్షి.


 లోమశ మహర్షి ఇంకా రామకథంతా చెప్తున్నాడు. అరణ్యక మహర్షి వింటూ

వున్నాడు.


వత్సా! త్రేతాయుగంలో సూర్యకులంలో విష్ణుమూర్తి నాలుగు రకాల ఆకృతుల్లో పుట్టాడు. లక్ష్మణుడితో కలిసి కౌశికుడి యజ్ఞం పాడుచేస్తున్న మారీచ సుబాహుల్ని చంపి అహల్యాశాపవిమోచనంచేసి, మిథిలకి వెళ్ళి శివధనుస్సు విరిచి సీతని వివాహం చేసుకున్నాడు. అప్పటికి రాముడికి పదిహేనో సంవత్సరం.


అరణ్యవాసానికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు చిత్రకూట పర్వతం మీద వుండి తర్వాత పంచవటి వెళ్ళాడు. అక్కడే రావణుడు సీతనెత్తుకుపోయాడు. మార్గశిర శుద్ధ  ఏకాదశినాడు రాత్రి హనుమంతుడు సీతని చూశాడు. ద్వాదశినాడు సీతని పలకరించి త్రయోదశినాడు లంకను కాల్చి పూర్ణిమనాడు తిరిగి వెళ్ళి ఏడోరోజు కి రాముణ్ణి కలిశాడు శ్రీరాముడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం అష్టమినాడు బయలుదేరి ఏడురోజులకి

సముద్రతీరం చేరుకుని దశమినాడు సేతువు మొదలుపెట్టి, త్రయోదశికి పూర్తి చేసి సైన్యాన్ని దాటించి శుక్ల ద్వాదశి నుంచి కృష్ణచతుర్ధి వరకు యుద్ధంచేసి రావణుణ్ణి చంపాడు.


మొత్తం డబ్బయి రెండు రోజులు పట్టింది యుద్ధానికి, పద్నాలుగు సంవత్సరాలు పూర్తవగానే రాముడు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్నాడు అప్పటికి రాముడికి నలభై రెండు, సీతకి ముఫ్ఫైయి మూడు సంవత్సరాలు. సీత

రావణుడి చెరలో పదకొండు నెలల పద్నాలుగు రోజులుంది. 


రాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు రధం నీ దగ్గరకి వస్తుంది. నువ్వు రాముని

చూసి ఆయన పాదాల దగ్గరే మోక్షం పొందుతావని లోమశ మహర్షి, అరణ్యక మహర్షికి చెప్పాడు.


 ఈ విధంగా  జరగబోయేది కచ్చితం గా తెలియజేశాడు లోమశ మహర్షి .


ఒకనాడు ఉత్కచుడు లోమశ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అనేక వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేశాడు. ఉత్కచుడి చర్యలకు లోమశ మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. పాము కుబుశాన్ని విడిచినట్లు నీవు శరీరాన్ని వదలిపెడతావని శపించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతడిలో కలిగిన పశ్చాత్తాపానికి లోమశుడు సంతోషించి నా శాపానికి తిరుగులేదు... కాబట్టి నీవు మరు జన్మలో శకటాసురునిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వల్ల మోక్షం పొందుతావని తెలిపాడు.


లోమశ మహర్షి ధర్మరాజు తదితరులను తీర్ధయాత్రలకు తీసుకువెళ్లి  భృగు తీర్థము, పుష్కరము, గయ మొదలైన 

తీర్ధమల  ప్రాశస్థ్యము తెలియజేస్తాడు.వారికి ధర్మసూత్రాలను బోధిస్తాడు.


లోమశమహర్షి ప్రణీతమైన 'లోమశసంహిత' ఆయుర్దాయాన్ని గురించీ, వివిధ రకాలైన మరణాలలోని తేడాలను గురించీ, తనదైన పంధాలో వివరించింది.


మన ప్రాచీన గ్రంధాలలో మానవులకు రాబోయే అరిష్టాలను ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు ఎన్నో చోట్ల మహర్షులచేత చర్చించబడ్డాయి.


వాటిని స్వీకరించి ఆచరించి మేలు పొందటం విజ్ఞుల లక్షణం. 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: